
నరసింహ నంది, రామసత్యనారాయణ, విజయేంద్ర ప్రసాద్
‘‘నరసింహనంది మా దగ్గర చాలా సినిమాలకు పనిచేశాడు. అతని డెడికేషన్ నాకు చాలా ఇష్టం. తన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు పలు అవార్డులు గెలుచుకున్నాయి.. ‘జాతీయ రహదారి’ సినిమాకి కూడా అవార్డులతో పాటు రివార్డులు రావాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ముఖ్యపాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్‌ని విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘శతాధిక చిత్రనిర్మాతగా నాకు పేరున్నా తృప్తి కలగలేదు.
నర సింహ నంది దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ‘జాతీయ రహదారి’ సినిమాతో నంది (ఆంధ్రప్రదేశ్), సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం’’ అన్నారు. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను.. వాటిలో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నాను. రామసత్యనారాయణగారికి ఈ కథ నచ్చి, నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేశారు. ఆయనతో మరో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకొంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్ రెడ్డి.