p rammohan rao
-
షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా?
షూటింగ్స్ చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. కొన్ని గైడ్‌లైన్స్ సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రైట్ రైట్ అంది. చిన్న చిన్నగా చిన్న సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి భారీ సినిమాల సంగతేంటి? షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా? కరోనా తగ్గేవరకూ నో కాల్షీట్.. వ్యాక్సిన్ వచ్చే వరకూ నో క్యారవ్యాన్... అంటున్నారా? లేదా రంగంలోకి దిగేద్దాం. షూటింగ్ చేసేద్దాం అంటున్నారా? పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధమా? ప్రస్తుతం చిత్రీకరణల గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇదే విషయాలను పలువురు నిర్మాతలను అడిగాం. వాళ్లు ఈ విధంగా చెప్పారు. ఆ విశేషాలు. షూటింగ్‌లు చేయాల్సిందే – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం షూటింగ్‌లు చేసేవాళ్లు చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇప్పటికే కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కరోనా అనేది రెండు నెలలో, మూడు నెలలో అనుకుంటే షూటింగ్‌లైనా, మిగతా పనులైనా ఆపి కూర్చోవచ్చు. కరోనా మరో రెండు, మూడేళ్లు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటివరకు పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా గడుస్తుంది? అందుకని షూటింగ్ చేయటం అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ కరోనా వస్తుందనుకొని ప్రిపేర్ అయ్యి షూటింగ్‌లు చేసుకోవాల్సిందే. అప్పుడే వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. కష్టాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే. ఒకవేళ ఎవరికైనా షూటింగ్లో పాల్గొన్నపుడు కరోనా వస్తే భయపడకుండా ఆ రిస్క్‌ను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. తప్పదు మరి. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే బడా నిర్మాతలు, హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లు చేయకపోయినా పర్లేదు. మధ్యస్తంగా ఉండేవారు తప్పనిసరిగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం షూటింగ్ అంటే రిస్కే – ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత పి. రామ్మోహన్రావు రెండు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటంలో కొత్త పాయింటేం లేదు. ఏదేమైనా షూటింగ్లలో పాల్గొనటమా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనటం లైఫ్ రిస్కే. కానీ రిస్క్ అయినా çఫర్వాలేదు షూటింగ్ చేద్దాం అనుకునేవాళ్లు చేస్తున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద నటీనటులెవరూ షూటింగుల్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. నేను, సునీల్ నారంగ్ నిర్మిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ 7 నుండి చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. కేవలం 15మందితో ఈ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం. వారందరికీ మొదట కరోనా టెస్టులు చేయిస్తాం. అలాగే షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరూ ఇంటికి వెళ్లం. అందరికీ లొకేషన్ దగ్గరే బస ఏర్పాటు చేయబోతున్నాం. షూటింగ్‌కి తొందరపడటంలేదు – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి వివేక్ కూచిభొట్ల మేం ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్ ఉండే సినిమాల షూటింగ్ చేయదలచుకోలేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాలు చేస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చిత్రీకరణ ఫారిన్లో జరపాలి. ప్రస్తుతానికి షూటింగ్స్ చేయడంలేదు. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోలేం. దాని వల్ల తొందరపడి షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కూడా అనుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. అది కూడా సీన్లో ఎక్కువ మంది జనం లేని సన్నివేశాలే ముందు షూట్ చేస్తాం’’ అన్నారు. ధైర్యం ఉన్నోళ్లు చేసుకోవచ్చు – నిర్మాత డి. సురేశ్‌బాబు ప్రభుత్వం షూటింగ్‌లు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే కొంతమంది షూటింగ్‌లు చేసుకుంటున్నారు కూడా. కానీ మా బ్యానర్లో తీసే సినిమాల షూటింగ్‌లు చేయటానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యం. అది నేనివ్వగలనని గ్యారంటీ లేదు. మా బేనర్లో తీస్తున్న ఓ సినిమాకి 27 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అవన్నీ యాక్షన్ సీక్వెన్స్‌లే. ప్రతి సీన్లో దాదాపు 50 నుంచి 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిపితే 150మంది వరకు అవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతమందిని కాపాడగలమని నమ్మకం లేదు. రోడ్ మీదకి వెళ్లినప్పుడు మాస్క్ వేసుకుని వెళ్లాలని చెప్తే దాన్ని కూడా కొంతమంది సరిగ్గా ఆచరించటం లేదు. దాదాపు 30 శాతం మంది మాస్క్ పెట్టుకోమంటే అదేదో తప్పులా ఫీలవుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు నేను త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఎక్కడ విడుదల చేయాలి? నేను వ్యక్తిగతంగా నా ఫ్యామిలీతో కానీ స్నేహితులతో కానీ సినిమా థియేటర్‌కి వెళ్లి ఇప్పట్లో సినిమా చూడను. కారణం ఏంటంటే క్లోజ్డ్ ఏసీ థియేటర్లలో ముక్కుకి, మూతికి మాస్క్ పెట్టుకుని నవ్వొస్తే నవ్వకుండా సినిమా ఫీల్‌ను ఎంజాయ్ చేయలేను. ఉపాధి కోసం షూటింగ్ చేయటం మంచిదే కానీ దాన్ని ఎవరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఉదాహరణకు టీవీ వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ రోజు షూటింగ్ చేసి ఆ కంటెంట్‌ను అమ్మితే ఓ యాభైవేల రూపాయలు లాభం వస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్లు చేయొచ్చు. సినిమావాళ్లకి ఆ గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఉపాధి కోసమే కదా బాలూ (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)గారు షూటింగ్ చేసింది. ఆయన పరిస్థితేంటి? లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనకు, సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరిగేది. షూటింగ్ చేయటం, చేయకపోవటం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కొంతమందికి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్లు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్లకు ధైర్యం ఉండదు. పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే షూటింగ్స్ మొదలుపెడతాను. -
ఓవర్ ది టాప్
‘సృష్టిలో స్థిరమైనది మార్పు మాత్రమే’ అన్నది గ్రీకు ఫిలాసఫీ. ‘సినిమా’ రంగంలో మార్పు గమనిస్తే... మూకీ సినిమా మాటలు నేర్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ స్టయిలుగా రంగులేసుకుంది. రీలును చుట్టి చిప్‌లో పెట్టారు. ఇది సినిమా తయారవడంలో వచ్చిన మార్పు. సినిమా ఎన్నో సవాళ్లను చూస్తూ వస్తోంది. సినిమా మొదలయినప్పుడు నాటకం నడక వేగం తగ్గిందన్నది నిజం. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది. బుల్లితెరకు అంటుకుపోతున్నవాళ్లను పెద్ద తెరకు తీసుకురావడం కొంచెం కష్టం అవుతోంది. ఇప్పుడు ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫామ్స్ (అమేజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హాట్‌స్టార్, జీ5 వంటివి) వచ్చాయి. ఓవర్ ది టాప్ అంటూ దూసుకొచ్చిన ఈ మాధ్యమం సినిమా బిజినెస్‌ని అధిగమిస్తుందా? ఇప్పుడు సినిమాకు పెద్ద సవాల్ ఈ ఓటీటీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడే వరకే ఓటీటీ ప్రత్యామ్నాయమా? భవిష్యత్తులో థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌ను ఓటీటీ ఆపేస్తుందా? లేదంటే ఓటీటీయే భవిష్యత్తా? ఓటీటీకి అందరం అలవాటు పడాలా? ప్రస్తుతం అన్నీ ప్రశ్నలే. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచం స్తంభించింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. షూటింగ్ నుంచి విడుదల వరకూ అన్నీ బంద్. విడుదలకు సిద్ధమైన సినిమాలు పలు కారణాలతో ప్రత్యామ్నాయంగా ఓటీటీలో విడుదలకు సిద్ధపడ్డాయి. ఇదో సంచలనాత్మకమైన మార్పు. సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడం సరికాదని పలు మల్టీప్లెక్స్ చైన్ల అధినేతలు, కొందరు పంపిణీదారులు, థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. థియేటరా? ఓటీటీయా? సినిమాను థియేటర్లో చూడాలా? ఎవరింట్లో వాళ్లు ఓటీటీలో చూసుకోవాలా? సినిమా చూడటం అనేది ఓ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో ఒక రెండు వందల మంది సినిమాలోని ఒక ఎమోషన్ని సమానంగా ఫీలవడం. ‘సినిమాను సినిమాలాగా చూడటం థియేటర్లోనే జరుగుతుంది. సినిమాను థియేటర్లోనే అనుభూతి చెందాలి’ అని ఒక వాదన. మరోవైపు ‘ప్రతీ సినిమాను థియేటర్లో చూడలేం. పెరిగే టికెట్ రేట్లను ఫ్యామిలీ అందరం భరించలేం. ఓటీటీలో అయితే అందరూ ఇంట్లోనే వీలున్నప్పుడు చూసుకోవచ్చు. థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే థియేటర్‌కి వస్తాం కదా?’ అనేది మరో వాదన. అభిప్రాయాలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ‘ఖచ్చితంగా ఇదే కరెక్ట్’ అని ఏదీ చెప్పలేం. ప్రేక్షకుడు సినిమాను థియేటర్లో నలుగురితో చూడాలా? ఏకాంతంగా తన ల్యాప్టాప్లోనా, టీవీలోనా? అనేది తన నిర్ణయం. ప్రస్తుతానికి మాత్రం ఏడు సినిమాలు ‘ఓటీటీ’కి రావడానికి రెడీ అయ్యాయి. ఓటీటీకే మా ఓటు లాక్డౌన్ వల్ల విడుదల ఆగిపోయిన పలు సినిమాలు మా ఓటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే అని డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఆ చిత్రాల వివరాలు.. పొన్ మగళ్ వందాళ్: ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు మొదట ప్రకటించబడిన తమిళ సినిమా జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’. సూర్య నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్య–జ్యోతిక సినిమాలు థియేటర్స్‌లో ప్రదర్శించం అని స్టేట్మెంట్లు విడుదల చేశారు. అయితే మే 29 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. గులాబో సితాబో: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రల్లో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘గులాబో సితాబో’. ఈ సినిమా జూన్ 12 నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ –‘‘నా కెరీర్లో ఎన్నో మార్పులు, సవాళ్లు చూస్తూ వచ్చాను. డిజిటల్ రిలీజ్ అనేది మరో కొత్త సవాల్’’ అన్నారు. పెంగ్విన్: కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘పెంగ్విన్’. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో కనిపిస్తారు కీర్తి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ను జూన్ 19 నుంచి చూడొచ్చు. కన్నడ చిత్రాలు ‘లా, ఫ్రెంచ్ బిర్యానీ’ జూన్ 26, జూలై 24వ తేదీలనుంచి లభ్యమవుతాయి. ఈ రెండు చిత్రాలకు ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ నిర్మాత. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా విద్యా బాలన్ టైటిల్ రోల్లో నటించిన హిందీ చిత్రం ‘శకుంతలా దేవి’. జయసూర్య, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘సూఫీయుమ్ సుజాతయుమ్’. ఈ రెండు చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నట్టు ప్రైమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ విడుదల తేదీలు ప్రకటించలేదు. మార్పు మొదలైన వెంటనే భవిష్యత్తు ఇదే అని తుది నిర్ణయానికి రావడం అన్నిసార్లూ సరి కాదు. సాంకేతికత పెరిగేకొద్దీ సినిమా థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓటీటీ కూడా థియేట్రికల్ బిజినెస్‌కి ఇబ్బంది అవుతుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా మీడియమ్ మారబోతోందా? సినిమాల మీద ఓటీటీ ప్రభావం చూపిస్తుందా? సమాధానాల కోసం వెతకడం కంటే వేచి చూడటమే కొన్నిసార్లు ఉత్తమమేమో? పెద్ద తెర అనుభూతి వేరు – ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్రావు ► ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ టీవీ 65 ఇంచెస్ ఉన్నప్పటికీ థియేటర్లో పెద్ద తెర మీద సినిమాను వీక్షిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ అనుభూతి వేరు. థియేటర్లో దాదాపు 20–40లక్షల ఖర్చుతో ఉన్న సౌండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను వీక్షిస్తే ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతగా కలగకపోవచ్చు. ► నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి సినిమా థియేట్రికల్ రిలీజై హిట్ సాధిస్తే మంచి వసూళ్లు వస్తాయి. ఈ వసూళ్ల రూపంలో వచ్చేంత డబ్బును ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిర్మాతలకు చెల్లించలేవు. ► కరోనా ప్రభావం వల్ల షూటింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి. భవిష్యత్‌లో థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారో? రారో? అనే భయంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాగచైతన్యతో తీస్తున్న ‘లవ్‌స్టోరీ’కి నేను ఒక నిర్మాతను. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మా సినిమాని రిలీజ్ చేస్తాం కానీ ఓటీటీలకు అమ్మాలనుకోవడం లేదు. ► ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉండాలి. షూటింగ్, సినిమాల విడుదల, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వంటి విషయాలపై ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మొదటి మూడు నెలల్లో విడుదయ్యే సినిమాలకు ప్రభుత్వం ఏదైనా రాయితీ ఇవ్వాలి. జీరో ట్యాక్సేషన్, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం వంటి వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మల్టీప్లెక్స్వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. షూటింగ్‌లు మొదలుపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చని అధికారికంగా ప్రభుత్వం చెబితే, అప్పుడు తక్కువమందితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటాం. ప్రభుత్వ స్పందన కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. నా సపోర్ట్ థియేటర్స్‌కే – నిర్మాత అల్లు అరవింద్ ► అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్ నటించిన సినిమా నుంచి స్టార్ ఆర్టిస్ట్‌లు జ్యోతిక, కీర్తీ సురేష్ వంటి వారు నటించిన సినిమాలు డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి.. ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేయడం పై మీ ఒపీనియన్? ఎవరైనా థియేటర్లో విడుదలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొందరు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా సినిమాలు విడుదల వాయిదా పడుతుండటంతో ఒకేసారి విడుదల చేస్తే థియేటర్లు దొరుకుతాయో? లేదో? పైగా అప్పులపై వడ్డీలు పెరిగిపోతుంటాయి కదా? ఈ కారణాల వల్ల డిజిటల్ రిలీజ్ బెటర్ అనుకునే అవకాశం ఉంది. ► ‘ఆహా’తో మీరూ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు. మరి.. మీరు డిజిటల్ రిలీజ్‌కి ఓకే అంటారా? థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ ఆగేవాళ్లు ఆగుతారు. నా సపోర్ట్ మాత్రం థియేటర్స్‌కే. అయితే ఓటీటీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ► పెద్ద బడ్జెట్ చిత్రాలేమైనా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు మీ దృష్టికి వచ్చిందా? నాకు తెలిసి లాక్‌డౌన్‌కి ముందు రిలీజ్ కావడానికి పెద్ద సినిమాలేవీ రెడీగా లేవు. నాలుగైదు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయేమో.. మరికొన్ని చిన్న చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఓ బడా నిర్మాత సినిమా విడుదలకు రెడీ అయింది. లాక్డౌన్ వల్ల అది ఆగింది. ఆ సినిమాకి కూడా ఓటీటీ వాళ్లతో చర్చలు జరిగాయి.. కానీ ‘పెద్ద మొత్తం’ ఇవ్వడానికి ఓటీటీ వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే వడ్డీ భారం ఉన్నా కూడా థియేటర్లోనే విడుదల చేద్దామని ఆ నిర్మాత ఆగారు. ► తక్కువ మందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తమిళ ఇండస్ట్రీకి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి అనుమతులు ఇంకా రాలేదు కదా? అనధికారికంగా కొందరు తక్కువమందితో జాగ్రత్తలు పాటిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటిస్తే కొంచెం రిలీఫ్‌గా పని చేసుకుంటారు. ► షూటింగ్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయనుకుంటున్నారు? ఆగస్టు నుంచి మొదలవుతాయనుకుంటున్నాను. అయితే గతంలా ఉండకపోవచ్చు. తక్కువ మందితో షూటింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. అలాంటివాళ్లను ఆదుకోవడానికి ఏదోటి చేయాలి. ► గీతా ఆర్ట్స్ బ్యానర్లోని ప్రస్తుత సినిమాల పరిస్థితేంటి? ప్రస్తుతం మా బ్యానర్లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ‘జెర్సీ’ హిందీ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయి ఆగిపోయింది. తెలుగులో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 75 శాతం షూటింగ్ అయింది. కార్తికేయతో తీస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా 25 శాతం చిత్రీకరణ జరిగింది. లాక్డౌన్ ముగిశాక ఈ షూటింగ్స్ మొదలుపెట్టడమే. ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించడంతో ప్రముఖ థియేటర్ చైన్ సంస్థ ఐనాక్స్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘‘థియేటర్స్– సినిమా నిర్మించేవాళ్లు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవాళ్లం. ఇలాంటి కష్టకాలంలో రెండు పార్టీలు లబ్ధి పొందే పద్ధతిని కాదనుకుని ఒక పార్టనర్ వేరే పద్ధతిని అనుసరించడం సరికాదనిపిస్తోంది. కష్ట సమయంలో అనుబంధాన్ని వదిలి, ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించినవాళ్లను భవిష్యత్తులో ఆప్తమిత్రుల్లా చూడటానికి లేదు. థియేటర్లో సినిమాను విడుదల చేసే విధానాన్ని మరువకండి. ఎప్పటిలానే కలసి ప్రయాణిద్దాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్మాతలు అలా ఆలోచించడం సహజం – ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి అంగీకరించిన నిర్మాతలను ఉద్దేశిస్తూ ఎగ్జిబిటర్ సెక్టార్‌లోని మా సహచరులు కొందరు కటువుగా మాట్లాడటం బాధగా ఉంది. ఇప్పట్లో దేశవ్యాప్తంగా సినిమాలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటి వరకు తమ సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఎదురుచూడటం అంటే వారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. తిరిగి థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ థియేటర్స్ ప్రేక్షకులతో నిండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మార్గాల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. అది సహజం. అయితే సినిమాల థియేట్రికల్ రిలీజ్‌నే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సపోర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిబిటర్ సెక్టార్‌కు మేం తప్పక సహకారం అందిస్తాం. అలాగే పెద్ద సంఖ్యలో థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు మా వంతుగా మేం చేయాల్సింది అంతా చేస్తాం. -
సినీ కార్మికులకు ఆరోగ్యభీమా కల్పిస్తాం
‘‘నిత్యం పోటీ ఉండే చిత్ర పరిశ్రమలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం. కాదంబరి కిరణ్‌తో పాటు ‘మనంసైతం’ బృందాన్ని అభినందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని తెలిసింది. అలాంటి శాఖల సినీ కార్మికులకు ఎఫ్డీసీ నుంచి సగం ఖర్చు తగ్గిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తాం’’ అని ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మనం సైతం’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ రావు పదిమంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘చిత్రపురి కాలనీలో ఓ వైద్యశాల నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ‘మనం సైతం’ కార్యక్రమానికి నేను ఎప్పుడు అందు బాటులోనే ఉంటాను’’ అన్నారు. ‘‘మానవత్వం ఇంకా మిగిలే ఉందని మనం సైతం కార్యక్రమానికి వచ్చిన తర్వాత అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం’’ అని మాజీ మంత్రి లక్షా్మరెడ్డి సతీమణి శ్వేతా లక్షా్మరెడ్డి అన్నారు. ‘‘నేను ఎదుర్కొన్న బాధలు, కోపం, కసి, ప్రతీకారం, ఆవేదనల నుంచి మొదలైనదే ఈ మనం సైతం కార్యక్రమం. ఏడుగురు సభ్యులతో మొదలైన మా బృందంలో ఇప్పుడు దాదాపు లక్షా డెబ్భై వేలమంది ఉన్నారు’’ అన్నారు కాదంబరి కిరణ్. దర్శకుడు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
మినీ థియేటర్స్ కోసం
రానున్న రోజుల్లో బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్ ప్రత్యక్షం కానున్నాయి. దాని కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అధ్యక్షుడు పి. రామ్మోహనరావులు పలువురు అధికారులతో చర్చించి, తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టీసీ బస్టాండ్స్‌లో మినీ థియేటర్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు బస్టాండ్స్‌లో, వాటికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో 80 నుంచి 100 మినీ థియేటర్ల ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణతోనూ రామ్మోహన్ రావు చర్చించారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా టెండర్లను ఆహ్వానించినా సరైన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మినీ థియేటర్ల ఏర్పాటుకు తగిన అనుమతులు తీసుకోవాలనుకుంటున్నాం’’ అని రామ్మోహనరావు అన్నారు. -
కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది – సాయి శ్రీనివాస్
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని (నాని) నిర్మాణంలో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మెన్ పి. రామ్మోహన్రావు గౌరవ దర్శకత్వం వహించారు. సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది.నవీన్గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చాలా కథలు విన్నాం. దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చింది. ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘అల్లుడు శీను’ చిత్రం తర్వాత ఛోటాగారితో, తమన్‌తో తొలిసారి వర్క్ చేయబోతున్నందుకు హ్యాపీ’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. కథ, కాన్సెఫ్ట్ కొత్తగా ఉంటాయి. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం’’ అన్నారు నవీన్. ‘‘రొమాటింక్ థ్రిల్లర్ చిత్రమిది. కథను నమ్మి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి కృతజ్ఞతలు.నా పై నమ్మకంతో మంచి టీమ్‌ను అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకునిగా నా ప్రయాణం స్టార్ట్ చేయడానికి కారణమైన నవీన్, శాంతయ్య, సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్. పెద్ద దర్శకులతో పనిచేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త డైరెక్టర్ అయిన నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మార్చి 2 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘కో–డైరెక్టర్‌గా ఎప్పటినుంచో శ్రీనివాస్ నాకు తెలుసు. కొత్తగా అద్భుతమైన కథ చెప్పారు. టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చెలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కెమెరామెన్ ఛోటా కె. నాయుడు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బెల్లంకొండ సురేశ్ మంచి సినిమాలను నిర్మించారు. ఆయన తనయుడు శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా వంద రోజులు ఆడాలి. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ తొలి సినిమా హిట్ సాధించాలి’’ అన్నారు. -
సీఎస్ ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు!
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు బుధవారం రాత్రి ముగిశాయి. అన్నానగర్‌లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్ నంబరులో ఉన్న ఆయన ఇంటికి బుధవారం ఉదయం సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. బుధవారం దాడుల్లో సేకరించిన ఆధారాలను బట్టి ఐటీ దాడులు మరిన్ని జరిగే అవకాశమున్నట్లు సమాచారం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహనరావుకు సంబంధాలు ఉన్నాయనే కోణంలోనే ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. శేఖర్ రెడ్డి, ఆయన ఆడిటర్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!) -
సీఎస్ కుమారుడి ఇంట్లో బంగారం, డబ్బు స్వాధీనం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావుకు ఆస్తులకు సంబంధించి ఐటీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉదయం నుంచి ఆయన, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎస్ రామ్మోహన్ రావు కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక రామ్మోహనరావు కుమారుడి ఇంట్లో నుంచి రూ.18లక్షల కొత్త కరెన్సీతోపాటు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డితో సంబంధాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.100కోట్లకు పైగా కరెన్సీని ఐటీ అధికారులు సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామ్మోహనరావు ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేఖరరెడ్డి ఇంటిపై దాడి తర్వాత పలువురిపై దాడులు జరగొచ్చని సమాచారం ఉంది. కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. -
తమిళనాడు సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!
-
సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొదలైన దాడులు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నానగర్‌లోని ఆయన నివాసంతో పాటు మరో ఆరుచోట్ల కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. టీటీడీ సభ్యుడు శేఖరరెడ్డి కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన తర్వాత ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సీఎస్ ఇంటిపై దాడులు జరగడం విశేషం. సమన్లు జారీ చేసి మరీ ఈ దాడులు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేఖరరెడ్డి ఇంటిపై దాడి తర్వాత పలువురిపై దాడులు జరగొచ్చని సమాచారం ఉంది. కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం రామ్మోహనరావు ఇంట్లో రెండు బృందాలు, మిగిలినచోట్ల మరిన్ని బృందాలు ఉన్నాయి. అన్నానగర్‌లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్ నంబరులో ఉన్న ఆయన ఇంటికి తొలుత సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చారు. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. టీటీడీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహనరావుకు సంబంధాలు ఉన్నాయనే సమాచారం అందిన తర్వాతే ఐటీ విభాగం అధికారులు చురుగ్గా స్పందించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖతో పాటు ఇతర శాఖలు అందించిన సమాచారం ఆధారంగానే సీఎస్ ఇంటి మీద ఆదాయపన్ను దాడులు జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రానికే అవమానం: స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఐటీ దాడులు జరగడం అంటే అది తమిళనాడు రాష్ట్రానికే అవమానమని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. -
సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!