Ravi Shankar Sunke
-
‘ఎమ్మెల్యే టికెట్టు నాదే.. ఆ దుర్మార్గుల్ని నమ్మొద్దు’
సాక్షి, కరీంనగర్: అసంతృప్త నేతలపై బహిరంగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరపున మళ్ళీ చొప్పదండి ఎమ్మెల్యే టిక్కెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారాయన. గంగాధర మండలం బూర్గుపల్లిలో బీసీబంధు చెక్కు పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్.. అసంతృప్తవాదులు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. చొప్పదండి నుంచి మరోసారి ఎమ్మెల్యే టికెట్ నాదే. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ పదే పదే చెబుతున్నారు. చాలా స్పష్టంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి వాళ్ల వాళ్ల స్థానాల నుంచే పోటీ అని చెబుతున్నారు. కానీ, కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ వాటిని నమ్మొద్దంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో.. మరోసారి తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. గత కొద్దిరోజులుగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్వయంగా ఆయన తిరుగుబాటు నేతలపై మండిపడటం, టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. -
చొప్పదండి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ చరిత్ర
చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గం చొప్పదండి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది సాంకే రవిశంకర్ 42127ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మేడిపల్లి సత్యంపై గెలిచారు. ఇక్కడ 2014లో టిఆర్ఎస్ పక్షాన ఎన్నికైన బొడిగె శోభకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్తగా రవిశంకర్ కు కేటాయించారు.దీనికి నిరసనగా శోభ బిజెపిలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఆమెకు 15600 ఓట్లు మాత్రమే వచ్చాయి.కాగా గెలిచిన రవిశంకర్ కు 91090 ఓట్లు రాగా, మేడిపల్లి సత్యం కు 48963 ఓట్లు వచ్చాయి. చొప్పదండి రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య 2009లో టిడిపి పక్షాన గెలిచారు. అంతకుముందు రెండుసార్లు నేరెళ్ల నుంచి టిడిపి తరపునే గెలిచారు. 2014లో దేవయ్య టిడిపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ఐలో చేరినా ఫలితం దక్కలేదు. టిఆర్ఎస్ తరపున తొలిసారి పోటీచేసిన మహిళ అభ్యర్ధి బొడిగె శోభ చేతిలో దేవయ్య 54981 ఓట్ల తేడాతో ఓడిపోయారు.2014లో చొప్పదండిలో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధి మేడిపల్లి సత్యం 13104 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసి మరోసారి ఓటమి చెందారు. చొప్పదండి రిజర్వు అయ్యేవరకు జరిగిన ఎన్నికలలో ఐదుసార్లు రెడ్లు,ఒకసారి వెలమ, రెండుసార్లు బిసిలు ఒకసారి ఇతరులు గెలుపొందారు.1983 నుంచి 2009 వరకు చొప్పదండిలో ఒక్క 1999లో మాత్రమే కాంగ్రెస్ ఐ గెలిచింది. చొప్పదండి నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి మూడుసార్లు, టిడిపి ఆరుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన న్యాలకొండ రామ్‌కిషన్‌రావు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో సభ్యునిగా కూడా ఉన్నారు. దేవయ్య కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసారు. 1957లో చొప్పదండిలో పిడిఎఫ్ పక్షాన గెలిచిన చెన్నమనేని రాజేశ్వరరావు ఆ తరువాత సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ అభ్యర్ధిగా, ఒకసారి టిడిపి తరుఫునగెలిచారు. చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
చొప్పదండి ఎమ్మెల్యేకు చుక్కెదురు.!
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాల్లో సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను నీలోజిపల్లి, కుదురుపాక గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట పరిసరాల్లో ఎంపీ సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటేందుకు ఎమ్మెల్యే వచ్చారు. మొదట ప్రాజెక్ట్ సమీపంలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తనను నిర్వాసితులు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో నిర్వాసితులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా మిడ్‌మానేరు కట్టపై నుంచి గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న నిర్వాసితులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే వాహనం ఎదుట బైఠాయించారు. వెంట ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుతప్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రావాలని నిర్వాసితులు పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనం దిగి నిర్వాసితులు కూర్చున్న స్థలం వద్దకు వచ్చి కూర్చున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.2 లక్షల ప్యాకేజీతోపాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ను బతిమిలాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో సమస్యలపై మాట్లాడేందుకు రావాలని ఎమ్మెల్యే వారిని కోరినా స్పందించకపోవడంతో బైఠాయించిన నిర్వాసితులను పోలీసులు పక్కకు తొలగించడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.