మూత్రం కలిపిన టీ తాగితే..అతీత శక్తులు?
ఇండోర్: అతీతశక్తులు వస్తాయన్న మూఢనమ్మంతో అత్తమామలు, భర్తను వేధించిన ఓ మహిళపై కేసు నమోదుకు ఇండోర్ జిల్లా కోర్టు ఆదేశించింది. గృహ హింస రక్షణ చట్టం సెక్షన్ 12 కింద కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే ..ఇండోర్‌కు చెందిన రేఖా నాగ్వంశీ అనే మహిళ మూత్రం కలిపిన టీ తాగమని అత్తమామలతో పాటు భర్తను తరచూ బలవంతం చేసేదట. శక్తి అమ్మవారిని గుడ్డిగా ఆరాధించే ఆమె, భర్త దీపక్‌ను కూడా పూజలు పునస్కారాలు చేయమని బలవంతం చేసేదట. అంతేకాకుండా తనకు పాద సేవ చేయమని నాగవంశీ నిరంతరం వేధించేదట.
కోడలు విపరీతధోరణితో మానసికంగా తాము చాలా క్షోభను అనుభవించామని రేఖా నాగ్వంశీ అత్త సూరజ్ బాయ్ ఆరోపిస్తున్నారు. మూత్రం కలిపిన టీ, మురికి వాసన వచ్చే ఆహారం తీసుకోవటం వల్ల తాము అనారోగ్యం పాలయినట్లు చెప్పారు. దీనిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె వాపోయారు.
పైగా అక్కడి మహిళా అధికారి సుష్మ భాస్కర్ కూడా తమ కోడలికే ఒత్తాసు పలికారని, పైపెచ్చు ఆమె చెప్పినట్టే చేయమని సూచించారని సూరజ్ బాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కోడలికి పోలీసు అధికారిగా పని చేస్తున్నసోదరుడి అండ ఉండటంతో పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. నిత్యం ఆమెతో ఘర్షణ పడి విసిగిపోయిన తాము చివరికి మహిళా శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు.
దీనిపై అధికారులు విచారణ చేపట్టిన రేఖా నాగ్వంశీపై భర్త, అత్తమామలు చేసిన ఆరోపణలు వాస్తవమేనని, తేలుస్తూ ఓ నివేదిక ఇచ్చారు. ఇండోర్ కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీనిపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.