22.34 లక్షల మందికి ఉద్యోగాలు: గవర్నర్
విశాఖపట్నం నగరంలో ఇటీవల నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఎంఓయూలు కుదిరాయని, దీనివల్ల 22.34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన ప్రసంగంలో చెప్పారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. మాన్యశ్రీ శాసనమండలి అధ్యక్షులు, శాసనసభ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరికీ అభినందనలన్నారు. 2017-18 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంయుక్త సమావేశాల్లో ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉంది, దీన్ని మహద్భాగ్యంగా భావిస్తున్నానని, స్వల్పకాలంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు.
గౌరవ సభ్యులారా 11.06 గంటలు.. మార్చి 6 2017.. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణాక్షరాల్లో నిలుస్తుందన్నారు. ఈ చారిత్రక ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని సమస్యలు ఎదురైనా, ప్రభుత్వం వాటన్నింటినీ ఎదుర్కొందని, బడ్జెట్ పరిమితులు, మౌలిక సదుపాయాల లేమి, పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమలుకాని హామీల వల్ల అనేక సమస్యలు వచ్చాయని.. అయినా గడిచిన రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించి సర్వతోముఖాభివృద్ధిని సాధించిందని అన్నారు. విశాఖపట్నంలో తొలిసారి నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 4.67 లక్షల కోట్ల విలువైన 328 ప్రతిపాదనలు వచ్చాయని, 2017 జనవరిలో వరుసగా రెండోసారి విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహించామని, దీనివల్ల 22.34 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
రాష్ట్రం మంచి స్పష్టతతో ఉందని, 2020 నాటికి దేశంలోనే టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం అనేవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించుకున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో ఏడాదిలోనే పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా వెళ్తున్నామన్నారు. కరువు నియంత్రణ చర్యలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం లాంటి విజయాలు సాధించినట్లు తెలిపారు. రాబోయే 14 ఏళ్ల పాటు డబుల్ డిజిట్ గ్రోత్ రేటును సాధిస్తామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెప్పానని, ఇప్పటికే ఈ దిశగా చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
డబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించామని, 2015-16లోనే 10.56 శాతం వృద్ధిరేటును సాధించామని చెప్పారు. 2016-17 ప్రథమార్థంలో 12 శాతానికి పైగా వృద్ధిరేటు ఉందన్నారు. వర్షపాతం లోటు ఉన్నా కూడా వ్యవసాయం, పశుగణవృద్ధి తదితర రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. సేవారంగంలో అత్యధిక వృద్ధి కనిపిస్తోంది.. దాంతో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 14 లక్షల ఎకరాలకు పైగా నీళ్లు అందుతాయని, ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కొనసాగిస్తున్నందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలని తెలిపారు. దీన్ని తగిన సమయంలోనే పూర్తి చేస్తామన్నారు.
పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క చుక్క నీటినీ కాపాడాలన్నది ప్రభుత్వ ధ్యేయమని.. ఇందుకోసం నీరు-చెట్టు, నీరు-ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి లాంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతితో అన్ని కుటుంబాలకు రక్షిత తాగునీటిని అందించాలన్నది తమ లక్ష్యమని, దీనికి సాధారణ బడ్జెట్ నిధులతో పాటు ఈఏపీ నిధులు కూడా ఇస్తున్నామని అన్నారు. సుభాష్ పాలేకర్ సూచించిన సహజ సాగు పద్ధతులను రాష్ట్రంలో అవలంబిస్తున్నామని తెలిపారు. రూ. 385 కోట్ల రుణమాఫీని ఉద్యాన పంటలకు కూడా వర్తింపజేశామన్నారు.
రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా రూపొందిస్తామని, చేపల సాగుతో 14.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతోందని.. అందువల్ల ఏపీని ఆక్వాహబ్‌గా తయారుచేస్తామని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇంధనం రంగంలో ఏపీకి ఐదు అవార్డులు వచ్చాయని తెలిపారు. 2017 మార్చి నెలాఖరు నాటికి నగరాల్లో మొక్కలు నాటించే పని పూర్తిచేయిస్తామని, ఏడు మిషన్లు, ఐదుగ్రిడ్లతో రాష్ట్రాభివృద్ధి సాధిస్తామని అన్నారు. పర్యాటకం కూడా ఉపాధి కల్పన, ఆదాయవృద్ధికి మంచి మార్గమని.. అందువల్ల కర్నూలు, ప్రకాశం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుపతి, అన్నవరం, మహానంది లాంటి ఇతర పుణ్యక్షేత్రాలను కూడా పర్యాటక పరంగా వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే విజయవాడలో ఏడు ఐటీ కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయని అన్నారు. విశాఖలో కూడా ఈ కార్యకలాపాలను పరుగులు పెట్టిస్తామని తెలిపారు.
సాధించిన విజయాలు ప్రోత్సాహకరంగా ఉన్నా.. వృద్ధివేగాన్ని కొనసాగించి, దార్శనికతను సాకారంచ ఏసుకోవాలంటే అభివృద్ధి ప్రక్రియలోని భాగస్వాములు అందరి నుంచి చర్యలు అవసరమని, అన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చివరి వరుసలోని చిట్టచివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధ ఫలాలు అందేలా చూడటం, ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆరోగ్యవంతమైన, సమ్మిళిత, శాంతియుత, ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు.