అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త ట్రక్కులు
గురు, పార్టనర్ వాహనాలు విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మరో రెండు ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటర్మీడియల్ కమర్షియల్ వెహికిల్ (ఐసీవీ) విభాగంలో ‘గురు’, లైట్ కమర్షియల్ వెహికిల్ (ఎల్సీవీ) విభాగంలో పార్టనర్ వాహనాలను మంగళవారమిక్కడ విడుదల చేశారు. వేరియంట్లను బట్టి గురు వాహనం ధర రూ.14.35 లక్షల నుంచి రూ.16.72 లక్షలు, పార్టనర్ ధర రూ.10.29 లక్షల నుంచి రూ.10.59 లక్షల మధ్య ఉంది. ఈ సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో సంస్థ ట్రక్స్ విభాగం గ్లోబల్ ప్రెసిడెంట్ అనూజ్ కథూరియా మాట్లాడుతూ... ఈ రెండు వాహనాలు కూడా భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందినవేనని, అయితే బీఎస్–3 వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.
గత నెలలో ఈ రెండు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చామని.. ఇప్పటికే వంద బుకింగ్స్ కూడా అయ్యాయని చెప్పారాయన. వచ్చే వారంలో సెంట్రల్, పశ్చిమ జోన్లో విడుదల చేయనున్నట్లు అనూజ్ తెలియజేశారు. అన్ని రకాలూ కలిసిన వాణిజ్య వాహనాల మార్కెట్లో అశోక్ లేలాండ్ 30 శాతం వాటా కలిగి ఉందని.. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల్లో తమ వాటా 46.8 శాతం వరకూ ఉందని ఆయన చెప్పారు. ఐసీవీ వాహనాలు ఏటా 50 వేలు విక్రయమవుతుండగా ఇందులో అశోక్ లేలాండ్ వాటా 20 శాతం వరకూ ఉందని చెప్పారాయన. దీంతో ప్రస్తుతం సంస్థ పోర్ట్‌ఫోలియోలో 2 టన్నుల నుంచి 49 టన్నుల వరకూ అన్ని రకాల వాణిజ్య వాహనాలూ ఉన్నట్లయిందని వివరించారు.