ఉల్కల నుంచి బీ3 విటమిన్!
మనిషి జీవ క్రియలకు కీలకమైన విటమిన్ బీ3 పురాతన కాలంలో ఉల్కల నుంచే భూమి పైకి వచ్చిందట. కార్బన్ మూలకం పాళ్లు అధికంగా ఉన్న 8 రకాల ఉల్కలపై నాసా శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన పరిశోధనలో ఈ సంగతి తెలిసిందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. తాము పరిశోధించిన ఉల్కల్లో సుమారు 30 నుంచి 600 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) పరిమాణంలో విటమిన్ బీ3 ఉన్నట్లు వారు వెల్లడించారు. దీంతో భూమిపై జీవం ఆవిర్భావానికి కావలసిన ప్రధాన ధాతువులు ఉల్కల నుంచే వచ్చాయన్న సిద్ధాంతానికి మరింత బలం చేకూరినట్లైంది.
నికోటినిక్ యాసిడ్ లేదా నియాసిన్గా కూడా పిలిచే విటమిన్ బీ3 రూపాంతరం వల్లనే జీవక్రియలు జరిగేందుకు అవసరమైన నికోటినమైడ్ అడినీన్ డైన్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. అయితే 2001లో టాగిష్ లేక్ ఉల్కపై జరిపిన పరిశోధనలో కూడా ఉల్కల్లో విటమిన్ బీ3 ఉన్నట్లు వెల్లడైంది. కానీ గ్రహశకలాల్లో నీటి వల్ల మార్పులకు గురైన విటమిన్ బీ3తోపాటు ప్రత్యేక గాఢతల్లో ఉన్న పైరిడిన్ కార్బాక్సిలిక్ ఆమ్లాలను కూడా తాము గుర్తించామని తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కారెన్ స్మిత్ పేర్కొన్నారు.