rmz
-
డేటా సెంటర్ మార్కెట్లో బెంగళూరు కంపెనీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో ఉన్న బెంగళూరు కంపెనీ ఆర్ఎంజడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డేటా సెంటర్ ఆపరేటర్ కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్‌తో సమాన వాటాగా సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్ఎంజడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ద్వారా భారత డేటా సెంటర్ మార్కెట్లో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్ఎంజడ్ వెల్లడించింది.ఈ నిధులతో తొలుత నవీ ముంబై, చెన్నైలోని అంబత్తూర్లో ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తారు. భవిష్యత్తులో అదనంగా మూడవ కేంద్రాన్ని జోడిస్తారు. అన్ని దశలు పూర్తి అయితే డేటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. యూరప్, జపాన్‌తోపాటు భారత్‌లో కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ 25 ఏళ్లుగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమై ఉంది. -
అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం..
జీవితంలో గొప్ప సక్సెస్ సాధించిన వారిలో చాలామంది కష్టాల సంద్రాన్ని దాటుకుంటూ వచ్చినవారే.. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఆర్‌ఎమ్‌జెడ్ (RMZ) గ్రూప్ చైర్మన్ 'అర్జున్ మెండా' (Arjun Menda). స్కాలర్షిప్ సాయంతో చదువుకుని ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన సక్సెస్ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. అర్జున్ మెండా, ఈ పేరు బహుశా చాలా మందికి పరిచయం లేకపోయినప్పటికీ.. 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో ఒకరుగా నిలిచిన తరువాత దేశంలో ఈయన పేరు మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారుల జాబితాలో మూడవ వ్యక్తిగా నిలిచిన ఈయన ఆస్తుల విలువ ఏకంగా రూ.37,000 కోట్లు. స్కాలర్షిప్ సాయంతోనే డిగ్రీ పూర్తి ప్రస్తుతం పాకిస్థాన్‌లో భాగమైన సింధ్‌లోని షికార్పూర్లో 1933లో అర్జున్ మెండా జన్మించారు. భారత్, పాకిస్తాన్ విభజన జరిగిన సమయంలో మెండా కుటుంబం మొత్తం ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఇండియాలోనే స్థిరపడ్డారు. కుటుంబ పరిస్థితి కష్టంగా ఉన్న రోజుల్లో ఎంతో కస్టపడి స్కాలర్షిప్ సాయంతోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్‌లో ఇండస్ట్రియల్ ఇంజనీర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తరువాత 1967లో గాబ్రియేల్ ఇండియా లిమిటెడ్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. 1980 నాటికి తన జీవితాన్ని మార్చేసిన రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. RMZ కార్ప్.. 2002లో అర్జున్ మెండా RMZ కార్ప్ని స్థాపించాడు. ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని అతని ఇద్దరు కుమారులు, రాజ్ మెండా, మనోజ్ మెండా నిర్వహిస్తున్నారు. కంపెనీ ప్రారంభమైన తరువాత హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో అనేక సాఫ్ట్వేర్ సంస్థలకు అధునాతన భవనాలు నిర్మించి, కార్పొరేట్ కార్యాలయాలను నిర్మించే అగ్రగామిగా ప్రసిద్ధి చెందింది. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? అర్జున్ మెండా చదువుకునే రోజుల్లో తాను పడ్డ కష్టాలను దృష్టిలో 1990లో మెండా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా మెండా ప్రతి ఏటా వందలమంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తూ వారి అభివృద్ధికి దోహదపడుతున్నారు. -
సుజుకీ.. రెండు ఆఫ్‌రోడ్ బైక్‌లు
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్లో రెండు గ్లోబల్ ఫ్లాగ్షిప్ బైక్‌లను విడుదలచేసింది. ఆర్ఎం–జెడ్ 250 పేరిట విడుదలైన బైక్ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్ఎం–జెడ్ 450 మోడల్ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్–రోడింగ్ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్ కోరుకునేవారి సంఖ్య ఊపందుకుంటోంది. ఈ కారణంగానే నేటితరం యువత అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ ప్రాజెక్టు
హైదరాబాద్: నగరంలో భారీ కమర్షియల్ ఆఫీస్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మై హోమ్ గ్రూప్ తాజాగా రియల్ ఎస్టేట్ డెవలపింగ్ సంస్థ ఆర్ఎంజెడ్ కార్ప్‌తో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్టుపై బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండబోయే ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ కార్యకలాపాలు మై హోమ్ గ్రూప్, ఆర్ఎంజెడ్ గ్రూప్ సంయుక్తంగా చేపడతాయి. హైటెక్ సిటీకి దగ్గర్లో 3.5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో తొలి దశ ’స్కైవ్యూ’ సముదాయం 2018 డిసెంబర్ ఆఖరు నాటికి అందు బాటులోకి రానుంది. దేశీయంగా నివసించేందుకు ఉత్తమ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రాజెక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయని మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు తెలిపారు. దేశ, విదేశ కంపెనీలు హైదరాబాద్ మార్కెట్ వైపు దృష్టి సారించే విధంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు ఆర్ఎంజెడ్ కార్ప్ కార్పొరేట్ చైర్మన్ మనోజ్ మెండా పేర్కొన్నారు.