ముంబై పేలుళ్ల చివరి బాధితుడు మృతి
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వరుస బాంబుపేలుళ్లలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న పరాగ్ సావంత్ (36) కన్ను మూశాడు. సుమారు తొమ్మిదేళ్ల పాటు కోమాలో మృత్యువుతో పోరాడిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. 2006, జులై 11న జరిగిన ముంబై వరుస రైలు పేలుళ్లలో సావంత్ తీవ్రంగా గాయపడ్డాడు. మెదడుకు తీవ్రం గాయం కావడంతో అప్పటి నుంచి కోమాలోనే ఉన్న సావంత్ 2008లో కొద్దిగా తేరుకున్నాడు. కానీ పరిస్థితి విషమించడంతో తిరిగి కోమాలోకి జారుకున్న సావంత్ ఇక తర్వాత కోలుకోలేదు. పరాగ్ సావంత్ మృతితో ఈ పేలుళ్లలో గాయపడిన బాధితులందరూ కన్నుమూసినట్టే.
సావంత్ కుటుంబానికి బీజీపీ ఎంపీ కిరీట్ సోమయ్య తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటన జరిగి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సావంత్ను కలుద్దామనుకున్నానన్నారు. ఈ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తొందరగా తేరుకోవాలని కోరుకున్నారు. బుధవారం సావంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా సావంత్ రైల్వేశాఖలో పనిచేసేవారు. విధులకు హాజరయ్యే క్రమంలో రైల్లో ప్రయాణిస్తుండగా దాడికి గురయ్యారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ముంబైలోని బాంద్రా, జోగేశ్వరి మాతుంగ, చర్చిగేట్ తదితర రైల్వే స్టేషన్లలో జరిగిన వరుస బాంబుపేలుళ్లో 209 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 700 మందికి పైగా తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే.