వేతనం 23.55% పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం, ఇతర భత్యాలు కలిపి 23.55 శాతం పెంచాలని సిఫారసు చేస్తూ ఏడో వేతన సంఘం గురువారం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. పే కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎ.కె.మాథుర్ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి 900 పేజీల నివేదికను అందజేశారు. ఉద్యోగులకు మూల వేతనం నెలకు కనిష్టంగా రూ. 18 వేలు, గరిష్టంగా రూ. 2.5 లక్షలుగా ఉండాలని కమిషన్ సిఫారసు చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టాలని, గ్రాట్యుటీపై గరిష్ట పరిమితిని రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచాలని పేర్కొంది. కమిషన్ సిఫారసులను అమ లు చేస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఖజానాపై రూ. 1,02,100 కోట్ల భారం పడొచ్చని జైట్లీ పేర్కొన్నారు.
అందులో రూ. 73,650 కోట్లు కేంద్ర బడ్జెట్‌పై, రూ. 28,450 కోట్ల భా రం రైల్వే బడ్జెట్‌పై పడుతుందన్నారు. అంటే, ప్రస్తుతం రూ. 4.33 లక్షల కోట్లుగా ఉన్న వేతన భారం 2016-17లో రూ. 5.35 లక్షల కోట్లకు చేరుతుందని వివరించారు. అలాగే జీడీపీలో ద్రవ్యలోటుపై దీని ప్రభావం 0.65% నుంచి 0.7% వరకు ఉంటుందన్నారు. ఈ నివేదికను 2016 జనవరి 1 నుంచి అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ద్వారా రక్షణ రంగ ఉద్యోగులు సహా మొత్తం 47 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. స్వతంత్ర సంస్థలు, వర్సిటీలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని జైట్లీ వెల్లడించారు. ఈ సిఫారసులను వ్యయ విభాగ కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యవర్గం అధ్యయనం చేసిన అనంతరం, అమలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సిఫారసుల్లో అంశాలు...
సాయుధ దళాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ విధానం. (ఓఆర్ఓపీ అని ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ 2016 జనవరి 1లోపు రిటైరైన పారా మిలటరీ ఉద్యోగులు సహా కేంద్ర ఉద్యోగులందరికీ సవరించిన పెన్షన్ ప్లాన్‌ను సిఫారసు చేసింది. దీనిద్వారా సమాన కాలం సర్వీస్‌లో ఉండి.. గతంలో రిటైరైనవారికి, తాజాగా రిటైరైన వారికి రిటైర్మెంట్ సమయంలో ఉన్న పే స్కేల్ సమం అవుతుంది.)
కేంద్ర సాయుధ దళాల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలి.
ఈ సిఫారసులు అమల్లోకి వస్తే కేబినెట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి ప్రస్తుతం రూ. 90 వేల పే బ్యాండ్ నుంచి రూ. 2.5 లక్షల పే బ్యాండ్‌లోకి వస్తారు.
మిలటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ- మిలటరీలో సేవలకు ఇచ్చే మొత్తం)కు సంబంధించి.. సర్వీస్ అధికారుల ఎంఎస్పీ రూ. 6 వేల నుంచి రూ. 15,500కు చేరింది. నర్సింగ్ అధికారులకు రూ. 4,200 నుంచి 10,800కు, జేసీఓ/ఓఆర్లకు రూ. 2,000 నుంచి రూ. 5,200కు, యుద్ధంలో పాల్గొనని వారికి రూ. 1,000 నుంచి రూ. 3,600 కు పెరిగింది.
ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఆరోగ్య బీమా పథకం. సీజీహెచ్ఎస్ పరిధిలో లేని పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలందించే ప్రయోజనం చేకూర్చేందుకు సీఎస్(ఎంఏ)/ ఈసీహెచ్ఎస్ కింద ఉన్న ఆసుపత్రులను సీజీహెచ్ఎస్ పరిధిలోకి తీసుకురావాలి.
పోస్టల్ పెన్షనర్లనందరినీ సీజీహెచ్ఎస్ కిందకు చేర్చాలి. పోస్టల్ డిస్పెన్సరీలను సీజీహెచ్ఎస్ల్లో విలీనం చేయాలి.
కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కింద కంట్రిబ్యూషన్‌ను, బీమా కవరేజ్‌ను పెంచాలి. ఇందుకు సంబంధించి నెలవారి చెల్లింపులు సీనియర్ స్థాయిలకు రూ. 120 నుంచి రూ. 5,000 వరకు.. ఇన్సూరెన్స్ కవరేజ్‌ను రూ. 1.2 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు. కింది స్థాయి ఉద్యోగులకు రూ. 30,000 నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. కిందిస్థాయి ఉద్యోగుల నెలవారి చెల్లింపులను రూ. 30 నుంచి రూ. 1500 కు పెంచారు.
గృహ కొనుగోలుకు వడ్డీ రహిత అడ్వాన్సులను రద్దు చేసి, వడ్డీతో అడ్వాన్స్‌ల పరిమితిని రూ. 7.5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు.
విధుల్లో ఉండి మరణించిన పారామిలట రీ దళాల సభ్యులకు ‘అమరత్వ స్థాయి’ ఇవ్వాలి.
సీబీఐ డెరైక్టర్ వేతనాన్ని రూ. 90 వేలకు పెంచాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది.
విధుల్లో వివిధ పరిస్థితుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు చెల్లించే ఏకమొత్తం పరిహారాన్ని సమీక్షించాలని.. అది భద్రతా బలగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏక రీతిలో ఉండాలని సిఫారసు చేసింది.
నియంత్రణ సంస్థల చైర్పర్సన్లకు రూ. 4.50 లక్షలు, సభ్యులకు రూ. 4 లక్షల చొప్పున నెల వారీ వేతన ప్యాకేజీ ఇవ్వాలి. ఒకవేళ వారు మాజీ ఉద్యోగులైతే వారి వేతనం నుంచి పెన్షన్‌ను తగ్గించరాదని సూచించింది.
ఐఏఎస్‌లకు ప్రయోజనాలపై భిన్నాభిప్రాయాలు
ఆర్థికంగా, కెరీర్ పరంగా ఐపీఎస్, ఇతర సర్వీసుల కన్నా ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యమిచ్చే అంశంపై 7వ వేతన సంఘం సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కేంద్రంలోకి డిప్యుటేషన్‌పై రావటానికి.. ఇతర సర్వీసు అధికారులకన్నా రెండేళ్లు ముందే ఐఏఎస్‌లకు అవకాశం లభిస్తుంది. వారికి అదనంగా 3% చొప్పున రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఉ న్నాయి. అయితే కమిషన్ చైర్మన్ మాథుర్.. అదనపు ఇంక్రిమెంట్లను ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ అధికారులకు కూడా వర్తింప చేయాలని సిఫారసు చేశారు. సభ్యుడు వివేక్ రే ఈ సిఫారసుతో విభేదించారు. మూడో సభ్యుడు రతిన్‌రాయ్ ఐఏఎస్ అధికారులకు అదనపు ఇంక్రిమెంట్ల ప్రయోజనాన్ని తొలగించాలన్నారు.