సాక్షి, హైదరాబాద్: కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం అనువైన స్థలాలు వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి రోడ్డులోని పాటిగడ్డలో దాదాపు 40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైందని సమాచారం. కాగా ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాంగణంలో 17 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అసెంబ్లీ భవనం అక్కడ నిర్మించినా బాగానే ఉంటుందని సూచించినట్టు తెలిసింది.
ఎర్రమంజిల్‌లో 2019లోనే భూమిపూజ..
రాష్ట్ర సచివాలయానికి కొత్తగా భవనం సమకూరటంతో ప్రభుత్వం ఇక అసెంబ్లీ భవనంపై దృష్టి పెట్టింది. వాస్తవానికి ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకొన్న సచివాలయ భవనంతో పాటు అసెంబ్లీ కొత్త భవన నిర్మాణానికి కూడా 2019లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. సచివాలయ భవనాన్ని పాత భవనాలు కూల్చి అదే స్థానంలో నిర్మించగా, అసెంబ్లీ భవనాన్ని మాత్రం ఇర్రమ్ మంజిల్ (ఎర్రమంజిల్) ప్యాలెస్ ఉన్న స్థానంలో నిర్మించాలని నిర్ణయించి అక్కడ భూమి పూజ చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఎర్రమంజిల్ భవనం వారసత్వ కట్టడం కావటం, అద్భుతమైన నిర్మాణ శైలితో కూడినది కావటంతో, దాన్ని కూల్చాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు ఆ భవనం ఉన్న ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తే భవిష్యత్తులో పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, ఆ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు నెలకొంటాయని అధికారులు నివేదించారు.
వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అక్కడ అసెంబ్లీ భవన నిర్మాణ ఆలోచనను విరమించుకుంది. తర్వాత ప్రస్తుత అసెంబ్లీ భవనం ఉన్న చోటుకు పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్‌లో నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా అప్పట్లో జరిగింది. అయితే పబ్లిక్ గార్డెన్ నగరంలోనే తొలి అతిపెద్ద ఉద్యానవనం కావటం, అందులో ఇప్పటికీ వేల సంఖ్యలో చెట్లు ఉండటంతో దాన్ని కూడా పక్కన పెట్టేశారు.
అక్కడ అసెంబ్లీకైతేనే బాగుంటుంది!
రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా సచివాలయం ముందున్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాధిపతులకు సమీకృత భవన సముదాయం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు జంట భవనాలను నిర్మించాలని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం, పాటిగడ్డ స్థలం పరిశీలనకు వచ్చాయి. ఇందులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం అయితే బాగుంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. అయితే అది అధికారులకు సంబంధించిన జంట భవనాల కోసం కన్నా అసెంబ్లీకైతేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు..!
ప్రస్తుతం అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు సొంతంగా భవనాలున్నాయి. అవన్నీ విశాలంగానే ఉన్నాయి. అవి సచివాలయ భవనానికి కేవలం నాలుగైదు కి.మీ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విభాగాలన్నింటికీ సమీకృత భవన సముదాయం నిర్మిస్తే వేల సంఖ్యలో ఉద్యోగులు ఒక్కచోటకు రావాల్సి ఉంటుంది. పంచాయితీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాలు, రవాణా.. ఈ నాలుగు శాఖల భవనాల్లోనే ప్రస్తుతం మూడు వేల మంది పనిచేస్తున్నారు.
ఇతర విభాగాలన్నింటినీ కలిపితే ఆ సంఖ్య మరింత భారీగా ఉంటుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణం ఇరుకు రోడ్ల మధ్య ఉన్నందున వాటితో పాటు, అక్కడికి దారితీసే ఇతర రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ చిక్కులేర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ విభాగాలను కొత్త భవనాల్లోకి తరలిస్తే, వాటికి ఉన్న ప్రస్తుత భవనాలు నిరుపయోగంగా మారతాయి.తదుపరి సమావేశాల్లో ఈ దిశలో చర్చ జరిగే అవకాశం ఉందని, దీనిపై సీఎం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.
కొత్త అసెంబ్లీ భవనానికీ ధోల్పూర్ ఎర్రరాయి!
రాజస్థాన్‌లోని ధోల్పూర్ గనుల నుంచి తెప్పించిన ఎర్ర రాయి.. భవిష్యత్తులో నిర్మించబోయే తెలంగాణ అసెంబ్లీ భవనానికి వినియోగిస్తారని సమాచారం. ఇటీవల కొత్త సచివాలయ భవనం కోసం ధోల్పూర్‌లో ఓ గని నుంచి దాదాపు 4 వేల క్యూబిక్ మీటర్ల ఎర్రరాయిని తెప్పించారు. దాన్ని సచివాలయ బేస్‌మెట్, భవనం పై భాగంలో వినియోగించారు. దానికి సరిపోగా మరో వేయి క్యూబిక్ మీటర్ల వరకు మిగిలింది. దీన్ని రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ కార్యాలయం ఉండే ఇర్రమ్‌మంజిల్‌కు తరలించారు.
అక్కడి పురాతన ప్యాలెస్ ముందు భాగంలో నిల్వ చేశారు. అది ఖరీదైన రాయి కావటంతో.. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉంచారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి భవనాల నిర్మాణం జరుగుతోంది. వరంగల్‌లో రాష్ట్రంలోనే ఎత్తయిన ఆసుపత్రి భవనం రూపుదిద్దుకుంటుండగా, మరో పక్షం రోజుల్లో నిమ్స్ విస్తరణ పనులు మొదలు కానున్నాయి. అయితే ఆసుపత్రి భవనాలకు ఈ ఎర్రరాయి వినియోగం సరికాదని అధికారులు నిర్ణయించారు.
ఇక సచివాలయం తరహాలోనే అసెంబ్లీ భవనాన్ని కూడా ప్రత్యేక డిజైన్‌తో నిర్మించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎర్ర రాయిని దానికి వినియోగిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త అసెంబ్లీ భవనానికి ఏ స్థలం అయితే బాగుంటుందో ఇప్పటివరకు తేలనప్పటికీ, నగిషీలకు బాగా నప్పే ధోల్పూర్ ఎర్రరాయి అయితే సిద్ధంగా ఉన్నట్టయింది.
Telangana: నయా ‘అసెంబ్లీ’పై నజర్.. నిర్మాణంలో ధోల్పూర్ ఎర్రరాయి!
Published Thu, Jun 1 2023 1:05 AM | Last Updated on Thu, Jun 1 2023 3:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment