'ఆయనకు మాపై ఏ మాత్రం దయ లేదు!'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న సరి-భేసి పాలసీకి అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి చెందిన శ్వేత కపూర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 'మాపై (ప్రజలపై) ఏమాత్రం కరుణ లేకుండా ఇలాంటి చట్టాలు తీసుకొస్తే మా పరిస్థితి దారుణంగా మారుతుంది' అని పిటిషన్ లో పేర్కొన్నారు. సరి భేసి సంఖ్యల ఆధారంగా కార్లను రోజు విడిచిరోజు రోడ్డుపైకి అనుమతించే విధానాన్ని తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం పరిశీలనలు జరుపుతుందని, అసలు సమస్యకు మూలమేమిటనే విషయాన్ని పక్కకు పెట్టి ఇలా ప్రజలకు నచ్చని విధానాలు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు.
'ప్రజలతో మమేకమవకుండా, ప్రజలకు చెప్పకుండా, వారితో చర్చలు జరపకుండా తీసుకొచ్చే ఎలాంటి ప్రభుత్వ పాలసీలైనా చట్టాలైన వివాదాలను తీసుకొస్తాయి. సమస్యలను అర్ధం చేసుకోకుండా ప్రజలకు చెప్పకుండా తీసుకొచ్చిన ఈ చట్టాలు గతంలో వివాదాలు సృష్టించాయని ఇప్పటికే తెలుసు' అని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. కాలుష్యానికి అసలు కారణమేమిటో పరిశీలించకుండా ప్రజలపై ఇలా దయలేకుండా, నియంతృత్వ ధోరణితో విధానాలు తీసుకొస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.