జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా వేణు
నయీంనగర్/ఆత్మకూరు : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆత్మకూరు మండలం పులుకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పరికిపండ్ల వేణు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా నుంచి వేణు జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర మానవవనరుల శాఖ వెబ్సైట్లో పేర్కొంది. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో ఆయన అవార్డు స్వీకరించనున్నారు. తెలంగాణలో మొత్తం ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా.. మన జిల్లా నుంచి వేణు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, వేణు 2003లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఇదే ఏడాది ఇందిరా ప్రియదర్శిని అవార్డులను అందుకున్నారు. కాగా, 2001 జనాభా గణనలో ఉత్తమ సేవలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ఎన్యూమరేటర్‌గా వెండి పతకం, ప్రశంసపత్రంతో సత్కరించింది. వీటితోపాటు ఆయన మరెన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు స్వీకరించారు. ప్రధానంగా 2014లో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు నిర్విరామంగా హాజరై జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొం దారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా వేణు ఎంపిక కావడంపై అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.