new assembly building
-
Telangana: నయా ‘అసెంబ్లీ’పై నజర్.. నిర్మాణంలో ధోల్పూర్ ఎర్రరాయి!
సాక్షి, హైదరాబాద్: కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం అనువైన స్థలాలు వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి రోడ్డులోని పాటిగడ్డలో దాదాపు 40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైందని సమాచారం. కాగా ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాంగణంలో 17 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అసెంబ్లీ భవనం అక్కడ నిర్మించినా బాగానే ఉంటుందని సూచించినట్టు తెలిసింది. ఎర్రమంజిల్‌లో 2019లోనే భూమిపూజ.. రాష్ట్ర సచివాలయానికి కొత్తగా భవనం సమకూరటంతో ప్రభుత్వం ఇక అసెంబ్లీ భవనంపై దృష్టి పెట్టింది. వాస్తవానికి ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకొన్న సచివాలయ భవనంతో పాటు అసెంబ్లీ కొత్త భవన నిర్మాణానికి కూడా 2019లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సచివాలయ భవనాన్ని పాత భవనాలు కూల్చి అదే స్థానంలో నిర్మించగా, అసెంబ్లీ భవనాన్ని మాత్రం ఇర్రమ్ మంజిల్ (ఎర్రమంజిల్) ప్యాలెస్ ఉన్న స్థానంలో నిర్మించాలని నిర్ణయించి అక్కడ భూమి పూజ చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎర్రమంజిల్ భవనం వారసత్వ కట్టడం కావటం, అద్భుతమైన నిర్మాణ శైలితో కూడినది కావటంతో, దాన్ని కూల్చాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు ఆ భవనం ఉన్న ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తే భవిష్యత్తులో పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, ఆ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు నెలకొంటాయని అధికారులు నివేదించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అక్కడ అసెంబ్లీ భవన నిర్మాణ ఆలోచనను విరమించుకుంది. తర్వాత ప్రస్తుత అసెంబ్లీ భవనం ఉన్న చోటుకు పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్లో నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా అప్పట్లో జరిగింది. అయితే పబ్లిక్ గార్డెన్ నగరంలోనే తొలి అతిపెద్ద ఉద్యానవనం కావటం, అందులో ఇప్పటికీ వేల సంఖ్యలో చెట్లు ఉండటంతో దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అక్కడ అసెంబ్లీకైతేనే బాగుంటుంది! రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా సచివాలయం ముందున్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాధిపతులకు సమీకృత భవన సముదాయం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు జంట భవనాలను నిర్మించాలని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం, పాటిగడ్డ స్థలం పరిశీలనకు వచ్చాయి. ఇందులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం అయితే బాగుంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. అయితే అది అధికారులకు సంబంధించిన జంట భవనాల కోసం కన్నా అసెంబ్లీకైతేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు..! ప్రస్తుతం అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు సొంతంగా భవనాలున్నాయి. అవన్నీ విశాలంగానే ఉన్నాయి. అవి సచివాలయ భవనానికి కేవలం నాలుగైదు కి.మీ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విభాగాలన్నింటికీ సమీకృత భవన సముదాయం నిర్మిస్తే వేల సంఖ్యలో ఉద్యోగులు ఒక్కచోటకు రావాల్సి ఉంటుంది. పంచాయితీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాలు, రవాణా.. ఈ నాలుగు శాఖల భవనాల్లోనే ప్రస్తుతం మూడు వేల మంది పనిచేస్తున్నారు. ఇతర విభాగాలన్నింటినీ కలిపితే ఆ సంఖ్య మరింత భారీగా ఉంటుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణం ఇరుకు రోడ్ల మధ్య ఉన్నందున వాటితో పాటు, అక్కడికి దారితీసే ఇతర రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ చిక్కులేర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ విభాగాలను కొత్త భవనాల్లోకి తరలిస్తే, వాటికి ఉన్న ప్రస్తుత భవనాలు నిరుపయోగంగా మారతాయి.తదుపరి సమావేశాల్లో ఈ దిశలో చర్చ జరిగే అవకాశం ఉందని, దీనిపై సీఎం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. కొత్త అసెంబ్లీ భవనానికీ ధోల్పూర్ ఎర్రరాయి! రాజస్థాన్‌లోని ధోల్పూర్ గనుల నుంచి తెప్పించిన ఎర్ర రాయి.. భవిష్యత్తులో నిర్మించబోయే తెలంగాణ అసెంబ్లీ భవనానికి వినియోగిస్తారని సమాచారం. ఇటీవల కొత్త సచివాలయ భవనం కోసం ధోల్పూర్లో ఓ గని నుంచి దాదాపు 4 వేల క్యూబిక్ మీటర్ల ఎర్రరాయిని తెప్పించారు. దాన్ని సచివాలయ బేస్మెట్, భవనం పై భాగంలో వినియోగించారు. దానికి సరిపోగా మరో వేయి క్యూబిక్ మీటర్ల వరకు మిగిలింది. దీన్ని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయం ఉండే ఇర్రమ్మంజిల్కు తరలించారు. అక్కడి పురాతన ప్యాలెస్ ముందు భాగంలో నిల్వ చేశారు. అది ఖరీదైన రాయి కావటంతో.. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉంచారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి భవనాల నిర్మాణం జరుగుతోంది. వరంగల్‌లో రాష్ట్రంలోనే ఎత్తయిన ఆసుపత్రి భవనం రూపుదిద్దుకుంటుండగా, మరో పక్షం రోజుల్లో నిమ్స్ విస్తరణ పనులు మొదలు కానున్నాయి. అయితే ఆసుపత్రి భవనాలకు ఈ ఎర్రరాయి వినియోగం సరికాదని అధికారులు నిర్ణయించారు. ఇక సచివాలయం తరహాలోనే అసెంబ్లీ భవనాన్ని కూడా ప్రత్యేక డిజైన్‌తో నిర్మించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎర్ర రాయిని దానికి వినియోగిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త అసెంబ్లీ భవనానికి ఏ స్థలం అయితే బాగుంటుందో ఇప్పటివరకు తేలనప్పటికీ, నగిషీలకు బాగా నప్పే ధోల్పూర్ ఎర్రరాయి అయితే సిద్ధంగా ఉన్నట్టయింది. -
ఇది ట్రైలర్ మాత్రమే..
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా రావాల్సి ఉంది. అభివృద్ధితోపాటు టెర్రరిజాన్ని సమూలంగా అంతం చేయడం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు ముందు ఏంచెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నాం. ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ. మాది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం. చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్లారు (చిదంబరాన్ని ఉద్దేశించి).. – రాంచీ సభలో ప్రధాని మోదీ రాంచీ: బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ వంద రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని, సినిమా రావాల్సి ఉందని రాంచీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పామో అక్షరాలా అదే చేసి చూపిస్తున్నామనీ, ఈ 100 రోజుల పాలనే ఒక ఉదాహరణ అన్నారు. జార్ఖండ్ కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాంచీలో మాట్లాడారు. తమ ప్రభుత్వ 100 రోజుల పాలన ఒక మచ్చుతునక మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వమనీ, తాము చట్టానికి అతీతమని భావించిన వారంతా ఇప్పుడు జైలుకెళ్ళారనీ చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మూడు జాతీయ పథకాలను మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించారు. దేశంలోని గడపగడపకీ రక్షిత మంచి నీరు తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యత అనీ, అందుకే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చామనీ తెలిపారు. కశ్మీర్, లడక్‌ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశామనీ, అందులో భాగంగానే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేశామనీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఎన్డీఏ–2 వంద రోజుల పాలనలో ఆవిష్కృతమైనవేనని ఆయన గుర్తుచేశారు. రాంచీలో నూతన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు పెన్షన్ స్కీంని మోదీ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థులకోసం 462 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు నూతన సెక్రటేరియట్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ► ‘జాతీయ స్థాయి పథకాల ప్రారంభోత్సవానికి జార్ఖండ్ వేదికగా నిలుస్తోంది. గత సెప్టెంబర్ లో సైతం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ కూడా జార్ఖండ్‌లోని ప్రభాత్ తారా గ్రౌండ్ నుంచే ప్రారంభించాం. ఈ రోజు మూడు జాతీయస్థాయి సంక్షేమ పథకాలను సైతం ఇక్కడి నుంచి ప్రారంభించాం’ అని అన్నారు. ► ‘ఆదివాసీలతో సహా ప్రజలందరికీ సుపరిపాలన అందించడం ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆయుష్మాన్ భారత్, పీఎం జీవన్ జ్యోతి యోజన, జన్ ధన్ ఎకౌంట్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం ఆరంభించింది’ అని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడంలో జార్ఖండ్ ప్రజలు క్రియాశీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ► ‘మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని ఒక చోటికి సమీకరించి, దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడండి’ అంటూ మోదీ ప్రజలకు సూచించారు. కిసాన్ మాన్‌ధన్ యోజన ప్రధాని ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే 1,16,183 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ తెలిపారు. స్వరోజ్‌గార్ పెన్షన్ ఇక్కడ నుంచి ప్రారంభించిన మరో రెండు పథకాలు ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మన్ధన్ యోజన, స్వరోజ్‌గార్ పెన్షన్ స్కీంలు. వీటి ప్రకారం సైతం 60 ఏళ్ల తరువాత లబ్దిదారులకు ప్రతినెలా 3000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. జార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనం -
అప్పులుంటే అసెంబ్లీ కట్టకూడదా?
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వానికి అప్పులుంటే నిర్మాణ రంగంలో అభివృద్ధి పనులు చేయకూడదా?, అప్పులుంటే అసెంబ్లీ భవనాలు కట్టరాదని ఏవిధంగా ఉత్తర్వులివ్వాలో తెలపాలని ఎర్రమంజిల్ భవన కూల్చివేత కేసులో పిటిషనర్‌ను హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం శిథిలావస్థకు చేరిందని, ప్రభుత్వం అసెంబ్లీ సముదాయ భవనాల్ని నిర్మిస్తే ఏవిధంగా చట్ట వ్యతిరేకం అవుతోందో చెప్పాలని వారిని ఆదేశించింది. ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో అసెంబ్లీ భవనాల్ని నిర్మించాలనే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై గురువారం విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం పైవిధంగా ప్రశ్నించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. తెలంగాణ ఆవిర్భావం జరిగే నాటికి రాష్ట్ర అప్పులు రూ.70 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.1.90 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. అప్పులుంటే నిర్మాణాలు చేయకూడదా, కేంద్రానికి కూడా అప్పులు ఉంటాయని, ఈ పరిస్థితుల్లో కేంద్రం కూడా నిర్మాణ రంగం లో ఏమీ చేయకూడదా అని ధర్మాసనం ప్రశ్నిం చింది. ప్రతిపాదనలు, ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం తనకు తోచినట్లుగా చేస్తోందని మరో న్యాయవాది రచనారెడ్డి చెప్పడంపై ధర్మాసనం.. హైకోర్టులో రాజకీయ ప్రసంగాల మాదిరిగా చెప్పవద్దని, ఉద్వేగభరితంగా చెప్పడానికి ఇదేమీ ప్రజావేదిక కాదని వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్ భవనం శిథిలావస్థకు చేరింది కదా.. అని ప్రశ్నించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
‘కేసీఆర్.. పిచ్చి పనులు మానుకో’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభివర్ణించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు మద్దతు తెలపడాన్ని ఎంఐఎం మానుకోవాలని సూచించారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మాణానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు తాము నిర్వహించిన తమ ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ భవనం ఉండగా కొత్తది అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే తరాలకు తన పేరు తెలియాలన్న స్వార్ధంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ఆరోపించారు. కొత్త అసెంబ్లీ పేరుతో హెరిటేజ్ భవనాలు కూల్చటం దారుణమని, ఇలాంటి పిచ్చి పనులు కేసీఆర్ మానుకోవాలన్నారు. ప్రజల డబ్బు వృథా చేయటం సరికాదని, అన్నింటికన్నా ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అసెంబ్లీని ఫంక్షన్ హాల్‌గా, కౌన్సిల్‌ను లైబ్రరీగా మారుస్తామన్నారు. -
తెలంగాణకు తలమానికంగా అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే చట్ట సభల భవన సముదాయం తెలంగాణకు తలమానికంలా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలషించారు. భవన నమూనా తెలంగాణ వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండటమే కాకుండా ఆ భవన పరిసరాలు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భవనం చుట్టూ అందమైన ఉద్యానవనం ఉండాలని, దానికి తగినంత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో నిలిపేలా ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం భవన నమూనా తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భూ ఉపరితలంలో కాకుండా సెల్లార్ పార్కింగ్ అవసరమని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన వేదపండితుల సమక్షంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాలశాఖ భవనం ముందు భూమిపూజ నిర్వహించారు. నిజాం జమానాలో నిర్మించిన ఎర్రమంజిల్ ప్యాలెస్ భవనాన్ని తొలగించి శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్యాలెస్ కాకుండా పక్కనే ఉన్న నీటిపారుదలశాఖ కార్యాలయ భవనం, దాని ముందున్న రోడ్లు భవనాలశాఖలోని ఓ విభాగం కొనసాగుతున్న పురాతన కార్యాలయ భవనాన్ని తొలగించి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం కలుపుకొని కొత్త భవనాలను నిర్మించాలనేది ప్రణాళిక. దీనికి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో కాసేపు చర్చించారు. అసెంబ్లీ కార్యాలయ భవనంగా ఆర్ అండ్ బీ కార్యాలయం.... ఎర్రమంజిల్‌లో కొత్తగా నిర్మించిన రోడ్లు భవనాలశాఖ ప్రధాన కార్యాలయ భవనాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్‌గా వాడుకోనున్నారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ భవనంలో కలియతిరిగారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్యాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత ఏడో అంతస్తుకు వెళ్లి అక్కడి కార్యాలయాలను చూశారు. ప్రతి ఫ్లోర్‌కు ఓ ప్రధాన చాంబర్, ఇతర అధికారుల కార్యాలయాలు, సిబ్బంది గదులు, వాష్‌రూమ్‌లు... ఇలా అన్ని వసతులు ఉన్నందున అది అసెంబ్లీ సెక్రటేరియట్‌గా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఆ తర్వాత ఏడో అంతస్తు కారిడార్ నుంచి కొత్త భవనం నిర్మించబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచే అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన భవనం ఎక్కడ వస్తుంది, దాని చుట్టూ ఖాళీ స్థలం ఎంత మేర ఉంటుంది, అందులో ఉద్యాన వనాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, వాహనాల పార్కింగ్ ఎలా ఉంటుంది, భవనానికి అప్రోచ్ రోడ్డు ఎలా ఉండనుందనే విషయాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన భవనానికి రెండు వైపులా రెండు మార్గాలుండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రధాన రోడ్డు నుంచి భవనం మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంటుందని, అందులో చక్కటి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. స్తంభించిన ట్రాఫిక్... నూతన అసెంబ్లీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఎర్రమంజిల్‌కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. నేతలంతా ఎవరికివారుగా కార్లలో రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యేలు విడతలవారీగా రావటంతో, వారు వచ్చినప్పుడల్లా ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించారు. దీంతో ఇటు పంజాగుట్ట నుంచి అటు ఖైరతాబాద్ కూడలి వరకు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎర్రమంజిల్ రోడ్డుకు ఇరువైపులా నివాస సముదాయాలు, పెద్ద సంఖ్యలో వాణిజ్య భవన సముదాయాలు ఉండటం, రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం, మెట్రో రైలు స్టేషన్, ఆ పక్కనే మెట్రో మాల్ ఉండటంతో ఇప్పుడే ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. నూతన అసెంబ్లీ అందుబాటులో కి వస్తే సమావేశాలు జరిగే సమయాల్లో పరిస్థితి మరింత తీవ్రంగానే ఉంటుందని, ఈ సమస్య పరిష్కారానికి కూడా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
‘కొత్త సచివాలయ నిర్మాణంపై ఓటింగ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా, లేదా అనేదానిపై ఓటింగ్ పెడుగున్నట్టుగా మాజీ ఎంపీ వి. హనుమంతరావు చెప్పారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 26న(సెప్టెంబర్) ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలదాకా ఓటింగ్‌ను 20 కేంద్రాల్లో పెడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27న సోమాజిగూడలో ప్రజాభిప్రాయంపై కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తన ముద్ర, పేరుతో పాటు వాస్తు పిచ్చితో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని వీహెచ్ చెప్పారు. కొత్త సచివాలయం ద్వారా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడమేనన్నారు. దీనిపై బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పాలని ఆయన కోరారు. వాస్తు పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చెయోద్దని సీఎంను కోరారు. ఫలితాల తర్వాత అయినా సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పారావాలని వీహెచ్ ఆకాంక్షించారు. -
22.34 లక్షల మందికి ఉద్యోగాలు: గవర్నర్
-
22.34 లక్షల మందికి ఉద్యోగాలు: గవర్నర్
విశాఖపట్నం నగరంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఎంఓయూలు కుదిరాయని, దీనివల్ల 22.34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన ప్రసంగంలో చెప్పారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. మాన్యశ్రీ శాసనమండలి అధ్యక్షులు, శాసనసభ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరికీ అభినందనలన్నారు. 2017-18 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంయుక్త సమావేశాల్లో ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉంది, దీన్ని మహద్భాగ్యంగా భావిస్తున్నానని, స్వల్పకాలంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. గౌరవ సభ్యులారా 11.06 గంటలు.. మార్చి 6 2017.. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణాక్షరాల్లో నిలుస్తుందన్నారు. ఈ చారిత్రక ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని సమస్యలు ఎదురైనా, ప్రభుత్వం వాటన్నింటినీ ఎదుర్కొందని, బడ్జెట్ పరిమితులు, మౌలిక సదుపాయాల లేమి, పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమలుకాని హామీల వల్ల అనేక సమస్యలు వచ్చాయని.. అయినా గడిచిన రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించి సర్వతోముఖాభివృద్ధిని సాధించిందని అన్నారు. విశాఖపట్నంలో తొలిసారి నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 4.67 లక్షల కోట్ల విలువైన 328 ప్రతిపాదనలు వచ్చాయని, 2017 జనవరిలో వరుసగా రెండోసారి విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహించామని, దీనివల్ల 22.34 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రం మంచి స్పష్టతతో ఉందని, 2020 నాటికి దేశంలోనే టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం అనేవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించుకున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో ఏడాదిలోనే పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా వెళ్తున్నామన్నారు. కరువు నియంత్రణ చర్యలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం లాంటి విజయాలు సాధించినట్లు తెలిపారు. రాబోయే 14 ఏళ్ల పాటు డబుల్ డిజిట్ గ్రోత్ రేటును సాధిస్తామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెప్పానని, ఇప్పటికే ఈ దిశగా చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. డబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించామని, 2015-16లోనే 10.56 శాతం వృద్ధిరేటును సాధించామని చెప్పారు. 2016-17 ప్రథమార్థంలో 12 శాతానికి పైగా వృద్ధిరేటు ఉందన్నారు. వర్షపాతం లోటు ఉన్నా కూడా వ్యవసాయం, పశుగణవృద్ధి తదితర రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. సేవారంగంలో అత్యధిక వృద్ధి కనిపిస్తోంది.. దాంతో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 14 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు అందుతాయని, ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కొనసాగిస్తున్నందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలని తెలిపారు. దీన్ని తగిన సమయంలోనే పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క చుక్క నీటినీ కాపాడాలన్నది ప్రభుత్వ ధ్యేయమని.. ఇందుకోసం నీరు-చెట్టు, నీరు-ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి లాంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతితో అన్ని కుటుంబాలకు రక్షిత తాగునీటిని అందించాలన్నది తమ లక్ష్యమని, దీనికి సాధారణ బడ్జెట్ నిధులతో పాటు ఈఏపీ నిధులు కూడా ఇస్తున్నామని అన్నారు. సుభాష్ పాలేకర్ సూచించిన సహజ సాగు పద్ధతులను రాష్ట్రంలో అవలంబిస్తున్నామని తెలిపారు. రూ. 385 కోట్ల రుణమాఫీని ఉద్యాన పంటలకు కూడా వర్తింపజేశామన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా రూపొందిస్తామని, చేపల సాగుతో 14.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతోందని.. అందువల్ల ఏపీని ఆక్వాహబ్‌గా తయారుచేస్తామని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇంధనం రంగంలో ఏపీకి ఐదు అవార్డులు వచ్చాయని తెలిపారు. 2017 మార్చి నెలాఖరు నాటికి నగరాల్లో మొక్కలు నాటించే పని పూర్తిచేయిస్తామని, ఏడు మిషన్లు, ఐదుగ్రిడ్లతో రాష్ట్రాభివృద్ధి సాధిస్తామని అన్నారు. పర్యాటకం కూడా ఉపాధి కల్పన, ఆదాయవృద్ధికి మంచి మార్గమని.. అందువల్ల కర్నూలు, ప్రకాశం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుపతి, అన్నవరం, మహానంది లాంటి ఇతర పుణ్యక్షేత్రాలను కూడా పర్యాటక పరంగా వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే విజయవాడలో ఏడు ఐటీ కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయని అన్నారు. విశాఖలో కూడా ఈ కార్యకలాపాలను పరుగులు పెట్టిస్తామని తెలిపారు. సాధించిన విజయాలు ప్రోత్సాహకరంగా ఉన్నా.. వృద్ధివేగాన్ని కొనసాగించి, దార్శనికతను సాకారంచ ఏసుకోవాలంటే అభివృద్ధి ప్రక్రియలోని భాగస్వాములు అందరి నుంచి చర్యలు అవసరమని, అన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చివరి వరుసలోని చిట్టచివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధ ఫలాలు అందేలా చూడటం, ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆరోగ్యవంతమైన, సమ్మిళిత, శాంతియుత, ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు.