భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
► సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చిన ఉదంతం
పహాడీషరీఫ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. దీంతో దళిత సంఘాల నాయకులు గురువారం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం కమ్యూనిటీ హాల్‌కు గత నెల 18న బడంగ్‌పేటకు చెందిన బ్యాండ్ బృందం అనుగొందుల రాజు(19), నాదర్‌గుల్‌కు చెందిన గోడ నవీన్(19), బైండ్ల శివ(22)లతో పాటు మరి కొంత మంది వచ్చారు. వీరు హాల్‌లోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ అవమాన పరిచారు.
ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలాపూర్‌కు చెందిన కొప్పుల సురేష్ దీన్ని గమనించి బాలాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీఎస్‌పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రాం శేఖర్, దళిత సంఘాల నాయకులు బాలాపూర్ ఠాణా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో వెంటనే మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ రంగస్వామి, పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతిపర్చేందుకు యత్నించారు. వారు మాట వినకపోవడంతో పోలీసులు వెంటనే అనుగొందుల రాజు, గోడ నవీన్‌లను అరెస్ట్ చేయడంతో ఆందోళన విరమించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.