principal babu rao
-
బాబూరావు బాగోతాలు చూడతరమా..!
సాక్షి, గుంటూరు: సీనియర్ విద్యార్థులతో మద్యం సేవించడం, విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్న సీనియర్లకు అండగా నిలవడం, తనమాట వినకపోయినా, తనపై ఫిర్యాదు చేసినా, వారికి మార్కులు తగ్గించడం, అదేమని ప్రశ్నించిన అధ్యాపకులను సైతం తన అధికారంతో తొలగించడం.. ఇదీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు బాబూరావు వ్యవహార శైలి. 2009లో యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రారంభించగానే నిబంధనలకు విరుద్ధంగా బాబూరావును ప్రిన్సిపాల్‌గా నియమించారు. అంతకుముందు ఆయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎస్ఏఆర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. అక్కడ సైతం మహిళా అధ్యాపకులు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిండం, మాటవినని విద్యార్థులకు మార్కులు తగ్గించడం వంటివి చేసేవారని అక్కడి వారు చెబుతున్నారు. బాబూరావు వ్యవహార శైలి తెలుసుకున్న యాజమాన్యం ఆయన్ని విధుల నుంచి తొలగించింది. ఇవన్నీ తెలుసుకోకుండానే నాగార్జున యూనివర్సిటీ అధికారులు ఆయన్ని ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఈ నియామకంపై విమర్శలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడకు వచ్చాకకూడా బాబూరావు అకృత్యాలు తగ్గలేదు. అధ్యాపకులు, విద్యార్థులు అనేకసార్లు ఫిర్యాదుు చేసినా యూనివర్సిటీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోలేదు. గతనెల 14న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో బాబూరావు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. కళాశాల బయట హాయ్‌ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ నిర్వహించడం.. అందులో మందు పార్టీలు జరపడం.. వంటివి చేయడంతోపాటు, ప్రిన్సిపాల్ పేరుతో ఉన్న మద్యం బిల్లును సైతం ఆధారాలతో సహా ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీకి ఎస్ఎఫ్ఐ నాయకులు, కొందరు విద్యార్థులు, అధ్యాపకులు అందజేసిన విషయం తెలిసిందే. రిషితేశ్వరి కేసులో విచారణ నిర్వహించిన రెండు కమిటీలూ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడేలా ప్రిన్సిపాల్ బాబూరావు అండదండలు అందించారని నిర్ధారించారు కూడా. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంగానీ, ఆయన్ని అరెస్ట్ చేసి విచారించడంగానీ చేయకపోవడంపై విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
మరో గాంధీ కోసం ఎదురు చూద్దాం..
-
మరో గాంధీ కోసం ఎదురు చూద్దాం..
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబూరావును అరెస్ట్ చేయనందుకు విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజును బ్లాక్ డేగా పాటించాలని విద్యార్థులు పిలుపిచ్చారు. ఫేస్బుక్లో రిషితేశ్వరి పేజీలో విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. చిట్టిచెల్లెలు మనల్ని విడిచి నెలరోజులు అయినా నిష్పక్షపాతంగా విచారణ జరగలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని స్వాతంత్ర్యం మనకొద్దంటూ విద్యార్థులు ఫేస్బుక్లో నిరసన తెలియజేశారు. మరో గాంధీ కోసం ఎదురు చూద్దామంటూ విద్యార్థులు కామెంట్లు పోస్ట్ చేశారు. -
బాబూరావుకు పెద్దల అండ?
సాక్షి, గుంటూరు: ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును పైస్థాయిలో కొందరు కాపాడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. తమ కుమార్తెను సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ నిజనిర్ధారణ కమిటీ ముందు చెప్పడం తెలిసిందే. మరోవైపు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజశేఖర్ ఈనెల ఆరోతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీ సులు ఆయనపై కేసు నమోదు చేయలేదు. రిషితేశ్వరి కేసులో విచారణ చేపట్టిన కమిటీలు రెండూ ర్యాగింగ్ వ్యవహారంలో ప్రిన్సిపాల్ ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టం చేశాయి. ఫ్రెషర్స్ డే పార్టీని ఉద్దేశపూర్వకంగానే హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేశారని, ఈ పార్టీలో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పాల్గొనాల్సి ఉండగా, ప్రిన్సిపాల్ నాలుగో సంవత్సరం విద్యార్థులైన జయచరణ్, శ్రీనివాస్‌లను సైతం తీసుకొచ్చారని కమిటీ తెలిపింది. ఈ పార్టీలో విద్యార్థులందరికీ తన చేతుల మీదుగా బహుమతులు ఇచ్చిన ప్రిన్సిపాల్ రిషితేశ్వరికి మాత్రం చరణ్ చేతుల మీదుగా ఇప్పించినట్లు చెబుతున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత తనపై ఆరోపణలు రాగానే ప్రిన్సిపల్ హైదరాబాద్ వె ళ్లి సీఎం పేషీలో కొందరు అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రిషితేశ్వరి మృతి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపిచంద్ సోమవారం ఆదేశాలు జారీచేశారు. రిషితేశ్వరి కేసులో ఆమె తండ్రి మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వీరి ముగ్గురు పేర్లు స్ప ష్టంగా ప్రస్తావించినట్టు ఆ ఆర్డర్లో తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 27 మంది సాక్షులను విచారించారని తెలిపారు. ఈ కేసులో మొదటి ముద్దాయి దుంపా హనీషా, రెండో ముద్దాయి ధరావత్ జయచరణ్, మూడో ముద్దా యి నరాల శ్రీనివాస్‌ల పాత్ర ఉన్నట్లు కొంతమంది సాక్షులు తెలిపారని, వీరు ముగ్గురు ర్యాగింగ్ వంటి వికృత చర్యలకు పాల్పడ్డట్లు, ర్యాగింగ్ పేరుతో రిషితేశ్వరిపై మానసిక, శారీ రక, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు పేర్కొన్నారని తెలిపారు. ర్యాగింగ్ కారణంగానే రిషితేశ్వరి మృతిచెందినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారని, అనీషా అనే విద్యార్థిని విషయంలో ఎటువంటి వివాదం లేదని, మరో అనీషా ఉందనే విషయంపై ఎటువంటి ఆధారాలు కోర్టు ఎదుట ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. కేసు ద ర్యాప్తులో ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ పిటిషన్ తిరస్కరించారు. -
ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
-
ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావు విద్యార్థులతో కలిసి తాగారని, ఒక రకంగా ఆయనవల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని నాగార్జున యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం నాడు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఆడపిల్లలకు రక్షణ లేదని ఉన్నతాధికారులకు ఇంతకుముందు ఫ్యాకల్టీ అంతా కలిసి ఫిర్యాదు చేశాం. కానీ, మా ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నట్లు మాకైతే ఎప్పుడూ కనిపించలేదు. ఫ్రెషర్స్ డే పార్టీలో జరిగిన అవమానాల గురించి కూడా డైరీలో రాసుకుంది కదా.. దాంట్లో చాలా ఉన్నాయి. ఫ్రెషర్స్ డే పార్టీకి ఒక్క ప్రిన్సిపాల్ బాబూరావు మాత్రమే వెళ్లారు. వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్లలేదు మిగిలిన ఫ్యాకల్టీ కూడా వెళ్లి ఉంటే విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం చేసేవాళ్లు కారు ప్రిన్సిపాల్ తానొక్కరే వెళ్లాలని అనుకోవడం వల్లే ఇలా జరిగింది. యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది.. అక్కడ చేసుకోవచ్చు కానీ అలా చేయలేదు రోజూ యూనివర్సిటీకి ఆయన ఎలా వచ్చేవారు, ఆరోజు పార్టీకి ఎలా వెళ్లారు? ఆరోజు వేసుకున్న డ్రస్ ఎలా ఉంది, అసలు ఎందుకు తాగాల్సి వచ్చింది? రోజూ తాగి వస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నా.. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు విద్యార్థులతో కలిసి తాగడం ఎందుకు? ఆయన మద్యం తాగి వస్తున్నారని మేం లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశాం. చివరిదశలో.. 2014 మార్చిలో గవర్నర్‌కు కూడా మెయిల్ పంపించాం. అప్పట్లో ప్రిన్సిపాల్ చెక్ పవర్ తీసేశారు. కానీ తర్వాత మళ్లీ ఆ చెక్ పవర్ ఇచ్చేశారు కులం ముసుగులోనే ప్రిన్సిపాల్ ఇలా ఇదంతా చేస్తున్నారు ఆయన మాట వినడంలేదని నన్ను ఆయన హెచ్చరించారు. మాట వినకపోతే దెబ్బతింటావని అన్నారు అనధికారికంగా తనకు నచ్చినచోట ఫ్రెషర్స్ డే పార్టీ చేయడమే రిషితేశ్వరి మరణానికి ఒక రకంగా కారణమైంది. విద్యార్థులు తాగి విచక్షణారహితంగా ప్రవర్తించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. ప్రిన్సిపాల్ చేసే అసభ్య కార్యకలాపాలు యూనివర్సిటీలో అయితే వెంటనే తెలిసిపోతాయి కాబట్టి, దాచేందుకే వేదిక మార్చారు ఆ విషయాన్ని ఫ్యాకల్టీ ఎవరికీ కనీసం తెలియజెప్పలేదు కూడా. చాలామంది పిల్లలు ప్రిన్సిపాల్ ప్రవర్తన గురించి మా దగ్గర బాధపడి, ఏడ్చారు. ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడతారని చెప్పారు. డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనక నుంచి చేతులు వేస్తారని బాధపడ్డారు.