సినిమా రివ్యూ: రభస
ప్లస్ పాయింట్స్:
జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్
సమంత, ప్రణీత గ్లామర్,
బ్రహ్మానందం కామెడీ
మైనస్ పాయింట్స్:
రొటిన్ కథ, పేలవమైన కథనం
మితిమీరిన ఫైట్స్
ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస'
ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు.
సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే.
రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు.
జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు పనితీరు:
సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది.
'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి.
-రాజబాబు అనుముల