శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు.
ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్‌ఆర్‌వో శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జల్‌పల్లిలో కనిపించిన చిరుత
రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్‌పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్‌పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్‌పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment