అనారోగ్యం తాళలేక విద్యార్థి ఆత్మహత్య
పాలకొండ/పాలకొండరూరల్, న్యూస్‌లైన్: అనారోగ్యం తాళలేక స్థానిక సత్యసాయి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వీరఘట్టం మండలం చలివేం ద్రి గ్రామానికి చెందిన కలమట ఉదయ్‌కుమార్(15) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు అనుబంధంగా ఉన్న వసతి గృహంలో ఉంటున్న ఉదయ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొన్నాడు. ఉదయం పాఠశాలకు హాజరైన ఉదయ్ కొద్దిసేపటి తర్వాత మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉందంటూ తోటి విద్యార్థులకు చెప్పి హాస్టల్‌కు వెళ్లాడు. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. హిస్నోఫీలియా, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టు, రెండుసార్లు ఆపరేషన్లు కూడా చేయించినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమా న్య ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఉదయ్ తమ్ముడు ప్రవీణ్ ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అన్న ఆత్మహత్య చేసుకోవడంతో ప్రవీణ్ ఖిన్నుడయ్యాడు.
తన చావుకు ఎవరూ
కారణం కాదంటూ సూసైడ్ నోట్
ఇదిలావుండగా ఉదయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలం వద్ద ఆయన దస్తూరీతో ఉన్న రెండు సూసైడ్ నోట్లు లభించాయి. తనను హాస్టల్ వార్డెన్‌తో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో బాగా చూసుకున్నారని, తాను చనిపోతున్నందుకు వారంతా క్షమించాలని కోరాడు. ఒక స్నేహితుడిని ఉద్దేశించి మరో నోట్లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నందుకు చింతిస్తున్నానని పేర్కొన్నాడు. ఉదయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తల్లిదండ్రులు రామకృష్ణ, సరోజని పాలకొండకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై ఎం.వినోద్‌బాబు వసతిగృహాన్ని సందర్శించి ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పంచనామా అనంతరం ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం నిర్వహించారు.