ప్రేమిస్తే.. ఒప్పిస్తాం!
‘కమల్ ఖిల్తే హై.. ఆంఖ్ భరాతీ హై జబ్ కభీ లబ్‌పే తేరా నామ్ వహ్వా ఆతా హై..’ (నీ వలపుల పేరు పెదవులపై నడయాడినంతనే కమలాలు వికసిస్తాయి. కళ్లు ఆనందంతో మెరుస్తాయి)
భాగమతిని గురించి కవి మఖ్దూమ్ మొహియుద్దీన్ స్పందన ఇది. షాజహాన్ తన ప్రియురాలి కోసం ఒక్క తాజ్‌మహల్‌నే కట్టించాడు. కానీ కులీకుతుబ్‌షా ఒక మహానగరాన్నే నిర్మించాడు. బహుశా మానవ చరిత్రలోనే తొలి ప్రేమ నగరం మన హైదరాబాద్.
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమంటే త్యాగం.. ప్రేమంటే సాహసం... అందుకే ప్రేమించాలంటే గొప్ప శక్తి కావాలి అంటున్న నగర యువత... ప్రేమిస్తే.. తప్పకుండా పెద్దలను ఒప్పించే పెళ్లి పీటల వరకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నగరంలోని 17 నుంచి 22 ఏళ్ల వయసున్న యూత్ తమ మనోగతాన్ని ఆవిష్కరించేందుకు నిర్వహించిన ‘క్విక్ సర్వే’లో వారంతా ప్రేమకు ఓటేసినా.. పెద్దల అంగీకారమే ముఖ్యమని చెప్పేశారు.
ప్రేమ పెళ్లి చేసుకుంటామని అబ్బాయిలు అధిక సంఖ్యలో చెప్పగా... అమ్మాయిలకు వచ్చేసరికి ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓటేశారు. ‘ప్రేమిస్తే ఎలా పెళ్లి చేసుకుంటార’న్న ప్రశ్నపై స్పందిస్తూ... ‘పెద్దలను ఒప్పిస్తా’మని మెజారిటీ అమ్మాయిలు చెప్పగా... అబ్బాయిలు దాదాపుగా వారితో ఏకీభవిస్తూ ‘పెద్దల దీవెనలు కావాల’ని అన్నారు. ‘ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా?’ అన్న ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా మనసు పారేసుకుంటున్నారని తేలింది.
తొలి చూపులో పుట్టే ప్రేమపై వేసిన ప్రశ్నకు అబ్బాయిలు, అమ్మాయిలు ‘అది ఒట్టి ఆకర్షణే’నని తేల్చారు. తొలి చూపులో ప్రేమలో పడటమంటే కేవలం వ్యామోహమేనని చెప్పారు. ‘సాక్షి’ సర్వే ఫలితాలపై మానసిక విశ్లేషకులు డాక్టర్ సి.వీరేందర్ స్పందిస్తూ.. నేడు ప్రేమ కం టే కెరీర్ ముఖ్యమైన అంశం గా యూత్‌లో కనిపిస్తోందన్నారు. వృత్తిలో స్థిరపడ్డాకే ప్రేమ -పెళ్లి అంశాలు చర్చకు వస్తున్నాయని చెప్పారు. తొలి చూపులో ప్రేమ అనేదే ఉండదని... అది పూర్తి ఆకర్షణనేనని అనేక అంశాల్లో వెల్లడైందని పేర్కొన్నారు.