mla putta madhu
-
ఎమ్మెల్యే పుట్టా మధుకి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు సోమవారం సాయంత్రం డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడిండి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వెలుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు మధు అల్లుడిదని సమాచారం. అయితే ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. -
‘ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది’
హన్మకొండ: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దళిత యువకుని మర్మాంగాలు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ దుండగులను, వారికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పుట్టమధును వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళితరత్న బొమ్మల కట్టయ్య, మంద కుమార్‌మాదిగ లు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని వారు ఆరోపించారు. దళిత యువకున్ని దారుణంగా హత్య చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని వారు ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హత్యలో పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్త్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నేత చుంచు రాజేందర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
నయీం కేసులో డీజీపీని కలిసిన పుట్టా మధు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రికి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే పుట్టా మధు డీజీపీ అనురాగ్ శర్మకు చెప్పారు. గురువారం డీజీపీని కలిసిన ఆయన నయీం గ్యాంగ్ తదితర అంశాల గురించి డీజీపీకి వివరించారు. నయీంతో కలిసి ఆ కాంగ్రెస్ మాజీ మంత్రి పలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నయీం గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని పుట్టా మధు చెప్పారు. నయీంతో మాజీ మంత్రికి ఉన్న సంబంధాలపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. సదరు మాజీ మంత్రి చేసిన భూకబ్జాల వివరాలను డీజీపీకి సమర్పించినట్లు తెలిపారు. డీజీపీ సానుకూలంగా స్పందించి ఆధారాలను సిట్‌కు పంపిస్తామని అన్నారు. -
’ఎదుర్కోలేక నాపై బురద జల్లుతున్నారు’
-మాజీ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్: ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..గ్యాంగ్‌స్టర్ నయీంతో నాకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు.. నయీం కేసును సీబీఐకి అప్పగించేలా సీఎం కేసీఆర్ ను కోరాలన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని పుట్ట మధు ఆరోపించారు. -
'శ్రీధర్‌బాబుకు నయీంతో సంబంధాలు'
మంథని: మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు. ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డీజీపీ అనురాగ్ శర్మకు అందిజేస్తానని అన్నారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.