
గురువారం అసెంబ్లీ భవన సముదాయానికి శంకుస్థాపన సందర్భంగా భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే చట్ట సభల భవన సముదాయం తెలంగాణకు తలమానికంలా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలషించారు. భవన నమూనా తెలంగాణ వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండటమే కాకుండా ఆ భవన పరిసరాలు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భవనం చుట్టూ అందమైన ఉద్యానవనం ఉండాలని, దానికి తగినంత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో నిలిపేలా ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం భవన నమూనా తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భూ ఉపరితలంలో కాకుండా సెల్లార్ పార్కింగ్ అవసరమని పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం ఆయన వేదపండితుల సమక్షంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాలశాఖ భవనం ముందు భూమిపూజ నిర్వహించారు. నిజాం జమానాలో నిర్మించిన ఎర్రమంజిల్ ప్యాలెస్ భవనాన్ని తొలగించి శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్యాలెస్ కాకుండా పక్కనే ఉన్న నీటిపారుదలశాఖ కార్యాలయ భవనం, దాని ముందున్న రోడ్లు భవనాలశాఖలోని ఓ విభాగం కొనసాగుతున్న పురాతన కార్యాలయ భవనాన్ని తొలగించి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం కలుపుకొని కొత్త భవనాలను నిర్మించాలనేది ప్రణాళిక. దీనికి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో కాసేపు చర్చించారు.
అసెంబ్లీ కార్యాలయ భవనంగా ఆర్ అండ్ బీ కార్యాలయం....
ఎర్రమంజిల్‌లో కొత్తగా నిర్మించిన రోడ్లు భవనాలశాఖ ప్రధాన కార్యాలయ భవనాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్‌గా వాడుకోనున్నారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ భవనంలో కలియతిరిగారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్యాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత ఏడో అంతస్తుకు వెళ్లి అక్కడి కార్యాలయాలను చూశారు. ప్రతి ఫ్లోర్‌కు ఓ ప్రధాన చాంబర్, ఇతర అధికారుల కార్యాలయాలు, సిబ్బంది గదులు, వాష్‌రూమ్‌లు... ఇలా అన్ని వసతులు ఉన్నందున అది అసెంబ్లీ సెక్రటేరియట్‌గా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఆ తర్వాత ఏడో అంతస్తు కారిడార్ నుంచి కొత్త భవనం నిర్మించబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచే అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన భవనం ఎక్కడ వస్తుంది, దాని చుట్టూ ఖాళీ స్థలం ఎంత మేర ఉంటుంది, అందులో ఉద్యాన వనాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, వాహనాల పార్కింగ్ ఎలా ఉంటుంది, భవనానికి అప్రోచ్ రోడ్డు ఎలా ఉండనుందనే విషయాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన భవనానికి రెండు వైపులా రెండు మార్గాలుండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రధాన రోడ్డు నుంచి భవనం మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంటుందని, అందులో చక్కటి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
స్తంభించిన ట్రాఫిక్...
నూతన అసెంబ్లీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఎర్రమంజిల్‌కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. నేతలంతా ఎవరికివారుగా కార్లలో రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యేలు విడతలవారీగా రావటంతో, వారు వచ్చినప్పుడల్లా ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించారు. దీంతో ఇటు పంజాగుట్ట నుంచి అటు ఖైరతాబాద్ కూడలి వరకు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎర్రమంజిల్ రోడ్డుకు ఇరువైపులా నివాస సముదాయాలు, పెద్ద సంఖ్యలో వాణిజ్య భవన సముదాయాలు ఉండటం, రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం, మెట్రో రైలు స్టేషన్, ఆ పక్కనే మెట్రో మాల్ ఉండటంతో ఇప్పుడే ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. నూతన అసెంబ్లీ అందుబాటులో కి వస్తే సమావేశాలు జరిగే సమయాల్లో పరిస్థితి మరింత తీవ్రంగానే ఉంటుందని, ఈ సమస్య పరిష్కారానికి కూడా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment