అందానికి నేస్తానివై..
బ్రహ్మ మనసు పెట్టి చేసిన బొమ్మయినా.. రవివర్మ గీసిన వదనమైనా.. మరింత అందంగా కనిపించాలంటే కాసింతైనా మేకప్ కావాల్సిందే. అందుకే కాలేజీ అమ్మాయిలంతా హిమాలయ ప్యూర్ స్కిన్ ఫేషియల్ వర్క్‌షాప్‌నకు క్యూ కట్టారు. ప్రఖ్యాత సౌందర్య నిపుణురాలు తమన్నా రూజ్ హెర్బల్ స్కిన్‌కేర్ టెక్నిక్లను అనుసరించి అందంగా ముస్తాబయ్యారు. చర్మ సంరక్షణకు సంబంధించి విద్యార్థులకు రకరకాల చిట్కాలు చెప్పిన మేకప్ ఆర్టిస్ట్ తమన్నా రూజ్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.
- వాంకె శ్రీనివాస్
నేను పుట్టింది ఢిల్లీ. అయితే 15 ఏళ్ల క్రితం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్‌కు వచ్చా. ఎంబీఏ పూర్తవగానే నగరంలోని కార్పొరేట్ కంపెనీల్లో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేశా. నేను మేకప్ బాగా చేస్తుండటంతో స్నేహితులు, కుటుంబసభ్యులు దాన్నే ప్రొఫెషన్‌గా తీసుకోమని ప్రోత్సహించారు. అలా ఐదేళ్ల కిందట మేకప్ ఆర్టిస్ట్‌గా నా ప్రయాణం మొదలైంది. తొలినాళ్లలో చారిటీల కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో నా ప్రత్యేకత చూపించాను. తర్వాత నటి శ్రీదేవి దగ్గర అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాను. బేసిక్ మేకప్‌ను ఇష్టపడే శ్రీదేవి కళ్ల అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు ఇప్పటికీ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాను. టాలీవుడ్ హీరోయిన్లు సమంత, చార్మితో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు మేకప్ మెరుగులు దిద్దుతున్నా.
నమ్మకమే నన్ను నడిపిస్తోంది...
ప్రతి పని నమ్మకంతో చేస్తా. ఎదుటి వాళ్లు ఎక్స్పెక్ట్ చేసినదానికన్నా రెట్టింపు అవుట్ ఇవ్వడానికి కష్టపడతాను. నా క్రియేటివిటీతో వారి అందానికి వన్నె తెస్తా. ఒక్క ముఖమే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మేలు రకమైన సౌందర్య సాధనాలను ఉపయోగించడం ద్వారా సహజ సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేయవచ్చు. బంజారాహిల్స్‌లో నేను నెలకొల్పిన ‘తమన్నా మేకప్ ఆర్టిస్ట్రీ’ స్టూడియో ద్వారా పెళ్లిళ్లకు, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, ప్రత్యేక కార్యక్రమాలకు మేకప్ సర్వీసులు చేస్తుంటాను కూడా.