జూ.ఎన్టీఆర్ పేరెత్తినందుకు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం నాయకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పార్టీ తెలంగాణ నేతలు సీట్లు అమ్ముకున్నారని నగర టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి బుధవారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
అదే సమయంలో తెలంగాణలో టీడీపీని బతికించాలంటే జూ.ఎన్టీఆర్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో నైషధం వ్యవహారశైలిని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు కట్టబెట్టమని డిమాండ్ చేసిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నగర అధ్యక్షుడు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు.
నైషధం సత్యనారాయణ మూర్తి రాంనగర్ డివిజన్ నుంచి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని, ఆయన భార్య అడిక్‌మెట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని, దీనిని క్రమశిక్షణా చర్యగా పరిగణిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడికి సస్పెండ్ చేసే హక్కు ఎక్కడిది? పార్టీ సీనియర్ నాయకుడినైన తనను సస్పెండ్ చేసే హక్కు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు ఎక్కడిదని నైషధం సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు.
గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చిన ఆయన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో వాగ్వివాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగానీ, క్రమశిక్షణా సంఘం చైర్మన్ గానీ తీసుకోవలసిన సస్పెన్షన్ నిర్ణయాన్ని గోపీనాథ్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను ఎన్టీఆర్ విగ్రహంకు సమర్పించారు.