పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయం
కొండమల్లేపల్లి : పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే మదర్ డెయిరీ ధ్యేయమని నార్మాక్స్ మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో జాతీయ పాడి ప్రణాళిక –1 లో భాగంగా ఎస్సీ, ఎస్టీ పాల ఉత్పత్తిదారులకు నిర్వహించిన పాడి పరిశ్రమపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నార్మాక్స్ యూనియన్ ద్వారా అందించే సాంకేతిక వనరులు, మార్కెటింగ్ వ్యవస్థ వంటి వాటిని వివరించారు. అనంతరం 2014–15 సంవత్సరంలో పదోతరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు, ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం పాల సంఘాల ఆధ్వర్యంలో చైర్మన్ జితేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జలందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వెంకట్‌రెడ్డి, ఎం.డి. రమేష్, డీజీఎం అశోక్, మేనేజర్ కృష్ణ, రమేష్, చంద్రమోహన్, ప్రభాకర్, ముత్తాని రవీందర్‌రెడ్డి, నగేష్, పాల సంఘాల డైరెక్టర్లు, పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.