saravakota
-
ప్రాణాలు తీసిన ‘సంబంధం’.. ఇద్దరిని హతమార్చి, తను కూడా..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని సారవకోట కోదడ్డపనసలో జంట హత్యల కేసు నిందితుడు ముద్దాడ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో వెలమల ఎర్రమ్మ అనే మహిళ, ముద్దాడ సంతోష్‌లను మంగళవారం కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. హత్యా స్థలం నుంచి పరారైన రామారావు.. గ్రామ సమీపంలో అదే కత్తితో గొంతు కోసుకొని పాల్పడ్డాడు. విగతజీవిగా పడిఉన్న రామారావును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా వరుసకు వదినయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రామారావు.. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం కోదడ్డపనస గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వార్త: యువకుడితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువుగా ఉంటోందని.. -
అక్కడ మలుపు తిరిగినా, నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్లినా ఇలా జరిగేది కాదేమో!
సాక్షి, శ్రీకాకుళం: చీకటిలో కాకుండా కాస్త వెలుగు వచ్చాక బయల్దేరి ఉంటే ఆ తల్లీకొడుకులు బతికి ఉండే వారేమో..? కాసింత నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్లి ఉంటే ఆయువు నిలిచి ఉండేదేమో..? ఆ కల్వర్టు ముందు మలుపు తీసుకుని ఉన్నా.. ఈ పాటికి ఇంటిలో నవ్వుతూ తిరిగేవారేమో..? ఆ ప్రదేశంలోనే వారి మృత్యువు రాసి పెట్టి ఉన్నట్లు కల్వర్టులో పడి ఇద్దరూ కన్నుమూశారు. సారవకోట మండలంలోని బుడితి జంక్షన్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు కలగ రమణమ్మ(38) మణికంఠ (19)లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేకువజామున.. పెద్దపాడు గ్రామానికి చెందిన తల్లీకొడుకులు గురువారం జలుమూరు మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో జరిగిన యాదవుల గావు పండుగకు వెళ్లారు. రాత్రి బంధుమిత్రులతో సరదాగా గడిపి వేకువజామునే బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. చల్లవానిపేట, శ్రీముఖలింగం రో డ్డు విస్తరణ పనుల్లో భాగంగా బుడితి జంక్షన్‌కు సమీపంలో కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కల్వర్టు నిర్మాణం కోసం డైవర్షన్ ఏర్పాటు చేశారు. కానీ వేకువజామున ప్రయాణం పెట్టుకున్న మణికంఠ ఈ డైవర్షన్‌ను గమనించలేదు. బండిని పక్కకు తిప్పకుండానే రుగా ముందుకు వెళ్లడంతో బైక్‌తో సహా కల్వర్టులో పడి అక్కడికక్కడే తల్లీకొడుకు మృతి చెందారు. స్థానికులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుల కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. మణికంఠకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక్కడే కొడుకు కావడంతో తండ్రి కలగ అప్పారావు గుండెలవిసేలా రోదించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిరమండలం ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి మృతదేహాలను పాతపట్నం తరలించారు. చదవండి: విజయనగరం ఎంపీ చంద్రశేఖర్‌కు లోక్‌సభ స్పీకర్ ప్రశంసలు హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్లనేనా..? కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్న చోట హె చ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అదేమార్గంలో రోడ్డు నిర్మా ణ పనులకు సంబంధించిన వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ రోడ్డు ప్ర మాదం జరిగిన ప్రదేశం సారవకోట పోలీసు స్టేషన్ పరిధికి వస్తుందా? జలుమూరు పోలీసు స్టేషన్ పరిధికి వస్తుందా అని రెండు మండలాల పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అనంతరం రెవె న్యూ సిబ్బంది సూచన మేరకు సారవకోట పోలీసులు సంఘటనా స్థలం దగ్గర తదుపరి కార్యకలాపాలు నిర్వహించారు. చదవండి: సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ -
ఇత్తడైనా.. ‘బుడితి’ చేతిలో పుత్తడే !
‘బుడితి’ వస్తువు లేకపోతే శుభ కార్యాల్లో వెలితి అని ఉత్తరాంధ్ర వాసుల నోట నానేటి మాట. అక్కడి నుంచి ఇత్తడి సారె, సామాను తీసుకురాకుంటే ఏ పెళ్లికైనా నిండుదనం రాదంతే. ఆ ఊరి విగ్రహాలు లేకుంటే ఎంత పెద్ద ఆలయానికైనా శోభ రాదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలోని బుడితి గ్రామం కంచు, ఇత్తడి వస్తువులకు శతాబ్దానికి పైగా కేరాఫ్. సారవకోట: దాదాపు నూటయాభై ఏళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలోని బుడితి పుత్తడి బొమ్మలకు పెట్టింది పేరు. స్వచ్ఛమైన బంగారంతో ఇక్కడి కళాకారులు చేసే ఏ వస్తువైనా ప్రత్యేకంగా కనిపిస్తుండేది. కాలక్రమేణా వీరి వృత్తి పుత్తడి నుంచి ఇత్తడికి చేరింది. ముడి సరుకు మారినా వారి పనితీరు మాత్రం మారలేదు. అప్పట్లో చేతితోనే ఏ వస్తువైనా తయారు చేసేవారు. ఇలా ఇక్కడి విశ్వ బ్రాహ్మణులు ఓ బ్రాండ్‌గా మారి ఇత్తడి వస్తువుల పరిశ్రమను అభివృద్ధి చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఇక్కడ సుత్తుల సవ్వడులు, బిందెల మోతలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీరి వృత్తిలోనూ యంత్రాల వినియోగం ఊపందుకోవడంతో.. ఆ మేరకు కార్మికుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుండం గమనార్హం. నమ్మకమే పెట్టుబడి.. ఇక్కడి కార్మికుల పనితీరుపై ఉన్న నమ్మకమే ఇత్తడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి దోహదపడింది. పవిత్రమైన దేవాలయాల నుంచి సామాన్య మధ్య తరగతి ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు అవసరమైన వస్తువులూ ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ తయారైన దేవతా విగ్రహాలు దేశంలోని పలు దేవాలయాల్లో కొలువై ఉన్నాయి. బిందెలు, గృహోపకరణాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాల్లో ఉపయోగించే మకర తోరణాలు, గంటలు వీరి ప్రత్యేకత. ఇక్కడి వస్తువులపై నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తుంటాయి. ప్రతి ఇంటా అనుబంధం ఇత్తడితో ప్రతి ఇంటికీ విడదీయరాని అనుబంధం ఉంటుంది. పెళ్లి నుంచి చావు వరకు ఈ వస్తువులు లేని కార్యక్రమం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఇంటిలోనైనా పెళ్లి కుదిరిందంటే ముందుగా బంగారం కన్నా ఇత్తడి వస్తువులనే కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం యంత్రాలతో తయారవుతున్న వస్తువులు మార్కెట్లో విరివిగా చలామణి అవుతుండడంతో వీరి ఆదాయానికి భారీగా గండి పడుతోంది. లేపాక్షి ఆర్డర్లు.. ఇక్కడ తయారైన వస్తువులు లేపాక్షి వారు కొనుగోలు చేసి వాటిని పలు ప్రాంతాలు, రాష్ట్రాల్లో జరుగుతున్న వస్తు ప్రదర్శనలకు తీసుకెళ్తుంటారు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ వస్తు ప్రదర్శనల్లో బుడితి కంచు, ఇత్తడి వస్తువులకు భలే గిరాకీ ఉంటుందని తయారీ దారులు తెలిపారు.అయితే లేపాక్షి వారు వస్తువులు ఆర్డర్ చేసే సమయంలో అడ్వాన్స్‌గా తక్కువ మొత్తం చెల్లిస్తుండడంతో.. వస్తువులు తయారు చేయడానికి తగిన పెట్టుబడి లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర పనులకు వెళ్లిపోతున్నారు గ్రామంలో సుమారు వందేళ్ల నుంచి మా కుటుంబం ఈ పనిచేస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఇత్తడి వస్తువులకు డిమాండ్ అనుకున్నంత లేకపోవడంతో కొందరు ఈ పనిని వదిలి ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. గతంలో వందలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవి. – పాటోజు శ్రీనివాసాచార్యులు, చీడిపూడి, సారవకోట మండలం ఈ పనిపైనే జీవిస్తున్నాం మా తాత, ముత్తాతల నుంచి ఈ పనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నేను చిన్నతనం నుంచి పనిచేస్తున్నాను. ఇదే పనిని వృత్తిగా చేసుకుందామని ప్రస్తుత యువతరం ముందుకు రావడం లేదు. దీంతో మా తదనంతరం ఈ పని చేసేవారు ఉంటారనే నమ్మకం లేకుండా పోతుంది. – కింతాడ కృష్ణారావు, విగ్రహ తయారీ దారు, చీడిపూడి, సారవకోట -
మూగ యువతిపై అత్యాచారయత్నం
సారవకోట: మూగ యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటన సారవకోట మండలం పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సారవకోట ఎస్ఐ ముకుందరావు తెలిపిన వివరాల ప్రకారం.. మూగుపురం గ్రామానికి చెందిన యడ్ల సూర్యనారాయణ (30) గురువారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో 20 ఏళ్ల మూగ యువతిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్డాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో తల్లితో పాటు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోవడంతో సూర్యనారాయణ పరారయ్యాడు. దీనిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, పాతపట్నం సీఐ రవిప్రసాద్, ఎస్ఐ ముకుందరావులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. యువకుడు పరారీలో ఉండడంతో గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సూర్యనారాయణకు గతంలో కూడా ఇలాంటి ఘటనలతో సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
చేపల కూర లొల్లి: మంచం కోడుతో హత్య
సాక్షి, సారవకోట (శ్రీకాకుళం): అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అతను హత్యకు గురైనట్టు వెల్లడించారు. ఏడుగురిపై కేసు నమోదైంది. పాతపట్నం సీఐ రవిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్ (60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి తీసుకొనివచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరుతో కలిసి ఆదేరోజు రాత్రి చేపల కూర చేసుకుని మద్యం తెచ్చుకుని పూటుగా తాగారు. అయితే చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్ మధ్య గొడవ తలెత్తింది. దీంతో సహనం కోల్పోయిన పాండురంగారావు మంచం కోడుతో ప్రసాద్ తల, చేతులపై కొట్టడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్థానికుల సహాయంలో చెత్త సేకరణ బండిలో తీసుకొనివెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘోరం వెలుగు చూసింది. వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తహసీల్దార్ రాజమోహన్ సమక్షంలో శనివారం ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం కోసం పాతపట్నం తరలించారు. ఈ ఘటనలో పాండురంగారావు, కాకినాడకు చెందిన ట్యాంకు నిర్మాణ కాంట్రాక్టర్, మృతదేహాన్ని తరలించి పాతిపెట్టేందుకు సహకరించిన అవలింగి గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. హిరమండలం ఎస్సై మధుసూదనరావు ఉన్నారు. -
కోడి కూర గొడవ.. రాళ్లతో కొట్టుకున్న ఇరు వర్గాలు
సాక్షి, సారవకోట : స్థానిక రెల్లివీధిలో బుధవారం జరిగిన వివాహ వేడుక రాసాభాసగా మారింది. భోజనాల దగ్గర ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు.. రెల్లివీధికి చెందిన కూన సురేష్‌కు బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందిని(ఉష)తో వివాహం జరిగింది. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాల దగ్గర చికెన్ వడ్డింపులో పెళ్లి కుమార్తె ,పెళ్లి కుమారుడి వర్గాలు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. దీంట్లో పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్ చికెన్ వడ్డిస్తుండగా.. పెళ్లి కుమారుడి వర్గం వారు భోజనం ప్లేట్లను ముఖంపై కొట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడి వర్గానికి చెందిన కలింగపట్నం గణేష్ మెడలోని బంగారు గొలుసు వధువు వర్గం వారు తీసుకున్నట్లు ఆరోపించారు. ఇరువర్గాల వారు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపైకి వచ్చి మరలా ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టారు. దీంట్లో సవలాపురం యర్రయ్య, శోభన్, అప్పన్న, సిరిపురం గనిరాజ్ తదితరులు గాయాలపాలయ్యారు. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ఇరువర్గాలవారు దగ్గరుండి వివాహం జరిపించారు. ఈ ఘర్షణకు సంబంధించి సారవకోట గ్రామానికి చెందిన కలింగపట్నం ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన నలుగురిపై.. నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెళ్లి కుమారుడికి సంబంధించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. గాయపడిన వారిని పాతపట్నం ఆస్పత్రికి తరలించామన్నారు. -
న్యూట్రిషన్ కౌన్సిలర్ల ఆందోళన
సారవకోట : అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న న్యూట్రిషన్ కౌన్సిలర్లు తమకు జరిగిన అన్యాయంపై తిరగబడ్డారు. తొలగింపు ఉత్తర్వులను తిరస్కరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సారవకోట మండలంలో 61 మంది న్యూట్రిషన్ కౌన్సిలర్లు పనిచేస్తున్నారు. వీరంతా మంగళవారం వచ్చి తొలగింపు ఉత్తర్వులు తీసుకెళ్లాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ల ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు కౌన్సిలర్లంతా మంగళవారం సారవకోట సెక్టార్ సూపర్వైజర్ కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యాలయంలోకి వెళ్లి నాయకులను నిలదీశారు. ఈ సందర్భంగా న్యూట్రిషన్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించిన తమను అర్ధంతరంగా తొలగించడం అన్యాయమని ఆరోపించారు. మార్చి నుంచి తమకు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం భావ్యం కాదన్నారు. అనంతరం తొలగింపు ఉత్తర్వులు తీసుకోకుండానే వెనుదిరిగారు. అయితే ప్రాజెక్టు సిబ్బంది మాత్రం తొలగింపు ఉత్తర్వులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఆయా కౌన్సిలర్లకు పంపించడం గమనార్హం. కంచిలి : అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ కౌన్సిలర్లుగా నియమితులైన వారి పోస్టులను రద్దు చేస్తూ ఐసీడీఎస్ అధికారులు మెమోలు పంపించడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తారుు. ఇచ్ఛాపురం రూరల్ ప్రాజెక్టు పరిధిలో నియమితులైన న్యూట్రిషన్ కౌన్సిలర్లు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రం కంచిలిలో బలియాపుట్టుగ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కంచిలి, తలతంపర సెక్టార్ల పరిధి న్యూట్రిషన్ కౌన్సిలర్లను సమావేశపర్చి మధ్యాహ్నానికి మెమోలు ఇచ్చేందుకు ఐసీడీఎస్ సూపర్వైజర్ పి. కళ్యాణి వచ్చారు. అరుుతే మెమోలు తీసుకునేందుకు కౌన్సిలర్లు తిరస్కరించారు. నిబంధనల ప్రకారం నియామకాలు జరిగినా, తాము అప్పులు చేసి అధికార పార్టీ నేతలకు డబ్బులు కట్టామని వాపోయారు. ఒక్కొక్కరు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు నేతలకు ముడుపులు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.తమ జీతాలు పూర్తిగా చెల్లించి, తాము నేతలకు కట్టిన డబ్బుల్ని వడ్డీతో సహా చెల్లించి, మా పోస్టులను తిరిగి ఇవ్వాలని డిమాండు చేశారు. తమ విషయమై స్పష్టత ఇచ్చే వరకు బయటకు విడిచిపెట్టేది లేదని సూపర్వైజర్కు స్పష్టం చేశారు. అరుుతే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని నచ్చజెప్పడంతో విడిచిపెట్టారు. న్యూట్రిషన్ కౌన్సిలర్ల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేతలు ఇప్పిలి కృష్ణారావు, కొత్తకోట శేఖర్, దుర్గాసి ధర్మారావు, మునకాల వీరాస్వామి తదితరులు మద్దతు ప్రకటించారు. అవసరమైతే వారి తరఫున కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అన్యాయం ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తున్న తమకు ముందస్తు సమాచారం లేకుండా అర్ధంతరంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం. -కె శాంతి, న్యూట్రిషన్ కౌన్సిలర్, అన్నుపురం, సారవకోట మండలం న్యాయ పోరాటం చేస్తాం తమని అర్ధంతరంగా విధుల నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతాం. మిగిలిన ప్రాజెక్టుల పరిధిలో తొలగింపునకు గురైన కౌన్సిలర్లతో చర్చించి న్యాయ పోరాటానికి దిగుతాం. -జె.మాధవి, న్యూట్రిషన్ కౌన్సిలర్, జగన్నాథపురం, సారవకోట మండలం -
లక్షలు ఖర్చుచేసినా...
ఆశయం మంచిదే... అమలులోనే విఫలమయ్యారు. లక్షలు ఖర్చుచేశారు... లక్ష్యాన్ని మరిచారు. విత్తనాలు స్థానికంగా తయారు చేసుకోవాలని భావించారు... పరికరాలు కొనుగోలు చేశారు... టార్పాలిన్లతో మూతపెట్టేశారు. కనీసం వచ్చే ఖరీఫ్‌కైనా వాటిని వినియోగంలోకి తెస్తే విత్తన కొరతను నివారించడం కష్టం కాదేమో. సారవకోట: జిల్లాలో రైతాంగం స్థానికంగానే విత్తనాలను ఉత్పత్తి చేసుకునేందుకు జిల్లా అధికారులు యోచించారు. ఇందుకోసం పీఏసీఎస్‌ల ద్వారా నాబార్డు సాయంతో యంత్రాలను కూడా సమకూర్చారు. కానీ వాటిని వినియోగించకపోవడంతో అవికాస్తా మూలకు చేరాయి. జిల్లాలోని పాలకొండ, వజ్రపుకొత్తూరు, పాతపట్నం, తెంబూరు, బుడితి, తూలుగు, అరసవల్లి, కోటబొమ్మాళి పీఏసీఎస్‌లకు ఈ యంత్రాలు గత ఏడాది మంజూరు చేశారు. ఒక్కో యంత్రాన్ని రూ. ఐదులక్షలు వెచ్చించి పంజాబ్ నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ శాఖ పీఏసీఎస్‌లకు అందించింది. కానీ వాటిని భద్రంగా టార్పాలిన్‌లో కప్పి ఉంచాల్సి వచ్చింది. విత్తన కొరత నివారణకే... జిల్లాలో 98 శాతం వ్యవసాయ భూమి వరి సాగులో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని 1.60 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం అవుతుందని భావించిన అధికారులు స్థానికంగా తయారు చేసుకునేందుకు వీలుగా ఈ యంత్రాలను అందించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి వాటిని ఈ యంత్రాలలో వేసి విత్తనాలుగా మార్చాల్సి ఉంటుంది. అవసరమైతే పొలాల దగ్గరకు కూడా వీటిని తీసుకెళ్లి ధాన్యాన్ని విత్తనాలుగా మార్చే వెసులుబాటు ఉంది. వీటి వినియోగంపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కొంతమంది రైతులకు శిక్షణనివ్వాలి. కానీ వ్యవసాయ సిబ్బందిగానీ, కేంద్ర సహకార బ్యాంకు అధికారులుగానీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో యంత్రాలు మూలకు చేరిపోయాయి. -
ఆస్పత్రిలో కూలిన భారీ వృక్షం
సారవకోట (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం ఉదయం ఆరోగ్య కేంద్రం భవనం పక్కనే ఉన్న చెట్టు కూలింది. అయితే ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా భవనంలోని వరండాలో ఉంచిన మోటారు సైకిల్ పూర్తిగా ధ్వంసమైంది. -
పిట్టల్లా రాలుతున్న జనం
జిల్లాలో వడగాడ్పుల ప్రభంజనం కొనసాగుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కళ్లముందే అయినవారు కన్ను మూస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. శనివారం ఒక్కరోజే 16 మంది కన్నుమూశారు. సారవకోట: మండల కేంద్రంలోని కొత్తపేట వీధికి చెందిన కరిమిల్లి రమణమ్మ(65) ఎండ వేడిని తాళలేక శనివారం మృతి చెందినట్లు కుమారులు కరిమిల్లి రామచంద్రరావు, సూర్యనారాయణలు తెలిపారు. ఉదయం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు వారు తెలిపారు. అలాగే కేళవలస గ్రామానికి చెందిన కల్యాణం శిమ్మమ్మ(63) కూడా వడదెబ్బతో మృత్యువాత పడినట్టు సర్పంచ్ ప్రతినిధి చిన్నాల అప్పన్న తెలిపారు. ఈ మృతులపై తమకు ఫిర్యాదు అందలేదని తహశీల్దార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలాకి: ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన పట్నాన జనార్దనరావు (70) ఎండతీవ్రతకు తాళలేక ఇంటివద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు సుబ్బారావు, సోములు తెలిపారు. ఉదయం టిఫిన్చేసిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, చికిత్స చేయించినా ఫలితంలేకపోయిందని వారు చెప్పారు. విషయాన్ని గుప్పెడుపేట పీహెచ్సీ వైధ్యాధికారి బలగమురళి, తహశీల్దార్ జె.రామారావు దృష్టికి తీసుకెళ్లినట్టు సర్పంచ్ లావేటి కృష్ణారావు చెప్పారు. సరుబుజ్జిలి: వడగాల్పులు తట్టుకోలేక పెద్దపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు మురాల మహాలక్ష్మి(75) చనిపోయినటుట సర్పంచ్ గజ్జన వీరమ్మ తెలిపారు. మద్యాహ్నం 12 గంటలకు బహిర్భూమి కోసం వెళ్లివ చ్చిన తరువాత కుప్పకూలిపోయినట్లు పేర్కొన్నారు. సంతకవిటి : పనసపేట గ్రామానికి చెందిన పైడి చిన్నమ్మడు (65), గోళ్లవలస పంచాయతీకి చెందిన చింతాడ రామయ్య (70) వడగాడ్పులు తట్టుకోలేక చనిపోయినట్టు వారి కుటుంబీకులు తెలిపారు. పొందూరు: స్థానిక పార్వతీనగర్ కాలనీలో ఉంటున్న చేనేత కార్మికురాలు మానెం సోమమ్మ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందింది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా చేనేత, జౌళీ శాఖ ఏడి గుత్తు రాజారావు శనివారం పరిశీలించారు. వివరాలు సేకరించి కలెక్టర్ లక్ష్మీనరసింహానికి ఫోన్లో చెప్పారు. ఆయనతో పాటు సాయిబాబా చేనేత సొసైటీ అధ్యక్షులు అప్పలరాజు, ఈఓ కె.మోహన్‌బాబు, జన్మభూమి కమిటీ సభ్యులు చిగిలిపల్లి రామ్మోహనరావు, వార్డు మెంబర్ అనకాపల్లి నాగమణి ఉన్నారు. చేనేత, జౌళీశాఖ ఏడి గుత్తు రాజారావు వెయ్యి రూపా యలను దహన సంస్కార ఖర్చులకు అందజేసారు. వీరఘట్టం: స్థానిక గొల్లవీధికి చెందిన వృద్ధురాలు వూళ్ల తవిటమ్మ (65) వడదెబ్బతో మృతి చెందింది. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఈమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని, శనివారం ఎండతీవ్రత ఎక్కువ కావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజాం మండలంలో ముగ్గురు రాజాం: రాజాంలో శనివారం వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. గురవాం గ్రామానికి చెందిన గురవాన సూర్యనారాయణ (65) పొయ్యి కర్రలు తీసుకురావడానికి పొలంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రాజాం పట్టణంలోని మెంతిపేట ఎస్సీ కాలనీలో కంఠా చంద్రుడు(65), అంపోలు సింహాచలం(68) వడదెబ్బకు తాళలేక మృతి చెందారు. సంతకవిటి: మోదులపేటకు చెందిన లావేటి త్రినాథ(65) వడదెబ్బకు గురై శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తహశీల్దార్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్టు ఎంపీటీసీ సభ్యులు కనకం సన్యాసినాయుడు తెలిపారు. కోటబొమ్మాళి : రెడ్డిక వీధికి చెందిన కమ్మకట్టు లక్ష్మణరావు (27) వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చెరువు వైపు బహిర్భూమికి వెళ్లి స్పృహా తప్పి పడిపోయాడు. వెంటనే స్దానిక సామాజిక హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీఆర్ఓ కె.నాగేశ్వరరావు తహశీల్దార్ వై.శ్రీనివాసరావుకు సమాచార మివ్వగా తహాశీల్దార్, ఎస్.ఐ జి.నారాయణస్వామి హాస్పిటల్‌కు చేరుకోని శవపంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెళియాపుట్టి: భర ణికోట జక్కరవీధి గ్రామానికి చెందిన సవర బాలాజీ(36) వడగాల్పులతో మృతిచెందాడు. శుక్రవారం అస్వస్థతకు గురైన ఈయన్ని శనివారం ఉదయం వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. తహశీల్దార్ జె.చలమయ్య బాలాజీ మృతదేహాన్ని పరిశీలించారు. నందిగాం: లఖిదాసుపురం గ్రామానికి చెందిన శాసనపురి అప్పలనరసమ్మ (44) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉంటూ ఉక్కపోత, వేడి గాలికి తట్టుకోలేక మృతి చెందినట్లు చెప్పారు. తహళీల్దారుతోపాటు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కోదండరావు, ఎస్సై సీహెచ్ ప్రసాద్ గ్రామానికి చేరుకొన్నారు. అయితే ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ కోదండరావు మృతురాలిని పరీక్షించారు. వడదెబ్బతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు.పొందూరు: పిల్లలవలస గ్రామానికి చెందిన గురుగుబెల్లి లచ్చన్న(70) వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. ఆర్ఐ మధు సూదనరావు, వీఆర్వో మురళి వివరాలు సేకరించారు. -
లైంగిక దాడి, ఆపై హత్య
బుడితి(సారవకోట రూరల్): తన కన్న వారింటికి వస్తున్న మహిళ లైంగిక దాడికి గురై, హత్య కాబడిన సంఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్త మవుతు న్నా యి. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ కామినాయుడు పేటకు చెందిన అంపిలి విజయమ్మ(32) సారవకోట మండలం కిన్నెరవాడలో ఉంటున్న కన్నవారింటికి వస్తుండగా బుడితిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సంఘటనా స్థలంలో నిరోధ్‌లు ఎక్కువగా ఉండడంతో సామూహిక అత్యాచారానికి గురై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనకు పాల్పడిన వారు సమీప గ్రామాలకు చెందిన వారే అయి ఉంటారని, ఆమెకు పరిచయం ఉన్న వారుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామంలో ఇంతవరకు ఇలాంటి సంఘటనలు జరగకపోవడంతో గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామస్తులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం పొలాలకు వెళ్లిన గ్రామస్తులకు మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో, కొత్తూరు సీఐ ఇలియాబాబు, క్లూస్ టీం ఎస్ఐ కోటేశ్వరరావు, స్థానిక ఎస్ఐ గణేష్ మృ తదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కంఠంపై గాయం, నోటి నుంచి రక్తం వచ్చినట్లు గు ర్తించారు. మృత దేహానికి పక్కన మద్యం సీసాలు, నిరోధ్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో మృతురాలు అత్యాచారానికి గురై హత్య చేయబడిందని నిర్థారణకు వచ్చారు. మూడేళ్ల కిందటే విడాకులు కిన్నెరవాడ గ్రామానికి చెందిన అంపిలి విజయమ్మకు 12 ఏళ్ల కిందట జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ కామినాయుడుపేటకు చెందిన రమణతో వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల కుమార్తె స్వాతి ఉంది. వీరిద్దరూ మూడేళ్ల కిందట చట్టపరంగా విడాకులు పొం దారు. అయితే కుమార్తె స్వాతి తండ్రి రమణ దగ్గరే ఉంటోంది. జలుమూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతోంది. మృతురాలు విజయ మ్మ కామినాయుడు గ్రామంలో వేరుగా నివసిస్తోంది. దసరా కోసం తల్లి పిసిని చిన్నమ్మి పిలుపు చేయగా గ్రామానికి బయల్దేరి వెళుతుండగా మార్గ మధ్యలో ఈ సంఘటన జరగడంతో ఆమె తల్లి గుండెలు బాదుకుని విలపిస్తోంది. మృతురాలి తండ్రి సీతారాం, అన్నయ్య త్రినాథ కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. దర్యాప్తు చేస్తున్నాం మహిళపై అత్యాచారం, హత్యపై స్థానిక వీఆర్వో శ్యామలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శాంతో తెలిపారు. విడాకులిచ్చిన భర్త, తల్లి నుంచి ప్రాథమిక సమాచారం స్వీకరిస్తున్నామని, ఈ ఘటనతో ఆమెకు ఎవరితోనైనా అక్రమ సంబంధాలున్నాయా మరే ఇతర కారణాలున్నాయా అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తర లించారు. -
విద్యుత్ షాక్‌కు పులి బలి!
తొగిరి(సారవకోట రూరల్):అడవి జంతువుల మాంసం రుచి మరిగిన కొంతమంది వాటిని హతమార్చడానికి విద్యుత్ తీగలను ఉపయోగించారు. వారి కోరిక నెరవేరింది. అడవి పందులు, కుందేళ్లకు బదులు ఏకంగా చిరుత పులే చిక్కింది. విద్యుత్ తీగలను తాకి షాక్‌తో చనిపోవడంతో మాంసాన్ని వాటాలు వేసుకొని అందరూ ఆరగించారు. అంతవరకూ సజావుగా సాగిన మానవమృగాల పన్నాగం పులి గోళ్ల పంపకం విషయంలో తేడాలు రావడంతో విషయం వెలుగు చూసింది. అధికారులు మేల్కొని కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంచలనం రేపిన ఈ సంఘటన సారవకోట మండలంలోని తొగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తొగిరి రెవెన్యూ పరిధిలోని బక్కిరికొండ ప్రాంతంలో అటవీ ప్రాంతం విస్తారంగా ఉంది. దీంతో వివిధ అటవీ జంతువులు జీవిస్తున్నాయి. వీటిని హతమార్చి మాంసాన్ని తినడం హాబీగా చాలామంది మార్చుకున్నారు. కొండ దిగువున ఉన్న వాట్షెడ్ వద్దకు మూగ జీవాలు నీటి కోసం వస్తుంటాయి. దీంతో వీటిని చంపేందుకు కొండపైన ఉన్న జీడితోట చుట్టూ కొంతమంది విద్యుత్ తీగలను అమర్చారు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఓ పులి నీటి కోసం వస్తూ విద్యుత్ తీగలను తాకి షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామస్తులు గుట్టు చప్పుడు కాకుండా శనివారం మధ్యాహ్నం జీడి తోట మధ్యలోకి చనిపోయిన పులిని తీసుకెళ్లి చర్మాన్ని తీసి పంచుకున్నారు. అయితే అదేరోజు సాయంత్రం పులి గోళ్ల పంపకంలో వీరి మధ్య తగాదా వచ్చింది. దీంతో కొంతమంది కోపంతో విద్యుత్ ఎర్త్ కారణంగా పులి చనిపోవడం, దాని మాంసాన్ని పంచుకోవడం, తల, పొట్టెను పాతిపెట్టిన విషయూన్ని ఆదివారం ఉదయం సారవకోట ఎస్ఐ గణేష్, పాతపట్నం అటవీ రేంజర్ యాళ్ల సంజయ్‌కు చేరవేశారు. దీంతో ఎస్ఐ గణేష్ తన సిబ్బంది రవి, గోపాలరావులతో, సారవకోట అటవీ సెక్షన్ అధికారి వెంకటరావు, వీఆర్వో గజపతినారాయణలు సంఘటన స్థలం కోసం గాలించారు. అడవి పంది మాంసం తీసుకెళ్తూ... కానిస్టేబుల్ గోపాలరావు పులి తలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతుండగా తొగిరి గ్రామానికి చెందిన సడగాన గోవిందరావు, బైరి సింహాచలంలు అనుమానాస్పదంగా చేతులకు రక్తం మరకలు, కత్తులతో వారికి తారసపడ్డారు. అలాగే తండ్యాల సింహాచలం అనే వ్యక్తి బకెట్‌తో మాంసం పట్టుకుని పారిపోతూ కనిపించారు. దీంతో గోవిందరావు, సింహాచలాన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా విద్యుత్‌షాక్‌తో అడవి పంది చనిపోవడంతో దీన్ని మాంసం చేసి తీసుకెళ్తున్నామని వివరించారు. పులి విషయమై ఆరా తీయగా శుక్రవారం పులి చనిపోవడంతో గ్రామస్తులమంతా పంచుకున్నామని వివరించారు. దీంతో మరింత లోతుగా పోలీసులు, అటవీశాఖాధికారులు వారిని విచారణ చేయగా తల, పొట్టు పాతిపెట్టిన స్థలాన్ని చూపించడంతో వారి చేతనే పాతిపెట్టిన వాటిని బయటకు తీయించి పరిశీలించారు. అలాగే విద్యుత్ ఎర్త్‌లు పెట్టే నేతింటి శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కొన్ని రోజులుగా కొండ ప్రాంతంలో ఎర్త్‌లు పెడుతున్నట్టు ఆయన అంగీకరించాడు. పులి చనపోరుున విషయూన్ని అటవీశాఖ ఏసీఎఫ్ శ్రీహరగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తల, పొట్టు మంసాహార జంతువుదిగా గుర్తించామన్నారు. దొరికిన తల భాగాన్ని చీడిపూడి పశువైద్యాధికారి ఓంకార్ ప్రాథమిక పరిశీలించారని, హైదారాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీకి పంపిస్తామన్నారు. అక్కడ నుంచి వచ్చే రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సడగాన గోవిందరావు, బైరి సింహాచలం, నేతింటి శ్రీనివాసరావుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూరిస్థాయి నివేదిక వస్తేగాని చనిపోరుునది పులా..కాదా అనే విషయం తెలియదన్నారు. -
పులి మాంసం కోసం డిష్యూం డిష్యూం
శ్రీకాకుళం: పులి మాంసం వాటాలుగా పంచుకునే క్రమంలో గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అది కాస్త పెద్దదై పోలీసు స్టేషన్ చేరింది. ఆ సంఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బకిరికొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఒడిశా నుంచి దారితప్పి ఉత్తరాంధ్రలో ప్రవేశించిన ఓ పులి రైవాడ కొండ ప్రాంతంలో సంచరిస్తుండేది. రైతులు అనధికారికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె వల్ల గత రాత్రి ఆ పులి విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. దీంతో ఆ పులి మాంసాన్ని గ్రామస్తులు పంచుకోవాలని నిర్ణయించారు. ఆ మాంసం పంచుకునే క్రమంలో గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సదరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పులి మృతి చెందిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి... గ్రామస్తుల్లో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పులి చర్మం, గోళ్లు ఏమైనాయి అనే అంశంపై మాత్రం గ్రామస్తులు పెదవి విప్పడం లేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో గ్రామస్తులను విచారిస్తున్నారు.