రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన సాగుతోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు ధ్వజమెత్తారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట కార్మిక నాయకులు మూడు రోజుల రిలేదీక్షలను చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల అభివృద్ధి, సమస్యల ఆయన ఎజెండాలో లేవని ఎద్దేశా చేశారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వాలపై పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెంకటేశ్, నగర కార్యదర్శి గోపాల్, శ్రామిక మహిళ ఫోరం కన్వీనర్ దిల్షాద్, ఆశా వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, మధ్యాహ్న బోజన పథకం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి, మునిసిపల్ కార్మిక సంఘం నాయకుడు నాగభూషణం, ఆశా వర్కర్ల సంఘం నాయకురాళ్లు లక్ష్మి, పార్వతి, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.