పుష్కర స్నానం ఆచరించిన నందమూరి బాలకృష్ణ
రాజమండ్రి (తూర్పు గోదావరి) : గోదావరి పుష్కరాల్లో స్నానం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాజమండ్రి వీఐపీ ఘాట్లో శనివారం పుష్కర స్నానమాచరించిన ఆయన తన తల్లిదండ్రులు ఎన్టీ రామారావు, బసవతారకంలకు పిండ ప్రదానాలు చేశారు.
ఈ 12 రోజులూ రాజమండ్రిలో పుష్కర విధులను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు. అలాగే స్వచ్ఛంద సంస్థల సేవలు కూడా బాగున్నాయన్నారు. పుష్కర స్నానాలు ఆచరించినవారందరికీ గోదావరి మాత శుభాశీస్సులు అందించాలని, పుష్కర పుణ్యం లభించాలని కోరుతున్నానన్నారు. అనంతరం ఘాట్లో ఉన్న జ్ఞానసరస్వతి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకున్నారు.