‘రియో’కు రాజ్‌పుత్ అర్హత
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించే చివరి అవకాశాన్ని భారత షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సద్వినియోగం చేసుకున్నాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో... చివరి రోజు మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ 429.5 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఒలింపిక్స్‌కు మూడు స్థానాలు అందుబాటులో ఉన్నాయి. టాప్-3లో నిలిచిన కిమ్ జోంగ్యున్ (కొరియా), యుర్కోవ్ యురీ (కజకిస్తాన్), యమాషిటా (జపాన్) ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
దాంతో ఫైనల్లో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన రాజ్‌పుత్‌తోపాటు వితాలీ దావ్గన్ (ఖతార్), తోర్తుంగ్పనిచ్ (థాయ్‌లాండ్) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. రాజ్‌పుత్‌తో కలిపి ఇప్పటివరకు భారత్ నుంచి 12 మంది షూటర్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా 11 మంది షూటర్లు బరిలోకి దిగారు. భారత్ నుంచి ఒకే ఒలింపిక్స్ క్రీడలకు 12 మంది షూటర్లు అర్హత సాధించడం ఇదే ప్రథమం. రియో ఒలింపిక్స్ ఈ ఏడాది ఆగస్టులో జరుగుతాయి.
రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత షూటర్లు: చెయిన్ సింగ్, సంజీవ్ రాజ్‌పుత్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), గగన్ నారంగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), జీతూ రాయ్, ప్రకాశ్ నంజప్ప (50 మీటర్ల పిస్టల్), గుర్ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), కైనాన్ చెనాయ్ (ట్రాప్), మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్), అపూర్వీ చండేలా, అయోనికా పాల్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), హీనా సిద్ధూ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్).