SANATHNAGAR Police
-
‘సైబర్ వల’ అమాయకుల ఖాతాలు ఖాళీ!
అంతర్‘జాలం’ మాయగాళ్లకు చిక్కుకుని అమాయక జనులు విలవిల్లాడుతున్నారు. దుండగులు ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి నెట్టింటి వేదికపై విసిరిన వలలో పడి ఎంతోమంది తమ ఖజానాను గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఔను.. రెండు మూడు నెలలుగా సైబర్ నేరగాళ్ల మాయాజాలంలో మోసపోయిన కేసులు అధికమయ్యాయి. ఒకప్పుడు డైరెక్ట్ దొంగతనాలకు తెగపడే సంఘటనలు ఉంటే.. ఇప్పుడు కనిపించని అంతర్జాలంలో వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాలను రాబట్టి మరీ దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. – సనత్‌నగర్ సీసీ కెమెరాలు, పోలీసుల భద్రత వ్యవస్థ పటిష్టంగా తయారవడంతో దొంగలు ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేసే సంఘటనలు తగ్గిపోయాయి. ఇప్పుడు సైబర్ నేరాలు చేసేవారు అధికమయ్యారు. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని పట్టుకుని రివకరీ చేయడం పోలీసులకు సైతం కష్టసాధ్యంగా మారింది. మోసపోతున్న వారిలో ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారే ఉండడం గమనార్హం. కేసులు పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతోనైనా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ ఒకప్పుడు సైబర్‌కు సంబంధించిన ఎలాంటి నేరం జరిగినా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేంది. ఈ క్రమంలో చాలామంది దూరభారంతో ఫిర్యాదుకు వెనుకడుగు వేసేవారు. ⇒ ఇప్పుడు స్థానిక పోలీస్స్టేషన్లలోనే సైబర్ వింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా ఏప్రిల్ నుంచి సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో సైతం ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటుచేసి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ బాధితుల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ⇒ గడిచిన నాలుగు నెలల్లో సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సైబర్ విభాగంలో 51 కేసులు నమోదు కాగా రెండు కేసులను మాత్రమే చేధించగలిగారంటే సైబర్ నేరాల ఛేదన ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా నమోదవుతున్న కేసులు ఇవే.. ⇒ గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికారంటే సైబర్ నేరగాళ్లకు దొరికిపోతున్నారు. నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఇలాంటి కేసులే. ⇒ ఓఎల్ఎక్స్, ఫేస్ బుక్‌లో.. ఇంట్లోని పాత సామగ్రి, ద్విచక్ర వాహనం.. ఇలా ఏదైనా విక్రయాని కి, ఇల్లు అద్దెకిస్తామని ప్రకటన పోస్ట్ చేశారంటే సైబర్ నేరగాళ్ల నుంచి వెంటే ఫోన్ వచ్చేస్తుంది. ⇒ తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ప్రకటనలు చూసి మోసపోతున్న వారు అధికంగా ఉన్నారు. ⇒ ఉద్యోగం కోసం నౌకరీ.కామ్ లేదా పలు వెబ్సైట్లలో అన్వేషణ జరిపి సైబర్ నేరగాళ్లకు దొరికిపోయిన వారు కూడా ఉన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. ⇒ కౌన్ బనేగా కరోడ్‌పతి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెబితే 25 లక్షల డబ్బు వస్తుందని ఆశ చూపి సులువైన ప్రశ్నలు అడిగి బుట్టలో వేసుకుంటున్నారు. ఆ తరువాత మీరు గెలుచుకున్న డబ్బు మీకు అందాలంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, అందుకు రెండు మూడు లక్షల పంపించాల్సి ఉంటుందంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ⇒ మిలటరీ దుస్తులతో ఉన్న గుర్తుతెలియని వ్యక్తుల ఫొటోలతో ఫేస్బుక్లో ద్విచక్ర వాహనం, కారు ఫొటోలను పోస్ట్ చేసి విక్రయిస్తామని ప్రకటన చూసి నమ్మి ఫోన్ చేసిన వారిని నిలువునా ముంచేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అవగాహన అవసరం: ఉచితంగా ఏదీ రాదు. ఆన్లైన్లో అలాంటి ప్రకటనలు ఏవైనా ఉన్నాయంటే కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్యాంకుకు సంబంధించిన వివరాలను ఫోన్లో బ్యాంక్ వారే అడగరు. అలాంటిది బయటి వ్యక్తులు అడిగారంటే అలెర్ట్ అవ్వాల్సిందే. మొబైల్స్‌కు వచ్చే లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీలైనంతవరకు తెలియని వారు పంపించే లింక్‌లను ఓపెన్ చేయకుండా వదిలేస్తేనే బెటర్. సైబర్ నేరగాళ్లు లోకల్లో కాకుండా ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి మోసం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో రివకరీ చేయడం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, లింక్‌లు, కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండి మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలను చెప్పకుండా ఉంటే మేలు. – ముత్తుయాదవ్, సనత్‌నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జాగ్రత్తలు తప్పనిసరి.. ⇒ మీరు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. అందుకు పన్ను రూపంలో నగదు చెల్లించాలని అడిగితే మాత్రం నిర్మోహమాటంగా ఆ బహుమతిని నిరాకరించండి. ⇒ తక్కువ ధరకే వస్తువు ఇస్తామంటే మాత్రం గుడ్డిగా నమ్మేసి ఆన్లైన్లో డబ్బులు పంపకుండా దాన్ని చూసి పరిశీలించిన తర్వాతనే డబ్బులు ఇస్తామని చెప్పండి. ⇒ ఉద్యోగం, ఉపాధి అంటూ ప్రకటనలు ఇస్తూ డబ్బులు అడుగుతున్నారంటే సందేహించాల్సి ఉంటుంది. ⇒ పోన్ చేసిన వ్యక్తులు మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తుల పట్ల అనుమానించాల్సిన అవసరం ఉంది. అవగాహన కల్పిస్తున్న పోలీసులు ⇒ సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు అవగాహనాస్త్రాన్ని సంధించారు. ఎక్కువగా చదువుకున్న వారే మోసపోతుండడంతో ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి మంగళవారం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ⇒ ఎక్కువగా నేరాలు జరిగిన ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటుచేసి ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోకుండా ఎలా వ్యవహరించాలి అనే విషయాలను వివరిస్తున్నారు. -
‘కూరగాయల’ కోసం పొడుచుకున్న స్నేహితులు
హైదరాబాద్: ఇద్దరు కలిసి ఒకే పరిశ్రమలో పని చేస్తుండడంతో వారిద్దరూ కలిసి ఒక గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో వంటావార్పు చేసుకుని తింటూ పనికి వెళ్తున్నారు. అయితే రూమ్‌లో పనులు చెరి సగం చేసుకోవాల్సిన విషయంలో ఇద్దరి అభిప్రాయ బేధాలు వచ్చి చంపుకునే దాక చేరాయి. తాజాగా కూరగాయలు కోయమని మిత్రుడిని అడగా అతడు పెడచెవిన పెట్టడంతో వివాదం మొదలైంది. అటు నుంచి గొడవ పెద్దదై అదే కత్తితో పొడిచే స్థాయికి చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక హెచ్‌పీ రోడ్ కాలనీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైతాస్ ఆలి సల్మాన్, ఫిరోజ్ ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలల నుంచి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో గదికి వారిద్దరు వచ్చారు. వంట కోసం కూరగాయలు కట్ చేసి ఇవ్వమని మైతాస్ ఆలి కోరగా సల్మాన్ ఫిరోజ్ పట్టించుకోలేదు. దీంతో కూరగాయలు కట్ చేసే కత్తితో సల్మాన్ ఫిరోజ్‌పై దాడి చేశాడు. దీంతో ఫిరోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఫిరోజ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మూడుగంటల్లో ముచ్చెమటలు
సమయం : ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు... ప్రాంతం : బోరబండ సమీపంలోని అల్లాపూర్... 200 మంది పోలీసు బలగాలు....ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని నలువైపులా చట్టేశాయి. గడప గడపనూ తట్టి అణువణువూ సోదాలకు దిగారు.....అప్పటివరకు నిద్రలో ఉన్న బస్తీ మొత్తం క్షణాల్లో మేల్కొంది...స్థానికులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి...మూడంటే మూడు గంటల్లోనే 64 బైక్‌లు..20 ఆటోలు...ఒక జీపు...మొత్తం 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం పోలీసు వర్గాలనే విస్తుగొల్పింది. ఇదీ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండ అల్లాపూర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో నెలకొన్న దృశ్యాలు. వివరాలు ఇలా ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు 15 రోజులకోమారు నిర్వహించే కార్డన్‌సెర్చ్‌లో భాగంగా అల్లాపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ నంద్యాల నర్సింహ్మరెడ్డి, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డిల ఆధ్వర్యంలో క్రైమ్, ఎస్ఓటీ, సీసీఎస్‌లకు చెందిన 200 మంది పోలీసు సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి సోదాలు జరిపారు. ఇందులో ధృవపత్రాలు లేని మొత్తం 85 ద్విచక్ర, త్రీవీలర్స్ ఫోర్‌వీలర్స్ వాహనాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. 71 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఒక రౌడీషీటర్, ఒక చైన్‌స్నాచర్, ఇద్దరు మట్కా జూదరులు, నలుగురు దోపిడీదారులు, ఐదుగురు దొంగలు, 20 మంది ఆటో, 38 మంది బైక్ దొంగలుగా అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ధ్రువపత్రాలు చూపించిన వారికి తమ వాహనాలను అప్పగించగా, మిగిలిన వాహనాలను పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కార్డన్ సెర్చ్‌తో సామాన్య ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని తెలిపారు. పాత నేరస్థులు సైతం కార్డన్‌సెర్చ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉమెన్స్ కానిస్టేబుల్స్తోనే ఇళ్ళలో సోదాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు ద్వారా తమ బస్తీలు, కాలనీల్లో ఉండే నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటున్నందున ప్రజలు కూడా పూర్తిగా తమకు సహకారం అందిస్తున్నారన్నారు. స్థానికులు కూడా కాలనీ, బస్తీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే అటువంటి వారిపై పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. -
పక్కింటివారి పనేనా..!
* చిన్నారి లాస్య దారుణ హత్య * పక్కింట్లో మృత దేహం లభ్యం * నిందితులపై స్థానికుల దాడి సనత్‌నగర్: ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారి లాస్యను ఎత్తుకెళ్లి హత్య చేసిన కేసులో పక్కింటివారే పక్కింటివారే ఆ ఘాతుకానికి పాల్పడినట్లుగా చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సనత్‌నగర్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన నవీన్, మయూరి దంపతుల కుమార్తె లాస్య(3.5 ఏళ్లు) బుధవారం రాత్రి అన్నం తిని ఆడుకునేందుకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేసిన ఫలితం లేదు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి వారి పక్కింట్లో దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా మూట కనిపించడంతో దానిని విప్పి చూడగా లాస్య మృతదేహం కనిపించింది. దీంతో కోపానికి గురైన కాలనీ వాసులు ఇంటిలో ఉన్న యాదమ్మ, లక్ష్మయ్య, గిరి, పద్మలను చితకబాదారు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే లాస్యను చంపి ముక్కలు ముక్కలు చేసి బయటపడేయడానికి పథకం పన్నారని, అయితే అందుకు వీలు కాకపోవడంతో గోనె సంచిలో వేసి ఇంట్లో ఉంచినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని సనత్‌నగర్ పోలీసులు తెలిపారు.