ఐటీ పార్కులు.. పారిశ్రామిక వాడలు!
⇒ జిల్లాలో 38 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు
⇒ టీఐఐసీ బృహత్తర ప్రణాళిక
⇒ గుర్తించిన 9,166 ఎకరాలు బదలాయించాలి
⇒ పెండింగ్ ప్రతిపాదనలు తక్షణమే పరిష్కరించాలి
⇒ భూ నిధిని అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి టీఐఐసీ లేఖ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, ఫార్మాసిటీలు.. ఇవన్నీ మన జిల్లాలో కొలువుదీరనున్నాయి. తెలంగాణకు తలమానికంగా జిల్లా నిలిచేలా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఐఐసీ) బృహత్తర ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 38 పారిశ్రామిక పార్కులు (ఐపీ) ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన టీఐఐసీ.. భూముల అప్పగించాలని రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెంచింది. ఇప్పటికే గుర్తించిన 9,166 ఎకరాలను తక్షణమే బదలాయించాలని ఆ సంస్థ కోరుతోంది.
దీంట్లో కూడా చాలావరకు సర్కారు భూములనే టీఐసీసీకి కేటాయించినప్పటికీ, కొన్నిచోట్ల అసైన్డ్‌దారులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, పరిహారం ఎక్కువగా ఇవ్వాలనే డిమాండ్‌తో భూ బదలాయింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల పట్టా భూములను సేకరించడం రెవెన్యూ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్న కేసీఆర్ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ల్యాండ్ బ్యాంక్(భూనిధి)లను అందుబాటులో ఉంచుకోవాలని టీఐఐసీని ఆదేశించింది.
దీంతో భూముల వేటను కొనసాగిస్తున్న ఆ సంస్థ.. బదలాయించకుండా పెండింగ్‌లో పెట్టిన భూములనూ తమకు అప్పగించాలంటూ జిల్లా యంత్రాంగానికి లేఖలు రాస్తోంది. గతంలో ప్రతిపాదించిన హార్డ్‌వేర్, రైస్హాబ్, బీడీఎల్ సంస్థ, ఏరో స్పేస్ జోన్ సహా తాజాగా ఫార్మాసిటీ, ఏరో పార్కు, హార్డ్‌వేర్ విస్తరణకు అదనంగా భూములు కావాలని నివేదించింది. దీంతో నిర్దేశిత భూములను అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నిర్వాసితుల నుంచి రైస్‌హబ్‌కు వ్యతిరేకత
⇒ మహేశ్వరం మండలం కొంగర కలాన్‌లో ప్రకటించిన రైస్‌హబ్‌కు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ధారించిన పరిహారంచాలదని, ఎకరాకు రూ.6.50 లక్షలు ఇస్తేనే భూములిస్తామని ఆక్రమణదారులు భీష్మించడంతో రైస్‌హబ్ పనులు నిలిచి పోయాయి. 146 మంది మిల్లర్లు ఇక్కడ రైస్‌మిల్లులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినా అప్రోచ్ రోడ్డు లేకపోవడం ప్రాజెక్టు ఆగేందుకు కారణమైంది. ఇటువంటి బాలారిష్టాలను అధిగమిస్తేగానీ పెట్టుబడులకు మార్గం సుగమంకాదని టీఐసీసీ వాదిస్తోంది.
⇒ తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత తొలిసారి ప్రకటించిన ‘ఫార్మాసిటీ’కి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔషధనగరిని నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినా.. ఇప్పటికే టీఐఐసీకి భూ బదలాయింపు జరగకపోవడం గమనార్హం. ము చ్చర్ల, తాడిపర్తి, కుర్మిద్ద, ముద్విన్, కడ్తాల్ గ్రామాల్లోని 11,000 ఎకరాలను తక్షణమే ఫీల్డ్ సర్వే చేయాలని, అటవీశాఖ భూమిని డీనోటి ఫై చేయాలని కోరినా స్పందన రావడంలేదని టీఐఐసీ వాపోతుంది.
⇒ సరూర్‌నగర్ మండలం నాదర్గుల్ సర్వే నం.519,523లలో ఏరోస్పేస్ జోన్‌ను విస్తరించాలనుకున్నారు. ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నం.520,521లలో హార్డ్‌వేర్ పార్కు విస్తరణకు అడ్డంకిగా మారిన పట్టాభూముల వివాదాన్ని త్వరగా తేల్చాలి.
పారిశ్రామిక ‘పట్నం’
టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సంస్థలతో ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతున్న ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి మరిన్ని పార్కులు తరలిరానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు అదనంగా ఏరోస్పేస్ జోన్, హార్డ్‌వేర్ పార్కుల విస్తరణ, ఏరో పార్కులు ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయి. వాటిలో కొన్ని...
⇒ మంచాల మండలం ఖానాపూర్ సర్వేనం.79లో 421 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క రానుంది.
⇒ ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ సర్వే నం.45లో 176.28 ఎకరాలు పోచారంలోని సర్వేనం.255లో 92.28 ఎకరాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.
⇒ ఎలిమినేడు, కప్పపహాడ్లోని సర్వే నం.512,166,492,421లోని 572.15 ఎకరాలను పారిశ్రామిక వాడగా ప్రతిపాదించారు.
⇒ కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1083.26 ఎకరాలను ప్లాస్టిక్సిటీగా అభివృద్ధి చేయనున్నారు. దీంట్లో 52.30 ఎకరాల మేర పట్టాభూములను రైతుల నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.