సమజ్దార్ లోగ్
‘చదివిస్తే ఉన్న మతి పోయిందట’... ఓ పాత సామెత. ప్రస్తుత పరిస్థితి కూడా అదే. ఉన్నతచదువులు చదువుకున్నా అందుకు తగిన ఉద్యోగం దొరకక మతులు పోగొట్టుకున్నవాళ్లు ఎంతోమంది. అలా మతి చలించని ఓ నిరుద్యోగి వ్యథే ఈ నాటకం కథ. ఇటీవల లామకాన్‌లో ప్రదర్శించిన ‘సమజ్దార్లోగ్’ నాటకం గురించి క్లుప్తంగా...
- ఓ మధు
త్రిబుల్ ఎంఏలు చేసినా ఉద్యోగం రాని ఓ యువకుడిది పూట గడవని స్థితి. అశాంతి, దుఖం వేధిస్తుంటే పిచ్చివాడిగా ఆసుపత్రిలో చేరి బతుకుతుంటాడు. అతనితో పాటు ఉండే మరో ముగ్గురు పిచ్చి వాళ్లతో కూడిన సంభాషణలే ఈ నాటకం. ఆ పిచ్చాసుపత్రి ఆవరణలో అనేక సమస్యలు. అయినా బయటి సమాజంలో ఉన్న ఇబ్బందులకంటే ఆస్పత్రిలోవి అసలు సమస్యలుగానే తోచవతనికి.
బిడ్డను అమ్ముకునే తల్లి, మతం మాటున మానవత్వాన్ని తాకట్టు పెట్టే పెద్దమనుషులు, తరాలు మారిన తారతమ్యాలు తొలగని సమాజం.. రాచరికం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ వరకూ మోసపోతూనే ఉన్న ప్రజలు... ఎంతో గంభీరమైన ఈ విషయాలను చక్కటి చలోక్తులతో నొప్పించకుండా కళ్లకు కట్టారు ఈ నాటకం ద్వారా. రాచరిక వ్యవస్థలో కొనసాగిన అధికారదాహం, మూర్ఖపు నిర్ణయాలు, విలాసాల మాయలో రాజ్య కార్యకలాపాలను పక్కకు పెట్టిన తీరు, రాచరికం అంతరించి నుంచి ప్రజాస్వామ్యం రాజ్యమేలుతున్నా...
ఆ ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్న కులం, మతం, అరాచక, అక్రమ వ్యవస్థలను మన కళ్లముందుంచారు ఆ నలుగురు. అధికారం కోసం ముగ్గురు పిచ్చివాళ్లు పడే తాపత్రయం.. అధికారంలోకి వచ్చిన అనంతరం వ్యవహరించే తీరు.. బాధ్యతారాహిత్యం, లంచగొండితనం... ఒకటేమిటి అనేక సమస్యలకు అద్దం పట్టారు. ఈ పరిస్థితులకు అందరూ బాధ్యులే అంటూ ముగుస్తుంది నాటకం.
నాటకం ముగిసినా ఆ పాత్రలు చెప్పిన విషయాలు మనలను వెంటాడుతుంటాయి. అందరినీ ఆలోచనల్లో పడేస్తాయి. నాటకంలో పిచ్చి వాళ్లుగా మెప్పించారు రాహుల్ కమలేకర్, రాజేశ్ షోణ్గయ్, నిఖిలేష్. చదుపుకున్న పిచ్చివాడిగా నటించిన అలీ అహ్మద్ ఈ నాటకానికి దర్శకత్వం వహించారు. సురేందర్ శర్మ రాసిన ఈ నాటకాన్ని దర్పణ్ థియేటర్ గ్రూప్ ప్రదర్శించింది.