Neurosurgery
-
మూడు కాళ్లతో శిశువు జననం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మూడు కాళ్లతో జన్మించిన ఆడ శిశువుకు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతంగా మూడో కాలును తొలగించారు. జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరిజిల్లా చింతలపూడికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ, మోహన్‌రావు దంపతులకు మార్చి 4న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. బిడ్డకు నడుములోని వెన్నుపాము నుంచి మూడో కాలు బయటకొచ్చింది. దీంతో డెలివరీ చేసిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు శిశువుకు శస్త్రచికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఒక్క రోజు వయసున్న ఆడశిశువుకు త్రీడీ ఎమ్మారై, త్రీడీ సీటీస్కాన్ చేసి నడుము లోపలి భాగం నుంచి మూడో కాలు వచ్చినట్లు నిర్ధారించామని న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంతేకాకుండా, మూడో కాలి వద్ద పురుష జననాంగాలు ఏర్పడి, రెండు కాళ్లకు సంబంధించిన నరాలు మూడో కాలికి అతుక్కుని ఉన్నట్లు తెలిపారు. వైద్య పరిభాషలో దీనిని ‘లంబార్ మైలోమినింగో సీల్ విత్ ట్రై పెడస్ డిఫార్మెటీ’ అంటారని, ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటివరకు 25 మాత్రమే నమోదయ్యాయని వివరించారు. ప్రొఫెసర్ డాక్టర్ దత్తలూరి శేషాద్రి శేఖర్ ఆధ్వర్యంలో మార్చి 31న సుమారు మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి మూడో కాలిని తొలగించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల రూ.1.5 కోట్ల ఖరీదు చేసే అత్యాధునిక లైకా మైక్రోస్కోప్ వైద్య పరికరాన్ని తమ న్యూరోసర్జరీ వైద్య విభాగానికి అందించారని, ఈ పరికరం ద్వారానే ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలిగామన్నారు. ఆపరేషన్ ప్రక్రియలో మత్తు వైద్యుడు డాక్టర్ నాగభూషణం, న్యూరోసర్జరీ పీజీ వైద్యులు సత్య, ధీరజ్, విజయ్ పాల్గొన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైద్యులకు బిడ్డ తల్లిదండ్రులు కృతజ్ఙతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా డిస్క్ ఆపరేషన్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చేసే డిస్క్ ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం’ ద్వారా ఉచితంగా చేస్తున్నట్లు ప్రొఫెసర్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్లో ఇక నుంచి రెగ్యులర్‌గా కోత, కుట్లు లేని డిస్క్ ఆపరేషన్లు, డే కేర్ సర్జరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. -
మార్పు.. ఎవరి కోసం!
ఎన్టీఆర్ వైద్య సేవ టెండర్లలో మతలబు నిబంధనలకు నీళ్లొదిలి వ్యవహారం రూ.కోటి టర్నోవర్ అక్కర్లేదట.. ప్రభుత్వాసుపత్రిలో మాయాజాలం కర్నూలు(జిల్లా పరిషత్): ఎన్టీఆర్ వైద్యసేవ టెండర్లలో అధికారులు నిబంధనలకు నీళ్లొదిలారు. తమకు అనుకూలమైన వారికి పనులను కట్టబెట్టేందుకు టెండర్లలో మార్పు చేశారు. ఆసుపత్రిలో మందులు సప్లయ్ చేయాలంటే సంవత్సరానికి రూ.కోటి టర్నోవర్ ఉన్న వారే రావాలని, ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేసిన అనుభవం ఉండాలనేది పాత నిబంధన. కానీ ఈ నిబంధనను ఈసారి పక్కన పెట్టేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాన్సర్ రోగులకు మందులు, హృద్రోగులకు స్టెంట్లు, పరికరాలు, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ రోగులకు వాడే ఇన్‌ప్లాంట్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు తదితరాలు సప్లయ్ చేసేందుకు విడివిడిగా ఇటీవల ఆసుపత్రి అధికారులు ఏడాది గడువుతో టెండర్ పిలిచారు. ఏడాదికి లక్షల రూపాయల విలువ చేసే ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంట్రాక్టర్లు పోటీపడతారు. ఇందుకు సంబంధించి నియమ నిబందనలను టెండర్ కాపీతో జతపరిచారు. టెండర్ దక్కించుకున్న వారు ఒకేసారి కాకుండా రోగుల అవసరాలను బట్టి పరికరాలు, మందులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక్కో పనికి రూ.50వేలు డిపాజిట్ చేయాలి. టెండర్ దక్కకపోతే ఈ మొత్తాన్ని వారికి తిరిగిస్తారు. టెండర్ దాఖలు చేసే వారు తప్పనిసరిగా డీలర్షిప్ సర్టిఫికెట్, డ్రగ్ లెసైన్స్, ఆదాయపన్ను రిటర్న్స్, రెండేళ్ల కాలం నుంచి ఆడిట్ రిపోర్ట్, ఐదేళ్ల నుంచి సేల్స్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్, పాన్‌కార్డు కాపీ, రూ.5లక్షల వరకు సాల్వెన్సీ సర్టిఫికెట్, ఏదైనా ఆసుపత్రికి సరఫరా చేసిన అనుభవ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న వారు సమయానికి మందులు, పరికరాలు సరఫరా చేయకపోతే భవిష్యత్‌లో అతను టెండర్లో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. జేసీ సూచనల మేరకే మార్చాం గత సంవత్సరం రూ.కోటి టర్నోవర్ నిబంధన పెట్టడం వల్ల ఎక్కువ మంది టెండర్ వేయలేకపోయారు. అందుకే మూడుసార్లు టెండర్ పిలవాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో జాయింట్ కలె క్టర్ సూచనల మేరకు నియమ నిబంధనలు సవరించాం. - డాక్టర్ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్