రిలయన్స్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్
హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్(ఆర్‌ఎఫ్‌వైఎస్) జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంటు రెండో సీజన్ ప్రారంభమైంది. సమీప భవిష్యత్తులో భారత్‌ను బహుళ క్రీడల దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బుధవారం కోచిలో ఆర్‌ఎఫ్‌వైఎస్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ టోర్నీని ప్రారంభించారు. కోచిలోని రాజగిరి పబ్లిక్ స్కూల్లో వందలాది మంది పాఠశాల విద్యార్థుల కేరింత నడుమ భారత స్ట్రైకర్ సి.కే.వినీత్‌తో కలిసి నీతా అంబానీ ఈ సీజన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని 30 నగరాల్లో జరిగే ఈ టోర్నీకి ఆమె శ్రీకారం చుట్టారు.
''రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా స్ఫూర్తిని పెంచుతుంది. ఆర్‌ఎఫ్‌వైఎస్ ద్వారా ఏకీకృత క్రీడా వ్యవస్థను రూపొందించడమే మా లక్ష్యం. దీనిలో భాగంగా ఒలింపిక్ ప్రధాన క్రీడలన్నింటికీ సంపూర్ణ ప్రణాళిక మా దగ్గర ఉంది. దేశంలోని యువతకు క్రీడల ద్వారా తగిన అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం'' అని నీతా అంబానీ అన్నారు. దేశంలో గ్రామీణ స్థాయి నుంచి ఆటను ప్రోత్సహించడంలో ఆర్‌ఎఫ్‌వైఎస్ అతిపెద్ద టోర్నీగా అవతరించనుంది. వచ్చే ఐదు నెలల్లో 3000 విద్యా సంస్థల నుంచి 60 వేలకు పైగా చిన్నారులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. తొలి ఏడాది 8 ఐఎస్ఎల్ జట్ల వేదికల్లో ప్రారంభమైన ఈ టోర్నీ ఈ సారి బెంగళూరు, అహ్మదాబాద్, షిల్లాంగ్ , ఐజ్వాల్, ఇంఫాల్, హైదరాబాద్, జంషెడ్పూర్లలో కూడా జరుగనుంది. ఫుట్‌బాల్‌లో ప్రతిభకు పెట్టింది పేరైన కేరళ, గోవాలలోని ప్రతి పాఠశాల, కళాశాలకు ఆర్‌ఎఫ్‌వైఎస్ 2016-18 సీజన్ విస్తరించింది.
కోచిలోని నిర్మల కళాశాలకు చెందిన 20 ఏళ్ల అజిత్ శివన్ ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్లోకి అడుగుపెట్టడం ఆరంభోత్సవంలో ఆకట్టుకుంది. '' గత ఏడాది ఆర్‌ఎఫ్‌వైఎస్‌లో అజిత్ సత్తా చాటాడు. అతను నాణ్యమైన ఆటగాడినని నిరూపించాడు. వెంటనే బ్లాస్టర్స్ అతడిని ఎంపికచేసుకుంది. భవిష్యత్తులో మరింత మంది అజిత్ శివన్‌లను వెలుగులోకి తీసుకొస్తాం. గ్రామీణ స్థాయిలో క్రీడల్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం'' అని నీతా అంబానీ గర్వంగా ప్రకటించారు.
ఆర్‌ఎఫ్‌వైఎస్ జాతీయ ఫుట్‌బాల్ టోర్ని నాలుగు విభాగాల్లో జరుగుతోంది. జూనలియర్ బాలురు, సీనియర్ బాలురు, సీనియర్ బాలికలు, కళాశాల బాలురు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ప్రతి నగరంలో ప్రీ క్వాలిఫయింగ్ రౌండ్లతో పోటీలు ప్రారంభమవుతాయి. అందులో సత్తాచాటిన జట్లు మెయిన్ డ్రాలో బరిలో దిగుతాయి. విజేతలుగా నిలిచిన జట్లు జాతీయ స్థాయిలో తలపడతాయి. మెయిన్ డ్రా నుంచి ఫైనల్స్ వరకు మ్యాచ్‌ల వీడియో ఫుటేజీలను రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంచనుంది.
దేవవ్యాప్తంగా ఉన్న సహజసిద్ధమైన ప్రతిభావంతుల్ని గుర్తించడానికి ఇదెంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీడియో ఫుటేజీలను సాంకేతిక విశ్లేషణ కోసం పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రారంభ దశలోనే విద్యార్థుల లోపాల్ని సరిదిద్దవచ్చు. దేశంలో గ్రామీణ స్థాయిలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చిన్నారులు, యువత క్రీడ పట్ల ఆకర్షితులవడానికి ఈ టోర్నీ దోహదం చేయాలన్నది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ ఆశయం. ప్రతి చిన్నారి తన ప్రతిభను సానబెట్టుకోవడానికి ఒదికొ వేదిక కావాలన్నది ఆమె లక్ష్యం.