ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగంలో రిలయన్స్, వందల కోట్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ) ఏర్పాటుకు తెరతీసింది. అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఎస్బీవీఎల్) ద్వారా జేవీలో 50.1 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 3,300 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో రూ. 1,670 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది.
యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాన్మినా కార్పొరేషన్‌కు దేశీయంగా చెన్నైలోగల యూనిట్లో ఆర్ఎస్బీవీఎల్ తాజా నిధులను ఇన్వెస్ట్ చేయనుంది. సాన్మినా కార్పొరేషన్ 49.9 శాతం వాటాను కలిగి ఉంటుంది. వెరసి జేవీగా మారనున్న సాన్మినా దేశీ యూనిట్లో ఆర్ఎస్బీవీఎల్ మెజారిటీ వాటాను పొందుతుంది. ఈ పెట్టుబడులను కంపెనీ వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది.
కాగా.. గతంలో ప్రకటించిన విధంగా భాగస్వామ్య లావాదేవీని పూర్తి చేసినట్లు రెండు కంపెనీలూ తాజాగా ప్రకటించాయి. తాజాగా ఏర్పాటు చేసిన జేవీని సాన్మినా యాజమాన్యమే నిర్వహించనుంది. నాలుగు దశాబ్దాలుగా అడ్వాన్స్డ్ తయారీ విధానాల్లో సాన్మినా అనుభవం, దేశీ వ్యాపార వ్యవస్థలో ఆర్‌ఐఎల్‌కున్న నైపుణ్యం, నాయకత్వ పటిమ జేవీకి లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించాయి.
ఆర్ఎస్బీవీఎల్ ఇలా
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్ఎస్బీవీఎల్ రూ. 1,478 కోట్ల ఆదాయం సాధించింది. దాదాపు రూ. 180 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 10,858 కోట్లవరకూ పెట్టుబడులు వెచ్చించింది. తాజా జేవీ ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఆవిర్భవించనున్నట్లు రెండు సంస్థలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.
కమ్యూనికేషన్ నెట్వర్కింగ్, మెడికల్ అండ్ హెల్త్‌కేర్ సిస్టమ్స్, డిఫెన్స్ తదితర రంగాలకు అవసరమైన అత్యున్నత సాంకేతిక మౌలికసదుపాయాల హార్డ్‌వేర్‌ను రూపొందించనుంది. చెన్నైలోని 100 ఎకరాల క్యాంపస్‌లో తయారీ కార్యకలాపాలు చేపట్టనున్నట్లు తెలియజేశాయి.