సెరెనా అలవోకగా...
మూడో రౌండ్లోకి ప్రవేశం
జొకోవిచ్, వావ్రింకా కూడా...
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
మెల్బోర్న్: ఎండ వేడిమికి కాస్త ఇబ్బంది పడ్డా.. కీలక సమయంలో అనుభవాన్ని రంగరించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడోరౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సెరెనా 7-5, 6-0తో రష్యా వెటరన్ ప్లేయర్ వెరా జ్వొనరేవాపై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్లో రెండు సెట్ పాయింట్లను కాపాడుకోగా... రెండో సెట్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ మొత్తంలో సెరెనా ఐదు, జ్వొనరేవా రెండు ఏస్‌లు సంధించారు. 12 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్న ఈ అమెరికా ప్లేయర్ 32 విన్నర్లతో చెలరేగిపోయింది. 24 సార్లు అనవసర తప్పిదాలు చేసినా... బేస్‌లైన్ ఆటతీరుకు తగ్గట్టుగా బలమైన సర్వీస్‌లతో జ్వొనరేవాను కట్టిపడేసింది. మరోవైపు ఐదింటిలో కేవలం రెండు బ్రేక్ పాయింట్లను మాత్రమే ఉపయోగించుకున్న రష్యా క్రీడాకారిణి సర్వీస్ నిలుపుకోవడంలో విఫలమైంది.
ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ క్విటోవా (చెక్) 6-2, 6-4తో మోనా బర్తెల్ (జర్మనీ)పై; 6వ సీడ్ రద్వాన్‌స్కా (పొలెండ్) 6-0, 6-1తో జాన్ లార్సన్ (స్విట్జర్లాండ్)పై; అజరెంకా (బెలారస్) 6-4, 6-2తో 8వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) పై నెగ్గి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు.
జొకోవిచ్ జోరు
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-0, 6-1, 6-4తో ఆండ్రీ కుజెనెత్సోవ్ (రష్యా)పై గెలిచి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెర్బియన్ బలమైన సర్వీస్‌లతో పాటు అద్భుతమైన గ్రౌండ్ స్ట్రోక్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 8 ఏస్‌లు కొట్టిన జొకోవిచ్ ఏడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/4), 7-6 (7/4), 6-3తో కోపిల్ (రొమేనియా) పై; 5వ సీడ్ నిషికోరి (జపాన్) 4-6, 7-5, 6-2, 7-6 (7/0)తో డుడిగ్ (క్రొయేషియా)పై; 8వ సీడ్ రావోనిక్ (కెనడా) 6-4, 7-6 (7/3), 6-3తో యంగ్ (అమెరికా)పై; 9వ సీడ్ ఫెరర్ (స్పెయిన్) 5-7, 6-3, 6-4, 6-2తో స్టకోవిస్కీ (ఉక్రెయిన్)పై; 12వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 4-6, 4-6, 7-6 (7/3), 4-0తో మన్నారినో (రిటైర్డ్) (ఫ్రాన్స్) పై; ముల్లర్ (లక్సెంబర్గ్) 7-6 (7/5), 1-6, 7-5, 6-1తో 13వ సీడ్ అగుట్ (స్పెయిన్)పై; జానోవిజ్ (పొలెండ్) 6-4, 1-6, 6-7 (3/7), 6-3, 6-3తో 17వ సీడ్ మోన్ఫీల్స్ (ఫ్రాన్స్)పై; 18వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 7-6 (7/5), 6-2, 6-4తో గ్రానోలర్పై గెలిచి మూడోరౌండ్కి చేరారు.
రెండో రౌండ్లో బోపన్న జోడి
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ రోహన్ బోపన్న-డానియెల్ నెస్టర్ (కెనడా) 7-6 (7/2), 7-5తో బగ్దాటిస్ (సైప్రస్) -మతోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. గంటా 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం గట్టిపోటీ ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో రెండు జంటలు చెరో 10 ఏస్‌లు సంధించగా, చెరో ఐదుసార్లు అనవసర తప్పిదాలు చేశాయి. అయితే బోపన్న-నెస్టర్ 87 పాయింట్లు గెలిస్తే, ప్రత్యర్థులు 5 పాయింట్ల తేడాతో వెనుకబడ్డారు. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి-జెర్జెన్ మెల్జర్ (ఆస్ట్రియా) 4-6, 3-6తో స్కెచ్వర్త్మెన్ (అర్జెంటీనా) -జీబాలోస్ (అర్జెంటీనా) చేతిలో ఓడారు.