Narasimha Nandi
-
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొదలైన సిగ్గు
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘సిగ్గు’ ఆదివారం ప్రారంభం అయింది. భీమవరం టాకీస్ పతాకంపై టి. రామసత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు కె.విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘చలంగారి నవల ‘సుశీల’ ఆధారంగా ‘సిగ్గు’ చేస్తున్నాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘సి.కల్యాణ్‌గారి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నాను’’ అన్నారు టి.రామసత్య నారాయణ. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, డైరెక్టర్ రేలంగి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సుక్కు, కెమెరా: అబ్బూరి ఈషే. -
నాలుగు జంటల ప్రేమకథ
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
ఫిల్మ్ ఫేర్‌కి జాతీయ రహదారి
నరసింహనంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటించారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌కు నామినేట్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ ‘జాతీయ రహదారి’ చిత్ర దర్శక, నిర్మాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ–‘‘రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని, 101వ సినిమా ‘జాతీయ రహదారి’ తో ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం. ఈ సినిమాకి నరసింహ నంది లాంటి డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. తెలుగు చిత్రసీమలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. తమిళంలో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా, మలయాళంలో తీసిన ‘జల్లికట్టు’ సినిమాలు ఆస్కార్ నామినేషన్‌కి వెళ్లాయి. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
జాతీయ రహదారికి అవార్డులు రావాలి
‘‘నరసింహనంది మా దగ్గర చాలా సినిమాలకు పనిచేశాడు. అతని డెడికేషన్ నాకు చాలా ఇష్టం. తన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు పలు అవార్డులు గెలుచుకున్నాయి.. ‘జాతీయ రహదారి’ సినిమాకి కూడా అవార్డులతో పాటు రివార్డులు రావాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ముఖ్యపాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్‌ని విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘శతాధిక చిత్రనిర్మాతగా నాకు పేరున్నా తృప్తి కలగలేదు. నర సింహ నంది దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ‘జాతీయ రహదారి’ సినిమాతో నంది (ఆంధ్రప్రదేశ్), సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం’’ అన్నారు. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను.. వాటిలో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నాను. రామసత్యనారాయణగారికి ఈ కథ నచ్చి, నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేశారు. ఆయనతో మరో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకొంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
ఓ ప్రేమ జంట జీవితం
నరసింహ నంది దర్శకత్వంలో అంతా కొత్తవారితో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 15న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్న సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘2011లో ‘1940లో ఒక గ్రామం’ చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, 3 నంది అవార్డులు అందుకున్నాను. 2013లో ‘కమలతో నా ప్రయాణం’ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. 2016లో తీసిన ‘లజ్జ’ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపించాను. ఇటీవలే యూత్ కోసం ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమా తీశాను. తాజా చిత్రం కరోనా లాక్ డౌన్లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల వల్ల ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం అయింది? అనే కథాంశంతో ఉంటుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సుకుమార్. -
వ్యతిరేకించినవాళ్లే సపోర్ట్ చేస్తున్నారు
‘‘డిగ్రీ కాలేజ్’ విడుదలకు ముందు పోస్టర్స్ చూసి సినిమాని ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులే చిత్రాన్ని చూశాక మనసుకు హత్తుకునే మంచి కథ ఉందని ప్రశంసిస్తున్నారు. అప్పుడు వ్యతిరేకించినవాళ్లే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు దర్శకుడు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా స్వీయ దర్శకత్వంలో నరసింహ నంది నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘కొన్ని రొమాంటిక్ సీన్స్ చూసి సినిమా మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మా మనవి. సినిమా చూశాక మాట్లాడమని కోరుతున్నాం. బలమైన కథ ఉంది. క్లైమ్యాక్స్ సీన్స్ ప్రేక్షకులను భావోద్యేగానికి గురి చేస్తున్నాయి. కుల వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. ‘1940 లో ఒక గ్రామం’ సినిమాని కుల వ్యవస్థపైనే తీశాను.. జాతీయ అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. ‘డిగ్రీ కాలేజ్’కి డబ్బులు కూడా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
అభ్యంతరకర పోస్టర్లను తొలగిస్తున్నాం
‘‘డిగ్రీ కాలేజ్’ సినిమా పోస్టర్లలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు స్టేషన్‌కి పిలిపించి అభ్యంతరకర పోస్టర్స్‌ను తొలగించమని చెప్పారు. నన్ను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అన్నారు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ చిత్రం నేడు విడుదలవుతోంది. విలేకరుల సమావేశంలో నరసింహ నంది, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, కొండయ్య మాట్లాడుతూ– ‘‘పోస్టర్లను చూసి సినిమా ఆపేస్తామనడం సమంజసం కాదు. అభ్యంతరకరంగా ఉన్న రెండు పోస్టర్స్‌ను వెంటనే తొలగించే పని మొదలు పెట్టాం. ఈ సినిమా ఆగిపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి’’ అన్నారు. -
ప్రముఖ డైరెక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడిపై నగర వాసులు బుధవారం కేసు నమోదు చేశారు. అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద అశ్లీలంగా సినీ పోస్టర్లు పెట్టారంటూ డైరెక్టర్ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన సంజీవరెడ్డి నగర్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హైస్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి సినిమాలను డైరెక్టర్ నర్సింహ నంది తెరకెక్కించారు. అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా అందుకున్నారు. 2008లో 1940లో ఒక గ్రామం చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం, నంది పురస్కారాన్ని పొందారు. 2013లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం-2కు తన సేవలందించారు. -
అంతర్జాతీయ చిత్రోత్సవానికి కమలతో...
అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న రివర్సైడ్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన ‘కమలతో నా ప్రయణం’ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు ఇసనాక సునీల్‌రెడ్డి, సిద్దార్థ్ బాగోలు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 1950 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శివాజీ, అర్చన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19 నుంచి ఈ చిత్రోత్సవాలు జరుగనున్నాయని, లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఓ మంచి ఆశయంతో తాము నిర్మించిన ఈ చిత్రానికి ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు.