Nano-technology
-
నానో టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు
‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ - కేన్సర్‌ను సులభంగా గుర్తించే లేజర్ల అభివృద్ధి - ముద్రించి వాడుకునేలా ‘సోలార్ సెల్స్’ టెక్నాలజీ - వేగంగా సమాచార ప్రసారానికి తోడ్పాటు సాక్షి, హైదరాబాద్ : భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ నానో టెక్నాలజీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుందని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ చెప్పారు. రెండు మూడు దశాబ్దాల క్రితం పరిచయమైన ఈ టెక్నాలజీ ఇప్పటికే కంప్యూటర్లు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై జరుగుతున్న పరిశోధనలను గమనిస్తే.. భవిష్యత్తులో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరగడం ఖాయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న ఓ కుగ్రామంలో పుట్టిన జగదీశ్... ఖమ్మంలో ప్రాథమిక విద్య, ఢిల్లీలో స్నాతకోత్తర విద్య అభ్యసించారు. ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. 26 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవలే ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మరింత సహకారానికున్న అవకాశాలను పరిశీలించేందుకు ఇటీవలే భారత్‌కు వచ్చిన చెన్నుపాటి జగదీశ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కేన్సర్‌ను గుర్తించే లేజర్లు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో అతి సూక్ష్మమైన లేజర్లను తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నాం. దాదాపు 300 నానోమీటర్ల వెడల్పు, ఐదు మైక్రాన్ల పొడవు మాత్రమే ఉండే ఈ లేజర్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయంటే.. మూలకాల స్థాయిలో మార్పులను కూడా గుర్తించవచ్చు. అలాంటి లేజర్లు పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే కేన్సర్‌ను చాలా తొందరగా గుర్తించవచ్చు. తద్వారా మెరుగైన చికిత్స అందించడం వీలవుతుంది. అంతేకాదు ఈ నానోలేజర్లను చాలావేగంగా ఆన్/ఆఫ్ చేయవచ్చు. ఫలితంగా వీటిని మరింత వేగంగా పనిచేసే కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్ల తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చు. సెకన్లలో జీబీల్లో సమాచారం డౌన్లోడ్ టెరాహెర్ట్జ్ తరంగాలను వాడడం ద్వారా భవిష్యత్తులో వైర్లెస్ కమ్యూనికేషన్ చాలా వేగంగా జరుగుతుంది. గిగాబైట్ల సమాచారాన్ని కూడా అతి తక్కువ సమయంలో డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు టెరాహెర్ట్జ్ పౌనఃపున్యాలను మరింత సమర్థమైన భద్రతా ఏర్పాట్లకు కూడా వాడుకోవచ్చు. విమానాశ్రయాల్లో ఎక్స్‌రేలకు బదులుగా వీటిని వాడడం ద్వారా ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలను గుర్తించడం సులువు అవుతుంది. విద్యార్థులకు అండగా.. నా (జగదీశ్) చిన్నప్పుడు కిరోసిన్ దీపాల వెలుతురులో చదువుకున్నా. చదువుకోవాలని ఉన్నా తగిన అవకాశాలు ఉండేవి కావు. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదన్న ఉద్దేశంతో గతేడాది చెన్నుపాటి విద్య, జగదీశ్‌ల పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు దాని ద్వారా సాయం అందిస్తున్నాం. ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది నలుగురు భారత విద్యార్థులు కూడా స్కాలర్షిప్ అందుకున్నారు. ఒకొక్కరికీ ఆరు వేల ఆస్ట్రేలియన్ డాలర్ల సాయంతోపాటు అత్యున్నత స్థాయి పరిశోధనశాలల్లో పనిచేసేందుకు వారికి అవకాశం కల్పించాం. నానో టెక్నాలజీతో సౌర విద్యుత్ నానో టెక్నాలజీ ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందుకునేందుకు మరికొంత కాలం పట్టే అవకాశముంది. అయితే సౌరశక్తిని మరింత సమర్థంగా వాడుకునే విషయంలో ఎంతో ప్రగతి సాధించాం. భవనాల కిటికీలే సౌరశక్తిని గ్రహించి విద్యుత్‌గా మార్చేలా కొన్ని పరిశోధనలు చేస్తున్నాం. కార్బన్ నానోట్యూబ్ల సాయంతో కాగితంపై అక్షరాలను ముద్రించినట్లుగా.. సోలార్ సెల్స్‌ను కూడా ముద్రించి వాడుకునే సమయం దగ్గరలోనే ఉంది. సేంద్రియ పదార్థాలతో తయారయ్యే ఈ సోలార్ సెల్స్ సామర్థ్యాన్ని మెరుగైన స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలి భారత దేశంలో యువత ఏదో ఉద్యోగం కోసం చదవడం కాకుండా.. సొంతంగా తామే నలుగురికి ఉద్యోగం కల్పించేం దుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ప్రభుత్వాలు కూడా ఇందుకు తగ్గట్టు తగిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అవకాశాలు కల్పించాలి. అమెరికాలో ఉన్న స్మాల్ బిజినెస్ రీసెర్చ్ ప్రోగ్రామ్లాంటివి అన్నిదేశాల్లో ఉండాలి. ఇతర రంగాల్లో అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు మళ్లుతున్నప్పటికీ.. ఏదో ఒక కంపెనీకి పనిచేయడం కంటే, సొంతంగా కంపెనీ స్థాపిస్తే వచ్చే సంతృప్తి వేరన్నది యువత గుర్తించాలి. ఓడిపోతామన్న భయంతో చాలా మంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ ఇవే విజయానికి మెట్లు. నేను కూడా ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాకే ఈ స్థాయికి చేరగలిగాను. -
నానో టెక్నాలజీతో పరిశుభ్రమైన నీరు
భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు బెంగళూరు: నానో టెక్నాలజీని నీటి శుద్ధీకరణలో వినియోగిస్తే దేశంలోని ప్రజలందరికీ పూర్తిగా పరిశుభ్రమైన నీటిని అందజేయవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు పేర్కొన్నారు. సోమవారమిక్కడ ‘నానో టెక్నాలజీ’ పై నిర్వహించిన సమావేశంలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నీరు రోజురోజుకు కలుషితమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో ఫ్లోరైడ్‌తో పాటు యురేనియం వంటి కాలుష్యాలు కలుస్తుండడంతో ప్రజల్లో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. అందువల్ల న్యా నో టెక్నాలజీ ద్వారా పూర్తిగా శుద్ధమైన నీటిని ప్రజలకు అందజేసేందుకు ఆస్కారం ఉందని అన్నారు. ఇక వ్యవసాయ రంగంలో సైతం న్యానో టెక్నాలజీని వినియోగించడం ద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించవచ్చని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా అన్నింటా నానో టెక్నాలజీని వినియోగించుకోవచ్చని సూచించారు. రోజురోజుకు ప్రకృతిలో వస్తున్న మార్పులు, పెరిగిపోతున్న వ్యాధులు, తదితరాలను ఎదుర్కొనడం అంత సులువైన విషయం కాదని, శాస్త్ర, సాంకేతిక రంగంలో సైతం వినూత్న ఆవిష్కరణలు వచ్చినప్పుడే ఈ సమస్యలను ఎదుర్కొనడం సాధ్యమవుతుందని అన్నారు. ఇక ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించి జపాన్, బ్రిటన్లు మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కాగా, బెంగళూరు ఇండియా నానో సమ్మేళనం బెంగళూరులోని హోటల్ లలిత్ అశోకాలో మార్చి 3 నుంచి 5వరకు కొనసాగనుందని ఈ సందర్భంగా సి.ఎన్.ఆర్.రావు వివరించారు. ఈ సమావేశంలో 60 మంది శాస్త్రవేత్తలు, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. -
నానో వైద్యం ఇంకెంత దూరం?
నానో టెక్నాలజీ గురించి తరచూ వింటూ ఉంటాం... ఇది అందుబాటులోకి వస్తే అద్భుతాలు జరిగిపోతాయని... మనిషి ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకూ మేలైన, మెరుగైన పరిష్కారాలు దొరుకుతాయని పత్రికల్లో, టీవీల్లో చూస్తూ ఉంటాం. కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న, ఈ మాటలు చేతలయ్యేదెప్పుడు? మిగిలిన వాటి మాటెలా ఉన్నా... ప్రాణాంతకమైన జబ్బులకు సంజీవిని అనదగ్గ నానోవైద్యం ఇంకెంత దూరం? 1959... ప్రపంచానికి నానో టెక్నాలజీ అన్న పదం పరిచయమైంది ఆ ఏడాదే. విఖ్యాత శాస్త్రవేత్త రిచర్డ్ ఫేమన్ ‘దేర్ ఈజ్ ప్లెంటీ రూమ్ అట్ ద బాటమ్’ శీర్షికతో చేసిన ప్రసంగం పరమాణుస్థాయి నానో శాస్త్రానికి, టెక్నాలజీకి బీజం వేయగా... ఎరిక్ డ్రెక్స్లర్ 1985లో ‘ద ఇంజిన్స్ ఆఫ్ క్రియేషన్’ ద్వారా జనసామాన్యంలోనూ విసృ్తత ప్రాచుర్యం కల్పించారు. నానో ఇంజిన్లు, సెల్ఫ్ రెప్లికేటింగ్ మెషీన్లతో ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించవచ్చునన్న ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం లేకపోలేదు. వైద్యాన్నే ఉదాహరణగా తీసుకుంటే నానోటెక్నాలజీ పూర్తి సామర్థ్యంతో కాకపోయినప్పటికీ ఎంతో కొంత పురోగతి సాధించిందని చెప్పకతప్పదు. డీఎన్ఏ రోబోలు... ఆధునిక వైద్యం మనిషి ఆయుఃప్రమాణాలను పెంచిందనడంలో ఎవరికీ సందేహం లేదు. అంతమాత్రాన ఇది పూర్తిస్థాయి ప్రభావశీల చికిత్స? కాకపోవచ్చు. కేన్సర్ చికిత్సనే తీసుకోండి. సమస్య కొన్ని కణాలది మాత్రమే. కాని చికిత్స మాత్రం మొత్తం శరీరానికి జరుగుతుంది. ఫలితంగా వ్యాధికారక కణాలతోపాటు ఇతర ఆరోగ్యకర కణాలు, అవయవాలపై దుష్ర్పభావం. నానోవైద్యంతో ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు డేనియల్ లెవ్నర్. ఈ హార్వర్డ్ విశ్వవిద్యాలయ బయో ఇంజినీర్ ప్రత్యేకంగా తయారు చేసిన డీఎన్ఏ పోగులే ఆయుధాలుగా కేన్సర్‌పై విజయం సాధించవచ్చునని చెబుతారు. ప్రొటీన్లను మోసుకెళ్లగల ఈ డీఎన్ఏ రోబోలు శరీరంలో ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితులకు తగ్గట్టుగా తెలివిగా వ్యవహరిస్తూ అటు వ్యాధులను ముందుగా గుర్తించగలగడంతోపాటు చికిత్స కూడా చేపట్టగలవని ఆయన అంచనా. కేన్సర్ ఛాయలున్న కణజాలంతో ఢీకొన్నప్పుడు మాత్రమే కీమోథెరపీ రసాయనాలను అతిసూక్ష్మ మోతాదులో ఆ ప్రాంతానికి మాత్రమే అందించేలా ఈ డీఎన్ఏ రోబోలను ప్రోగ్రామ్ చేయవచ్చు కూడా. నానోటెక్నాలజీ సాయంతో కేన్సర్‌ను అధిగమించేందుకు జరుగుతున్న మరో ప్రయత్నం సిలికా, బంగారు రజనులను కేన్సర్ కణితిలకు తగిలించి నాశనం చేయడం. ఈ పద్ధతిలోనూ కేవలం కేన్సర్ కణితపై మాత్రమే ప్రభావం పడుతుంది. నానో రజను ఈ కణితులు ఎక్కడున్నాయో గుర్తించేందుకు సాయపడుతుంది. వ్యాధి నిర్ధారణలోనూ... ముందుగా చెప్పుకున్నట్లు నానోటెక్నాలజీ వ్యాధుల నిర్ధారణలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అంతెందుకు.. శరీరంలోని రసాయనిక మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించగలిగే నానోస్థాయి పరికరాలతో వ్యాధి సోకకముందే వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా రోగుల ఆరోగ్య పరిస్థితిని క్షణక్షణం గుర్తించేందుకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేసేందుకు, క్వాంటం డాట్స్ సాయంతో ప్రొటీన్లను విశ్లేషించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొంతమేరకు విజయం సాధించారు కూడా. కొన్ని రకాల కేన్సర్లున్న కణజాలాన్ని ఈ పద్ధతి ద్వారా గుర్తించగలిగారు. మెదడు మిస్టరీలు ఛేదించేందుకు కూడా.... సైన్స్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలోనూ మన మెదడు పనితీరు గురించి తెలిసింది చాలా తక్కువే. నానోటెక్నాలజీ ద్వారా ఈ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నానోస్థాయి వజ్రపు రజనును మెదళ్లలోకి జొప్పించడం ద్వారా అక్కడి విద్యుత్ క్రియలను బయటి సెన్సర్లలో నమోదు చేయవచ్చునని ఏ రకమైన ఉద్వేగానికి ఎలాంటి స్పందన ఉంటుందో రియల్‌టైమ్‌లో గుర్తించవచ్చు కాబట్టి మెదడు పనితీరుపై మన అవగాహన మరింత పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తమ్మీద చూస్తే... ఇప్పటివరకూ ఉన్న వైద్యం ఒక ఎత్తై... నానో వైద్యం మరో ఎత్తు అన్నమాట!