ఈ ఏడాదికి ఇలాగే
- ఖరీఫ్‌లో పాతవంగడాలకు సబ్సిడీ
- ఈ వారంలో అధికారిక ఉత్తర్వులు
సాక్షి, విశాఖపట్నం: పదేళ్లు దాటిన వంగడాల సాగుకు స్వస్తి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి స్థానే కొత్త వంగడాలను ప్రోత్సహించాలని యోచిస్తోంది. అయితే ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే పాత వంగడాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఈ వారంలో అధికారిక ప్రకటన వెలువడనుందని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ కమిషనర్ కె.మధుసూదనరావు సాక్షికి తెలిపారు. కానీ సాగువిస్తీర్ణానికి తగ్గట్టుగా కొత్త వంగడాలను అందించడంలో మాత్రం ప్రభుత్వం చేతులెత్తిసింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,99,813హెక్టార్లు.
ఈ ఏడాది 2,08,988 హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతుందని అధికారుల అంచనా. ఇందులో 1,06లక్షల హెక్టార్లు వరి, 35,573 హెక్టార్లు చెరకు, 23,764 హెక్టార్లు రాగితో పాటు మరో 23,764 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఉద్యాన, వాణిజ్య పంటల సాగుకంటే రైతులు ఎక్కువగా వరి సాగుపైనే మోజు చూపిస్తుంటారు. పాత పంగడాలతో
దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఎకరాకు 15నుంచి 20బస్తాలకు మించి రాని పరిస్థితి. రసాయన, పురుగుల మందుల ప్రభావంతో పంటలు తరచూ తెగుళ్ల బారిన పడుతున్నాయి. మోతాదుకు మించి మందులు..ఎరువులు వినియోగంతో భూసారం తగ్గిపోతుంది. ఉత్పత్తి వ్యయం కూడా భారీగా పెరిగిపోతున్నది.
ఈ కారణాలతో వరితో సహా దాదాపు అన్ని రకాల పంటలకు సంబంధించి పదేళ్లు పైబడిన వంగడాల సాగును నిలిపివేయాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. నాలుగైదేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం శూన్యం. ఈ ఏడాది ఎలాగైనా పాతవంగడాల వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో సోనామసూరి, సాంబమసూరి, స్వర్ణమసూరి, శ్రీకాకుళం సన్నాలు వాడుతున్నారు. వీటి స్థానంలో పదేళ్లలోపు పరిశోధనల్లో ఉన్న కొత్త వంగడాలకు నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్ కింద రూ.10 సబ్సిడీతో అందజేయాలని నిర్ణయించారు.
వీటిలో ఎన్‌ఎల్‌ఆర్ 34449 వంగడం-1614 క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్- 33892 రకం 200, ఎంటీయూ -1061 రకం 955, ఎంటీయూ- 1064 రకం 425, ఎంటీయూ- 1075 రకం 575, ఆర్జీఎల్- 1880 రకం 200, ఆర్జీఎల్- 11414 రకం 175 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. ఇవన్నీ రెండు మూడేళ్లలో ఆవిష్కరించిన వంగడాలు. వీటిపై మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. ఇక పదేళ్లు పైబడిన రకాలకు సబ్సిడీ ఇవ్వకూడదని తొలుత నిర్ణయించారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204 రకం 3120 క్వింటాళ్లు, బీపీటీ-3291 రకం 3755, ఎంటీయూ 1010 రకం 355, ఎంటీయూ 1001 రకం 3350, ఎంటీయూ7029 రకం 2150, ఎంటీయూ 3626రకం 840,ఆర్జీఎల్ 2537 రకం 9840,
జేజీఎల్ 1798 రకం 430 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. అలాగే పదేళ్ల లోపు వంగడాలకు చెందిన కె-9 రకం 135, కె-6 రకం 320, పీయూ-31 రకం 70, ఎల్బీజీ 752 రకం 376, ఎల్‌ఆర్‌జీ 41రకం 20, వైఎల్‌ఎం-66 రకం 10, శ్రీచైతన్య రకం 20, రత్నగిరి రకం 100 క్వింటాళ్లతో పాటు హైబ్రీడ్ రకం విత్తనాలు 230 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త వంగడాల విత్తనోత్పత్తి లేకపోవడంతో ఈ ఏడాది వరకు పైన పేర్కొన్న పాత వంగడాలను కూడా సబ్సిడీపై ఇవ్వాలని భావిస్తోంది.