next ten years
-
Adani Group: రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 10 కోట్ల మొక్కలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఇన్ఫ్రా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. గ్రూప్ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ .. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. మైనింగ్, విమానాశ్రయాలు, డిఫెన్స్.. ఏరోస్పేస్, సౌర విద్యుదుత్పత్తి, రహదారులు, డేటా సెంటర్లు మొదలైన వ్యాపార విభాగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. పోర్టుల వ్యాపారంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెడుతోంది. అన్ని క్రేన్లను విద్యుదీకరించడం, అంతర్గతంగా డీజిల్ వాహనాలకు బదులు బ్యాటరీ ఆధారిత వాహనాలకు మళ్లడం, అదనంగా 1000 మెగావాట్ల క్యాప్టివ్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. అటు అదానీ ఎలక్ట్రిసిటీ 2027 నాటికి ముంబైలో 60 శాతం మేర పునరుత్పాక విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. ఇక గ్రూప్‌లో భాగమైన అంబుజా, ఏసీసీ కంపెనీలు దేశీయంగా సిమెంట్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్నాయి. తమ సిమెంటు ఉత్పత్తిలో 90 శాతం భాగం రీసైకిల్ చేసిన ఫ్లై యాష్ వ్యర్ధాలు, స్లాగ్ ఉంటాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. 2028 నాటికి సిమెంటు ఉత్పత్తి కోసం వినియోగించే పునరుత్పాదక శక్తి వాటాను 60 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2030 నాటికి 10 కోట్ల మొక్కలను నాటాలన్న లక్ష్యం దిశగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్ ఇటీవలే సిమెంటు, టెలికం, మీడియా వ్యాపార విభాగాల్లోకి కూడా ప్రవేశించింది. -
ఆటో ఇండస్ట్రిలో ఆరున్నర కోట్ల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ : భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో ఒకటిగా పేరొందుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా దృష్టిసారిస్తున్న భారత ఆటో మొబైల్ పరిశ్రమ వచ్చే దశాబ్దంలో దేశ జీడీపీలో 12 శాతం కంటే ఎక్కువగా తనవంతు దోహదం చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని, కొత్త ఉద్యోగాల కల్పనకు పీఠం వేయనుందని ఇండస్ట్రి అధికారులు పేర్కొంటున్నారు. 2026 కల్లా ఈ పరిశ్రమ దేశవ్యాప్తంగా ఆరున్నర కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని దేశీయ అగ్రగామి ఆటో పరిశ్రమ మారుతిసుజుకి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెనిచి అయుకవా తెలిపారు. వచ్చే దశాబ్దంలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రి, దేశ జీడీపీలో 12 శాతం కంటే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలనే లక్ష్యాన్ని తాము నిర్దేశించుకున్నామని, ఈ నేపథ్యంలో 2026 కల్లా 65 మిలియన్ల అదనపు ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో దేశ జీడీపీలో 7.1 శాతం సహకారం అందిస్తుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 32 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. గత పదేళ్లలో 35 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపారు. సామాజిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థలను కలుపుకుని స్థిరమైన, పరస్పర లాభదాయకమైన అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్ట్చర్స్(సియామ్) నిర్వహించిన మొదటి కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశంలో పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ గ్రామాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి గణనీయమైన పాత్ర పోషించిందని, తమ ప్రయత్నాలు కూడా ప్రభుత్వ మిషన్ క్లీన్ ఇండియా అండ్ స్కిల్ ఇండియాకు సమాంతరంగా ఉన్నట్టు ఆనందం వ్యక్తంచేశారు. 2026 కల్లా ఆటోమొబైల్ ఇండస్ట్రి కేవలం మొబిలిటీని మాత్రమే కాక, సురక్షితమైన, సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల విధానాలపై ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు.