ఖాకీ వనంలో గంజాయి మొక్కలు
పోలీసులు.. క్రమశిక్షణకు మారు పేరు. విధుల పట్ల పలువురికి ఆదర్శంగా ఉంటారని కూడా పేరు. కందుకూరులో పోలీసు పాలన పూర్తిగా గాడి తప్పింది. ఖాకీ వనంలో అక్కడక్కడా గంజాయి మొక్కలు ఉన్నాయి. ఫలితంగా అధికారుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. దీనికి తోడు టీడీపీ ముఖ్యనేత ఒత్తిళ్లు.. అవినీతి అరోపణలు.. వెరసి పోలీస్‌శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు నీరుగార్చడం.. ఇసుక అక్రమాలకు సహకరించడం ఇక్కడి పోలీసులకు వెన్నతో పెట్టిన విద్య. విషయాన్ని పసిగట్టిన జిల్లా బాస్.. ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కొందరు ఎస్సైలను వీఆర్‌కు పంపారు. తాజాగా డీఎస్పీ స్థాయి అధికారిని ఆయన బదిలీ చేయించడం.. పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది.
- కందుకూరులో పోలీస్ అధికారుల మధ్య అంతర్గతపోరు
- పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకున్న ఖాకీలు
- అధికార పార్టీ ముఖ్యనేత భజనలో మరికొందరు
- ఇప్పటికే పలువురు ఎస్సైలపై ఎస్పీ బదిలీ వేటు
- తాజాగా డీఎస్పీని కూడా బదిలీ చేయించిన బిగ్‌బాస్
- బాధ్యతలు స్వీకరించిన కొత్త డీఎస్పీ
కందుకూరు : కందుకూరు పోలీస్ సబ్‌డివిజన్.. అధికారుల అవినీతి అక్రమాలకు పెట్టింది పేరు. ప్రధానంగా ఇక్కడ పని చేసిన ఉన్నతాధికారి సిబ్బందిని అదుపులో పెట్టడంలో విఫలమయ్యారనే వాదన బలంగాఉంది. డివిజన్ కేంద్రంలో పోలీస్ అధికారుల మధ్య అంతర్గతపోరు తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఎస్పీకి ఫిర్యాదు చేసుకునే స్థాయికి చేరింది. కొందరు ఎస్సైలు ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేసులను నీరుగార్చేందుకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల లింగసముద్రం ఎస్సైని వీఆర్‌కు పంపించారు.
ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని డ్రైవర్లను మార్చిన గుడ్లూరు ఎస్సైని వీఆర్‌కు పంపుతారని ప్రచారం జరిగినా చివరకు ఎస్పీ మందలింపుతో వదిలేశారు. ఇలా ప్రతి స్టేషన్లో ఎస్హెచ్ఓల పనితీరుపై ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు పెరిగిపోయాయి. పోలీస్ పాలన అదుపుతప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. తక్షణమే డీఎస్పీ బదిలీ కోసం ఉన్నతాధికారులకు సిఫారస్ చేయడం.. ఆ మేరకు బదిలీ ఉత్తర్వులు వెలువడటం.. మరో డీఎస్పీ వచ్చి శుక్రవారం బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి.
ఎస్సైలకు ఎస్పీ క్లాస్
మూడు రోజుల క్రితం ముగ్గురు ఎస్సైలు, ఓ సీఐని ఎస్పీ జిల్లా కేంద్రం ఒంగోలుకు పిలిపించుకుని వారికి క్లాస్ పీకినట్లు సమాచారం. ఎస్సైలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా అంతర్గపోరు విషయంలో ఎస్పీ సీరియస్‌గా ఉన్నట్లు వినికిడి. కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులే ఇలా రచ్చకెక్కడంతో పెండింగ్ కేసులు కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు తమ్ముళ్ల అభిమాన సీఐ
ఇప్పటికే ఓ సీఐకి అధికార పార్టీ ‘పోలీస్ అధికారి’గా ముద్రపడింది. ఈయన పనితీరుపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్సైపై దాడి చేసిన పేకాటరాయుళ్లను తప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారనే కారణంతో ఇప్పటికే ఓ సారి వీఆర్‌కు వెళ్లి వచ్చారు. ఈయనకు తోడు పట్టణంలో అధికార పార్టీ సూచించిన మరో పోలీస్ అధికారిని ఇక్కడ నియమిస్తే తమ్ముళ్లకు పండగే పండగ.
పట్టణ ఎస్సై నియామకంలో తొలగని సందిగ్ధం
కందుకూరు శాంతిభద్రత విషయంలో కీలకమైన పట్టణం. ఇక్కడ ఎస్సై నియామకం విషయంలో నెల రోజులుగా సందిగ్ధత నెలకొంది. ఇక్కడ పనిచేసిన ఎస్సై వైవీ రమణయ్య సింగరాయకొండకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత నాగరాజు అనే ఎస్సైని ఇక్కడ నియమించారు. ఇది జరిగి నెల అయినా ఆయన ఇంత వరకూ ఇక్కడ బాధ్యతలు చేపట్టలేదు. దీనికి ప్రధాన కారణం అధికార పార్టీ ముఖ్యనేతకు ఆ ఎస్సై ఇక్కడకు రావడం ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. ఎస్సైను ఇక్కడకు రాకుండా సదరు నేత అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తమకు అనుకూలంగా ఉండే ఓ ఎస్సైని ఇక్కడ నియమించాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్పీ కూడా కఠినంగా ఉన్నట్లు ప్రచారం ఉంది.