Professional Boxing
-
BoxingBay Fight Nights: హైదరాబాద్‌లో మెగా బాక్సింగ్ ఈవెంట్
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి సారథ్యంలో సౌత్‌బే కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి ‘బాక్సింగ్ బే’ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్‌బే ఫైట్ నైట్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
కేవలం ఉద్యోగం కోసం మొదలుపెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! అందుకే ఇలా..
Achievers- Vijender Singh: బాక్సింగ్‌ను మన దేశంలో చాలా మంది ఒక ఆటగానే చూడరు. బాక్సర్లంటే గొడవలు చేసేవాళ్లనో లేదంటే పిచ్చివాళ్లుగానో ముద్ర వేస్తారు.. చాలా కాలంగా, చాలా మందిలో ఉన్న అభిప్రాయమది. ఆ కుర్రాడు కూడా మొదట్లో అలాగే అనుకున్నాడు. అందుకే ఆ ఆటకు దూరంగా ఉండటమే మేలనుకున్నాడు. కానీ తన ప్రమేయం లేకుండానే బాక్సింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఒక ఉద్యోగం పొందడానికి ఆ ఆట ఉంటే సరిపోతుందని సాధన చేశాడు. ఏకంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశం గర్వించదగిన బాక్సర్‌గా నిలిచాడు. అతడే విజేందర్ సింగ్ బేనివాల్... ఒలింపిక్స్‌లో మెడల్ గెలుచుకున్న తొలి భారత బాక్సర్. హరియాణాలోని భివానీ పట్టణం.. ఢిల్లీ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2 లక్షల జనాభాతో ఉంటుంది. ఆ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులను అందించిన ఊరు. రాజకీయపరమైన విశేషాన్ని పక్కన పెడితే అది భారత బాక్సింగ్‌కు సంబంధించి ఒక పెద్ద అడ్డా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు చెందిన కోచింగ్ కేంద్రం అక్కడ ఉండటంతో ఎంతో మంది బాక్సర్లు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన హవా సింగ్ పట్టుబట్టి మరీ ‘సాయ్’ కేంద్రాన్ని అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం అది అద్భుతమైన ఫలితాలను అందించింది. PC: Vijender Singh Instagram ఒకే ఒక్కడు.. విజేందర్ సింగ్ కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఐదుగురు బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే అందులో నలుగురు.. ‘మినీ క్యూబా’గా పిలిచే భివానీ సెంటర్‌కు చెందినవారు కావడంతో ఒక్కసారిగా దాని గుర్తింపు పెరిగిపోయింది. ఈ ఐదుగురిలో విజేందర్ సింగ్ ఒక్కడే సత్తా చాటి కాంస్య పతకంతో మెరిశాడు. భారత బాక్సింగ్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అన్న స్ఫూర్తితో.. విజేందర్ తండ్రి హరియాణా ఆర్టీసీలో డ్రైవర్. మరీ పెద్ద సంపాదన కాదు. కానీ ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలనే తాపత్రయంతో సాధ్యమైనంతగా కష్టపడేవాడు. అయితే పెద్ద కొడుకు మనోజ్ సహజంగానే స్థానిక మిత్రుల సాన్నిహిత్యంతో బాక్సింగ్ వైపు వెళ్లాడు. గొప్ప విజయాలు సాధించకపోయినా.. స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకునేందుకు అది సరిపోయింది. విజేందర్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అన్నకు ఉద్యోగం వచ్చి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. దాంతో అప్పటి వరకు బాగానే చదువుతున్న విజేందర్కు చదువుకంటే ఆటనే బాగుంటుందనిపించింది. చివరకు తండ్రి, అన్న కూడా అతడిని కాదనలేకపోయారు. దాంతో పూర్తి స్థాయిలో బాక్సింగ్ శిక్షణ వైపు మళ్లించారు. సహజ ప్రతిభ కనబర్చిన అతను ఆటలో వేగంగా మంచి ఫలితాలు సాధించాడు. భార్యాపిల్లలతో విజేందర్‌సింగ్ PC: Vijender Singh Instagram వరుస విజయాలు.. హరియాణా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచిన తర్వాత 12 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్ కావడంతో తొలిసారి విజేందర్కు గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో 2003లో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అతని కెరీర్‌కు కీలకంగా మారాయి. అప్పటికి జూనియర్ స్థాయిలోనే ఆడుతున్నా.. పట్టుదలగా పోటీ పడి సీనియర్ టీమ్‌లో చోటు దక్కించుకున్న విజేందర్ రజతంతో సత్తా చాటాడు. అయితే ఇదే ఊపులో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ కోసం సిద్ధమైన విజేందర్కు షాక్ తగిలింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని విజేందర్కు అర్థమైంది. ఒలింపిక్ పతకం వైపు.. ఏథెన్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత విజేందర్ కెరీర్ కీలక మలుపు తీసుకుంది. తన వెయిట్ కేటగిరీని మార్చుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందించింది. 75 కేజీల మిడిల్వెయిట్కు అతను మారాడు. అదే ఏడాది దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన విజేందర్.. ఆ ఏడాదే కామన్వెల్త్ క్రీడల్లోనూ రజత పతకం గెలుచుకున్నాడు. దాంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జర్మనీలో ప్రత్యేక శిక్షణ అనంతరం అది రెట్టింపైంది. ఒలింపిక్స్‌లోనూ రాణించగలననే నమ్మకంతోనే అతను బీజింగ్‌లో అడుగు పెట్టాడు. చివరకు దానిని సాధించడంలో విజేందర్ సఫలమయ్యాడు. 22 ఆగస్టు, 2008న కంచు పతకం సాధించి ఒలింపిక్స్‌లో ఈ ఘనత నమోదు చేసి తొలి భారత బాక్సర్‌గా వేదికపై సగర్వంగా నిలిచాడు. ఈ విజయంలో ఒక్కసారిగా విజేందర్‌ను కీర్తి, కనకాదులు వరించాయి. కానీ అతను ఏ దశలోనూ ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ఒలింపిక్ పతకం తర్వాత కూడా వరల్డ్ చాంపియన్ షిప్లో, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్ షిప్లో వరుస పతకాలు గెలుచుకున్నాడు. వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకున్నాడు. PC: Vijender Singh Instagram డ్రగ్స్ వివాదాన్ని దాటి.. ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత ఒలింపిక్స్ మెడల్ గెలిచిన నాలుగేళ్లకు విజేందర్ కెరీర్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా స్పోర్ట్స్‌మన్ డ్రగ్స్ అంటే నిషేధిత ఉత్ప్రేరకాలే అని వినిపిస్తుంది. కానీ ఇది అలాంటిది కాదు. విజేందర్ హెరాయిన్ తదితర డ్రగ్స్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడని పోలీసులు ప్రకటించారు. ఒక డ్రగ్ డీలర్ ఇంటి ముందు విజేందర్ భార్య కారు ఉండటం కూడా పోలీసు విచారణంలో కీలకంగా మారింది. పోటీలు లేని సమయంలో తీసుకునే డ్రగ్స్‌కు సంబంధించి తాము పరీక్షలు చేయలేమంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించడం విజేందర్కు ఊరటనిచ్చింది. అయితే యువ ఆటగాళ్లపై ఇలాంటి ఘటనలు ప్రభావితం చూపిస్తాయంటూ నేరుగా కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో ‘నాడా’ పరీక్షలు నిర్వహించింది. దాదాపు 14 నెలలు వివాదం సాగిన తర్వాత విజేందర్కు ‘క్లీన్చిట్’ లభించింది. పురస్కారాలు ఆటగాడిగా అద్భుత ప్రదర్శనకు భారత ప్రభుత్వం అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న విజేందర్ సింగ్... పలు సంస్థలకు మాడలింగ్ చేయడంతో పాటు ‘పగ్లీ’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించాడు. త్వరలో రాబోయే సల్మాన్ ఖాన్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లోనూ అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు.. ఇతర భారత బాక్సర్లతో పోలిస్తే విజేందర్ సింగ్ కెరీర్ కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఒలింపిక్ పతకం అందించిన అమెచ్యూర్ బాక్సింగ్‌ను దాటి ఏ భారత బాక్సర్ ఆలోచించలేదు. కానీ విజేందర్ మాత్రం సాహసం ప్రదర్శించాడు. అమెచ్యూర్తో పోలిస్తే ఎంతో ప్రమాదకరంగా, రక్షణ ఉపకరణాలు వాడే అవకాశం లేని ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టాడు. ‘సాధించిన పేరు ప్రతిష్ఠలు చాలు. ఇప్పుడు ఇదంతా అవసరమా? లేనిపోని ప్రమాదం కొనితెచ్చుకోవడమే’ అని సహచరులు వారించినా అతను వెనుకడుగు వేయలేదు. నేను బాక్సర్‌ను, ఎక్కడైనా పోరాడతాను అంటూ తన గురించి తాను చెప్పుకున్న విజేందర్, 2015 అక్టోబరులో తొలిసారి ఇందులోకి అడుగు పెట్టాడు. అంచనాలకు మించి రాణించిన అతను అక్కడా మంచి విజయాలు అందుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో 14 బౌట్లు ఆడిన అతను 13 గెలిచి ఒకసారి మాత్రమే ఓడాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే విజేందర్ సింగ్ 2011లో ఢిల్లీకి చెందిన అర్చనా సింగ్‌ను వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు అబీర్ సింగ్, అమ్రిక్ సింగ్ సంతానం. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్ -
19 నెలలు గ్యాప్ వచ్చినా.. ఏ మాత్రం తగ్గని జోరు
భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. దాదాపు 19 నెలల పాటు దూరంగా ఉన్న ఈ స్టార్ బాక్సర్ బుధవారం రాయపూర్‌లోని బల్బీర్ సింగ్ జునేజా స్టేడియంలో 'జంగిల్ రంబుల్' నాకౌట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో ఘనా బాక్సర్ ఎలియాసు సుల్లీని.. విజేందర్ తన పంచ్ పవర్‌తో చిత్తు చేశాడు. కాగా విజేందర్కు ఇది 13వ బౌట్ విజయం. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ నాకౌట్లో 13-1తో తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం విజేందర్ సింగ్ ఎమోషనల్ అయ్యాడు. ''రాయపూర్ ప్రజలకు నా ధన్యవాదాలు. నా టీమ్‌తో కలిసి చత్తీస్‌ఘర్‌కు రావడం సంతోషంగా ఉంది. గత రెండేళ్ల నుంచి మేము ఎలాంటి బౌట్స్‌కు దిగలేదు. 19 నెలల విరామం తర్వాత కెరీర్‌ను విజయంతో ఆరంభించడం మంచి సూచకం. ఈ బ్రేక్ తర్వాత నేను తలపడిన ఘనా బాక్సర్ మీ దృష్టిలో అంత పేరున్న బాక్సర్ కాకపోవచ్చు. కానీ నాకు, టీమ్‌కు, నా సహాయ సిబ్బందికి అతని పంచ్ పవర్‌పై అవగాహన ఉంది. అందుకే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ముగించాలని అనుకున్నా. ఈ క్రమంలోనే చత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కు ధన్యవాదాలు. ఈ మ్యాచ్ నిర్వహించడంలో ఆయన మద్దతు చాలా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ యువతను క్రీడలకు మరింత దగ్గర చేయడం ఒక బహుమతిగా అనుకోవచ్చు. ఇక నా తర్వాతి బౌట్ డిసెంబర్లో జరగనుంది. దానికోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..? Vijender Singh returned to winning ways as he outpunched Ghana's Eliasu Sulley in a professional boxing event 'The Jungle Rumble' at the Balbir Singh Juneja Stadium in Raipur on Wednesday, August 17. Congratulations Jatta ❤️#जाट_समाज pic.twitter.com/YhpypIznC3 — जाट समाज (@JAT_SAMAAJ) August 17, 2022 -
టైటిల్ గెలిచిన కొద్ది నిమిషాల్లోనే..
డాన్‌కాస్టర్: బ్రిటీష్ బాక్సర్ స్కాట్ వెస్ట్గార్త్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ గెలిచిన కొద్ది నిమిషాల్లోనే తుది శ్వాస విడవడం తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం జరిగిన ఇంగ్లిష్ టైటిల్ ఫైట్‌లో వెస్ట్గార్త్.. ప్రత్యర్థి డెక్ స్పెల్మన్పై విజయం సాధించిన తర్వాత సంబరాల్లో మునిగిపోయాడు. అదే క్రమంలో పోస్ట్ మ్యాచ్ ఇంటర్య్వూ ఇవ్వడానికి వెళ్లిన వెస్ట్గార్త్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తొలుత కొద్దిపాటి గుండె నొప్పితో బాధపడిన వెస్ట్గార్త్ ఉన్నపళంగా నేలపై చతికిలబడిపోవడంతో కలకలం రేగింది. ముందుగా అక్కడున్న వైద్యులు అతనికి వైద్యం చేసి తర్వాత ఆస్పత్రికి తరలించారు. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వెస్ట్గార్త్ టైటిల్ గెలిచినా.. జీవితంలో ఓడిపోవడంతో బాక్సింగ్ ప్రపంచం షాక్‌కు గురైంది. అతను 10 ప్రొఫెషనల్ ఫైట్లలో తలపడిన వెస్ట్గార్త్ 7 విజయాల్ని సాధించాడు. -
ఈ టైటిల్ ఆ దిగ్గజానికి అంకితం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ వరుస బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్టార్ ఆటగాడు తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాడు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్లో విజయం సాధించి ‘డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్’ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను గతనెల మూడో తేదీన కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ కి అంకితమిస్తున్నట్లు విజేందర్ ప్రకటించాడు. ఈ తాజా బౌట్లో 98-92, 98-92, 100-90 తేడాతో కెర్రీపై నెగ్గడంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మూడు రౌండ్ల వరకూ బౌట్ హోరాహోరీగా సాగింది. అయితే నాలుగో రౌండ్లో విజేందర్ విసిరిన రైట్ హుక్ ప్రత్యర్థి కెర్రీ హోప్ ఎడమ కన్నుపై బలంగా తాకింది. అక్కడి నుంచి విజేందర్ బౌట్ లో చురుగ్గా కదులుతూ, డిఫెన్స్ కు ప్రాధాన్యమిస్తూ ప్రత్యర్థిపై సంచలన విజయాన్ని నమోదుచేశాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్, రైనా, సెహ్వాగ్, బాక్సర్ మేరీకామ్, నటి నేహా ధూపియా, ఇతర ప్రముఖులు ఈ బౌట్‌ను తిలకించారు. -
మరో నాకౌట్ సాధిస్తాడా?
నేడు సామెట్తో విజేందర్ బౌట్ మాంచెస్టర్: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తనకన్నా అనుభవజ్ఞుడితో భారత స్టార్ బాక్సర్ విజేందర్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. బౌట్‌కు ముందే మాటల యుద్ధం ప్రారంభించిన సామెట్ హ్యూసినోవ్ను తక్కువ అంచనా వేయకున్నా కచ్చితంగా ఓడించి హ్యాట్రిక్ సాధిస్తానని విజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నేడు (శనివారం) మాంచెస్టర్ ఎరీనాలో ఈ పోరు జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా ఆడిన రెండు బౌట్స్ నాలుగు రౌండ్ల పాటు జరగ్గా నాకౌట్ విజయాలతో విజేందర్ అదరగొట్టాడు. అయితే నేటి బౌట్ ఆరు రౌండ్ల పాటు సాగుతుంది. సామెట్ ఇప్పటిదాకా తలపడిన 14 ఫైట్స్‌లో ఏడు విజయాలున్నాయి. విజేందర్ తనకు పోటీయే కాదని, అతడి ఎముకలు విరిచి భారత్‌కు పంపిస్తానని సామెట్ ఇప్పటికే మాటల జోరు కొనసాగిస్తున్నాడు. అయితే విజేందర్ మాత్రం ఇలాంటి వాటికి బెదిరేది లేదని అన్నాడు. -
ప్రో కబడ్డీ తరహాలో ప్రో బాక్సింగ్..
హైదరాబాద్: క్రీడాభిమానులచే విశేష ఆదరణ పొందిన ప్రో కబడ్డీ (ప్రొఫెషనల్ కబడ్డీ) పోటీలు నిరాటంకంగా సాగుతున్న తరుణంలోనే ప్రొ బాక్సింగ్ (ప్రొఫెషనల్ బాక్సింగ్) లీగ్స్‌కు తెరతీసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్) మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడియర్ పీకే మురళీధరన్ రాజా బుధవారం హైదరాబాద్‌లో పలువురు బాక్సర్లు, బాక్సింగ్ సమాఖ్యల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత నెలలో ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) ఏర్పాటుతో ఇన్నాళ్లూ అమెచ్యూర్కే పరిమితమైన బాక్సర్లు ఇకపై కాసులు కురిపించే ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ హైదరాబాద్ క్లబ్ కల్చర్‌తో బాక్సింగ్‌కు మేలు జరుగుతుందన్నారు. అమెచ్యూర్లుగా తమ కెరీర్లకు ముగింపు పలికిన ఆటగాళ్లకు ప్రొ బాక్సింగ్ ఆదాయ మార్గంగా నిలుస్తుందని, తద్వారా క్రీడాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. -
భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) పేరిట టోర్నీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడ్ పీకే మురళీధరన్ రాజా దీనికి రూపకల్పన చేశారు. ఇన్ఫినిటి ఆప్టిమల్ సొల్యుషన్స్ (ఐఓఎస్) ఈ టోర్నీని మార్కెటింగ్ చేయనుంది. ఐబీసీతో ఒప్పందం చేసుకుంటే బాక్సర్‌కు ఏడాదికి నాలుగు బౌట్లను ఏర్పాటు చేస్తారు. విజేతలకు రూ. 6 లక్షలు చెల్లించనున్నారు. అయితే బాక్సర్ హోదాను బట్టి ఇందులో మార్పు ఉంటుందని ఐఓఎస్ సీఈఓ నీరవ్ తోమర్ చెప్పారు. సెప్టెంబర్ చివరి వారం, లేదా అక్టోబర్ మొదటి వారంలో తొలి బౌట్ జరగొచ్చు. -
60 సెకన్లలో హాంఫట్...
న్యూయార్క్ : విఖ్యాత బాక్సింగ్ స్టార్స్ ఫ్లోయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ ప్యాకియో (ఫిలిప్పీన్స్)ల మధ్య మే 2న జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. శుక్రవారం టికెట్ల అమ్మకాలు మొదలైన 60 సెకన్లలోపే అన్ని టికెట్లు అయిపోయాయి. వీరిద్దరి బౌట్‌కు వేదికగా నిలువనున్న లాస్‌వేగాస్‌లోని ఎంజీ ఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనా సామర్థ్యం 16 వేలు. కాగా అభిమానులకు 14 వేల టికెట్లు విక్రయించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన 38 ఏళ్ల మేవెదర్ తన కెరీర్లో 47 బౌట్లలోనూ విజేతగా నిలిచాడు. ప్యాకియో 64 బౌట్లలో 57 విజయాలు నమోదు చేసుకున్నాడు.