రూ.67 కోట్లతో
బస్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ
బెంగళూరు : నగరంలోని బీటీఎం లేఔట్లో రూ.67.62 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండు నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రెండెకరాల 18 కుంట్ల స్థలంలో నిర్మించే ఈ ఐదంతస్తుల బస్టాండ్ ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ పరిధిలో 1,115 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉందని, దానిని త్వరలోనే గుర్తించి బీఎంటీసీ బస్ స్టేషన్, ఉద్యోగులకు వసతి గృహాలు నిర్మిస్తామన్నారు.
పీణ్యాలో నిర్మించిన బసవేశ్వర బస్ స్టేషన్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. బెంగళూరు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సీఎన్జీ బస్సుల వినియోగం అవసరాన్ని కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు.
అనుమతి వచ్చిన వెంటనే వోల్వో బస్సులకు బదులు సీఎన్జీ బస్సులు ప్రవేశపెడతామని వివరించారు. బీఎంటీసీ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ ఏక్ రూప్ కౌర్ మాట్లాడుతూ... బీఎంటీసీ బస్సుల్లో మహిళలు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన సీట్లను వారికి కేటాయించకపోతే అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
కార్యక్రమంలో బీబీఎంపీ ప్రతిపక్ష నాయకుడు మంజునాథ్‌రెడ్డి, కార్పొరేటర్లు ఉదయ్‌శంకర్, మురుగేష్ మదలియార్, జీఎన్ఆర్ బాబు, కోరమంగళ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చామరాజు రెడ్డి, బీఎంటీసీ అదికారులు హాజరైనారు.