pahadi sharif
-
తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు
సాక్షి, పహాడీషరీఫ్: మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనలో స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన పూరన్ సింగ్‌గా గుర్తించారు. కాగా, పూరన్ సింగ్‌పై మృతిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. పూరన్ సింగ్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతికి జయదేవీ అనే మహిళే కారణమని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం, పూరన్ సింగ్ మృతిపై తాజగా ఆయన భార్య మమతా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. జయదేవీ తనను పెళ్లి చేసుకోవాలని నా భర్త వెంట పడుతోంది. ఆయన్ను వేధింపులకు గురిచేసింది. నన్ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను గత కొద్దిరోజులుగా బెదిరిస్తోంది. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నా భర్తను జయదేవీనే కిరాతకంగా చంపేసింది. పూరన్ సింగ్‌ను ట్రాప్ చేసి ప్లాన్ ప్రకారమే హత్య చేసింది అని కామెంట్స్ చేశారు. అంతకు ముందు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న సాయంత్రం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పరిసర పోలీస్స్టేషన్లలో అదృశ్యమైన కేసులను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీన్ దయాళ్ కుమారుడు పూరన్‌సింగ్ (30) హైదరాబాద్‌కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్‌నగర్‌లో పానీపూరి బండి నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 22న రాత్రి 10 గంటలకు బార్కాస్‌లోని వివాహానికి హాజరవుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడం.. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో అతని భార్య మమతా సింగ్ 23న రాత్రి 7 గంటలకు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మృతుడి వివరాలు తెలియరావడంతో పూరన్‌సింగ్‌కు ఉన్న విబేధాల విషయమై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం -
శంషాబాద్‌లో తిష్టవేసిన చిరుత
శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు. ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లిలో కనిపించిన చిరుత రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. -
వదంతులకు మరో ప్రాణం బలి
సాక్షి, చాంద్రాయణగుట్ట: పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలని అపోహ పడి కర్ణాటకలో జరిగిన దాడిలో ఓ హైదరాబాద్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ మహ్మద్ ఆజం (32), సల్మాన్, నూర్ మహ్మద్, ఖతర్ దేశస్థుడు సాలం స్నేహితులు. సాలం ఖతర్ నుంచి రావడంతో సరదాగా గడిపేందుకు అంతా కలిసి కర్ణాటకలోని బీదర్ జిల్లా ఉద్గీర్‌కు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సమయంలో స్థానిక చిన్నారులకు విదేశీ చాక్లెట్లిచ్చారు. ఇది చూసిన స్థానికులు వారిని పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలనుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆజం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు నగరంలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజంకు భార్య, కుమారుడున్నారు. శనివారం సాయంత్రం ఎర్రకుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. బాధిత కుటుంబాలను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరామర్శించారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్ట్
► సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చిన ఉదంతం పహాడీషరీఫ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో దళిత సంఘాల నాయకులు గురువారం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం కమ్యూనిటీ హాల్‌కు గత నెల 18న బడంగ్‌పేటకు చెందిన బ్యాండ్ బృందం అనుగొందుల రాజు(19), నాదర్గుల్కు చెందిన గోడ నవీన్(19), బైండ్ల శివ(22)లతో పాటు మరి కొంత మంది వచ్చారు. వీరు హాల్లోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ అవమాన పరిచారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలాపూర్‌కు చెందిన కొప్పుల సురేష్ దీన్ని గమనించి బాలాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రాం శేఖర్, దళిత సంఘాల నాయకులు బాలాపూర్ ఠాణా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లేకపోవడంతో వెంటనే మీర్‌పేట ఇన్స్పెక్టర్ రంగస్వామి, పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతిపర్చేందుకు యత్నించారు. వారు మాట వినకపోవడంతో పోలీసులు వెంటనే అనుగొందుల రాజు, గోడ నవీన్‌లను అరెస్ట్ చేయడంతో ఆందోళన విరమించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి
ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ షోయబ్(14) అనే బాలుడు ఈత కొలనులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బోర్ విషయమై ఎంపీటీసీ భర్తపై దాడి
హైదరాబాద్: బోర్ వేసే విషయంలో తలెత్తిన వివాదంతో ఎంపీటీసీ భర్తపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ షాహెదా భర్త హామెద్(40) ఆదివారం ఉదయం ఎర్రకుంటలో బోర్ వేయిస్తున్నాడు. బాసిత్‌ఖాన్, షేక్ మస్తాన్, మహ్మద్ షకీల్‌లు బోర్ వేయరాదంటూ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో 60 ఫీట్లు మాత్రమే బోర్ వేసి వెనుదిరిగారు. బాసిత్‌ఖాన్, మస్తాన్, షకీల్‌లు ఎంపీటీసీ భర్త హామేద్ ఖాన్‌పై సాయంత్రం ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలకు గురైన హామెద్‌ను స్థానికులు వెంటనే బాలాపూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
పాతబస్తీలో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
హైదరాబాద్: నగరంలో పాతబస్తీ పరిధిలోని పహాడీ షరీఫ్‌లో ఐదేళ్ల బాలికను ఇంటినుంచి అపహరించి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో బాలిక ఇంటికి సమీపంలో ఉండే ఓ మైనరే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈనెల 7న జరిగిన ఈ దారుణంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ దర్యాప్తుమాత్రం కొనసాగకపోవడం గమనార్హం. పైగా ఫిర్యాదును ఉపసంహరించుకోవాల్సిందిగా బాలిక తల్లిదండ్రులను కొందరు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోరావడం, ఇప్పుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనతో పహాడీ షరీఫ్‌లో నివసిస్తోన్న మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
-
స్నేక్ గ్యాంగ్ కేసులో సిఐ, ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: నగర శివారులో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో పహాడి షరీఫ్ సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఈ కేసు విషయంలో సిఐ భాస్కరరెడ్డి, ఎస్ఐ విఎస్ ప్రసాద్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సస్పెండ్ చేశారు. స్నేక్ గ్యాంగ్ యువతులను పాములతో బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ షాహీన్‌నగర్‌లో స్నేక్ గ్యాంగ్ సాగించిన అత్యాచారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌజ్‌లో ఉన్న జంటపై దాడి చేసి కాబోయే భర్త కళ్ల ఎదుటే యువతిని పాముతో బెదిరించారు. సెల్‌ఫోన్‌తో నగ్నంగా ఫోటో తీశారు. ఆ యువతి ఎంతరోధిస్తున్నా వినకుండా సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ కేసులో ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్‌బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్‌లు నిందితులు. ఈ సంఘటనతో ఈ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 37 మంది యువతులపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. వికలాంగుడైన తమ్ముడితో ఒక ఇంటిలో ఉంటున్న యువతిపై లైంగిక దాడి చేశారు. మరో చోట పెళ్లి ఏర్పాట్లలో ఉన్న ఇంట్లోకి చొరబడి వృద్ధురాలైన తల్లి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. పెళ్ళి కుదిరిన యువతిపై అత్యాచారం చేశారు. ఈ ముఠా అతి కిరాతకంగా అనేక ఘోరాలకు పాల్పడింది. యువతులపై అత్యాచారాలకు పాల్పడడమే కాకుండా ఆ ఘటనలను సెల్‌ఫోన్ ద్వారా ఫోటోలు తీసి బయట పెడతామని బెదిరించేవారు. ఈ గ్యాంగ్ ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా సిఐ భాస్కరరెడ్డి, ఎస్ఐ విఎస్ ప్రసాద్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ** -
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
-
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
హైదరాబాద్: నేరస్థుల్లో భయం కల్పించేందుకే పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో గత అర్థరాత్రి నుంచి సోదాలు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దాదాపు 420 మంది పోలీసులతో 800 నివాసాలను సోదా చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాములతో బెదిరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న స్నేక్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు దయానీ ఇంట్లో సోదా చేసినట్లు తెలిపారు. దయానీ సోదరులు అమీద్, కాలీజ్తోపాటు మరో ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. స్నేక్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న కొంతమందిని గుర్తించామని చెప్పారు. వారిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామన్నారు. స్నేక్‌గ్యాంగ్ కేసులో ఇప్పటివరకు ఐదు ఫిర్యాదులు అందాయన్నారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసులు ముమ్మర తనిఖీలు
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో రాజీవ్ గృహకల్ప, పహాడీ షరీఫ్ ప్రాంతాలలో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 సిలిండర్లు, 4 కార్లు, 3 ఆటోలు, 17 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ సోదాలలో దాదాపు 350 మంది పోలీసులు పాల్గొన్నారు.