Sarkaaru Noukari Movie
-
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ
ప్రస్తుతం అందరూ సంక్రాంతి మూడ్‌లో ఉన్నారు. మూవీ లవర్స్ అయితే 'హను-మాన్', 'గుంటూరు కారం' సినిమాల్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేశ్, నాగార్జున చిత్రాలు శని, ఆదివారాల్లో రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావుడి ఉంది. అయితే ఈ ఏడాది రిలీజైన ఓ తెలుగు సినిమా థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో అందరూ షాకవుతున్నారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) ఏంటా సినిమా? ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన 'సర్కారు నౌకరి' సినిమా.. ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. సినిమాలో కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ, సరైన స్టార్స్, పబ్లిసిటీ లేకపోవడంతో అసలు థియేటర్లలోకి వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియదు. దీంతో దీని గురించి మర్చిపోయారు. ఇప్పుడు ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరీ థియేటర్లలో రిలీజైన 11 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. మూవీ కథేంటి? మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ కుర్రాడు గోపాల్ (ఆకాశ్ గోపరాజు). ఇతడు అనాథ. అయితేనేం కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. సొంత మండలానికే హెల్త్ ప్రమోటర్‌గా వెళ్తాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, ఊరురా తిరిగి కండోమ్స్ పంచడం ఇతడి పని. కొన్నాళ్లకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే తన భర్తది సర్కారు నౌకరి అని తొలుత మురిసిపోయిన సత్య (భావన).. కొన్నాళ్లకు ఊరిలో అందరూ అవమానిస్తుంటే తట్టుకోలేకపోతుంది. భర్తని ఉద్యోగం మానేయమంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఎయిడ్స్‌ను నియంత్రించేందుకు గోపాల్ ఏం చేశాడు? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
కుమారుడి సినిమా చూసి ఏడ్చేసిన సింగర్ సునీత
టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ ఈ మధ్యే సర్కారు నౌకరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రొటీన్ సినిమాల మాదిరిగా కాకుండా వైవిధ్యభరితమైన కథ ఎంచుకున్నాడు. తన సినిమా ప్రేక్షకులకు ఓ సందేశాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. అలా అతడు ప్రధాన పాత్రలో నటించిన సర్కారు నౌకరి జనవరి 1న విడుదలైంది. భావన హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. తెలియకుండానే కన్నీళ్లు.. తాజాగా ఈ సినిమా చూసిన సింగర్ సునీత భావోద్వేగానికి లోనైంది. థియేటర్లలో సినిమా చూసిన అనంతరం గాయని మీడియాతో మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే విడుదలకు ముందే సర్కారు నౌకరిని ఎడిట్ చేసేటప్పుడే ఈ సినిమా చూసేశాను. ఇప్పుడు మళ్లీ చూశాక చాలా గర్వంగా అనిపిస్తోంది. హీరోగా కథ నడిపించడమనేది పెద్ద బాధ్యత. ఆకాశ్ చాలా బాగా నటించాడు. ఎప్పుడూ సినిమాల్లో యాక్ట్ చేస్తానమ్మా అని చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదు. నేను సినిమా ఎమోషనల్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే తల్లిగా తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. గుండె బరువెక్కేలా.. కళ్లతో ఎక్స్ప్రెషన్ పలికించే నటులంటే చాలా ఇష్టం. నాకు సినిమాలో ఆకాశ్ కనిపించలేదు. గోపాల్ అనే పాత్ర మాత్రమే కనిపించింది. అందరూ చాలా సహజంగా, అద్భుతంగా నటించారు. హృదయానికి హత్తుకునే సినిమాలను థియేటర్‌కు వచ్చే చూడాలి. కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, కొన్ని ఆహ్లాదాన్నిస్తాయి.. మరికొన్ని గుండె బరువెక్కేలా ఉంటాయి. ఈ చిత్రంలో అన్నీ ఉన్నాయి. ఆకాశ్ ఈ సినిమా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని ఆనందభాష్పాలు రాల్చింది సునీత. చదవండి: అమ్మ నన్ను తెలుగులో తిట్టేది: జాన్వీ -
వైఎస్ఆర్ వల్ల నా కష్టాలు తీరాయి: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఆయన.. విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలామందిని ఓ ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ఆర్థిక భరోసా కల్పించారు. అందుకే ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా అలా తెలుగు యంగ్ డైరెక్టర్.. రాజశేఖర్ రెడ్డి వల్ల తన ఎలా ఈ స్థాయికి చేరుకున్నానో బయటపెట్టాడు. వైఎస్ హయంలో ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది విద్యార్థుల పాలిట వరం అని చెప్పొచ్చు. అప్పట్లో లక్షలాది మంది విద్యార్థులు.. ఈ పథకం వల్ల లాభపడ్డారు. విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో సాఫీగా చదువుకున్నారు. మంచి మంచి ఉద్యోగాలతో పాటు నచ్చిన రంగాల్లో నిలదొక్కుకున్నారు. అలా రీసెంట్గా 'సర్కార్ నౌకరి' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శేఖర్ కూడా ఇలా వైఎస్ఆర్ వల్ల వెలుగులోకి వచ్చిన కుర్రాడు. (ఇదీ చదవండి: యాత్ర 2 టీజర్ వచ్చేస్తోంది!) 2006లో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కోర్స్‌లో జాయిన్ శేఖర్ గంగనమోని.. అప్పట్లో ఏడాది కాలేజీ ఫీజ్ రూ.6,500 కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. మరో దారిలేక తల్లి బంగారం తాకట్టు పెట్టి ఆ ఫీజ్ చెల్లించాడు. తర్వాత ఏడాది కూడా చిన్నచితకా పనులు చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని ఫీజ్ చెల్లించాడు. ఎప్పుడైతే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారో ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. తద్వారా ఈ పథకం వల్ల తనకు ఆర్థిక కష్టాలు తీరాయని దర్శకుడు శేఖర్ చెప్పుకొచ్చాడు. రూ.6,500 చెప్పుకోవడానికి చాలా చిన్న మొత్తం అయినప్పటికీ.. అప్పట్లో తను ఆర్థిక పరిస్థితి వల్ల అదే ఎక్కువగా అనిపించదని అన్నాడు. అయితే వైఎస్ దయ వల్ల ఫీజ్ రీఎంబర్స్మెంట్ వచ్చిందని.. తద్వారా తన కష్టాలు తీరిపోయాయని.. ఆ టైంలో వైఎస్ తనకు దేవుడిలా కనిపించారని శేఖర్ తన తీపి జ్ఞాపకాన్ని సాక్షి ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
YSR వల్లే నా కష్టాలు తీరాయి
-
Sarkaaru Noukari Review: ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ
టైటిల్: సర్కారు నౌకరి నటీనటులు: ఆకాశ్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు నిర్మాత: కె రాఘవేంద్ర రావు దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: శాండిల్య నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: గంగనమోని శేఖర్ ఎడిటర్: రాఘవేంద్ర వర్మ విడుదల తేది: జనవరి 1, 2023 ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన తొలి సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించడంతో చిన్న సినిమా అయినా సరే సర్కారు నౌకరిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేశాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు(జనవరి 1, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. సర్కారు నౌకరి కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1996లో సాగుతుంది. గోపాల్(ఆకాష్ గోపరాజు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి సర్కారు కొలువు(ప్రభుత్వ ఉద్యోగం) సాధిస్తాడు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి హెల్త్ ప్రమోటర్‌గా వెళ్తాడు. పెద్దరోగం (ఎయిడ్స్)పై అవగాహన కల్పిస్తూ, కండోమ్స్ పంచడం అతని డ్యూటీ. సర్కారు నౌకరోడని సత్య(భావన)అతన్ని పెళ్లి చేసుకుంటుంది. గోపాల్ని కొల్లాపూర్ గ్రామస్తులు మొదట్లో చాలా బాగా గౌరవిస్తారు. మండల ఆఫీస్‌లో పనిచేసే సార్ భార్య అంటూ సత్యకు కూడా ఊరి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ గోపాల్ చేసే పని కండోమ్‌లు పంచడం అని తెలిశాక.. ఊరంతా అతని ఫ్యామిలీని అంటరాని వాళ్లుగా పరిగణిస్తారు. బుగ్గలోడు అంటూ గోపాల్ని హేళన చేస్తారు. దీంతో అతని భార్య ఉద్యోగం మానేసి.. వేరే ఊరికి వెళ్దామని కోరుతుంది. గోపాల్ మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోనని చెబుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి సత్య పుట్టింటికి వెళ్తుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్ వ్యాధి మరింత వ్యాపించడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవైపు వరుస అవమానాలు..మరోవైపు భార్య గొడవ..అయినా గోపాల్ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేదు? పెద్దరోగంపై అవగాహన కల్పించేందుకు గోపాల్ ఎం చేశాడు? ఊరి సర్పంచ్(తనికెళ్ల భరణి)ని ఎలా వాడుకున్నాడు? ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగాన్నే గోపాల్ ఎందుకు ఎంచుకున్నాడు? గోపాల్ గతమేంటి? కొల్లాపూర్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సర్కారు నౌకరి చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1996లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్. అప్పట్లో ఎయిడ్స్ వ్యాధి ప్రభావం చాలా ఉండేది. సరైన అవగాహన లేక ప్రజలు ఎయిడ్స్ బారిన పడేవారు. కండోమ్‌ల వాడకం కూడా తెలిసేది కాదు. వ్యాధి ఎలా వస్తుందో కూడా చాలా మందికి తెలిసేదికాదు. అంటూవ్యాధి అంటూ ఎయిడ్స్ బారిన పడిన వారిని ఊరి నుంచి వెలేసేవారు. అలాంటి సంఘటనలు కొల్లాపూర్ గ్రామంలో కూడా జరిగాయట. వాటినే కథగా మలుచుకొని సర్కారు నౌకరి చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఓ మంచి సందేశాన్ని కామెడీ, భావోద్వేగాలు రెండింటిని జొప్పించి కమర్శియల్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కథను తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సహజంగా కథనం సాగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రేక్షకుల మూడ్‌కి పూర్తి విరుద్ధమైన కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకులంతా యానిమల్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సర్కారు నౌకరిలో అలాంటి సన్నివేశాలేవి ఉండవు. కానీ గ్రామీణ నేటివిటీ, మన చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు తెరపై కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఫస్టాఫ్ అంతా చాలా కామెడీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల పెళ్లి, రొమాన్స్.. అప్పట్లో పూర్లో ఉండే పరిస్థితులు, జనాల ప్రవర్తన ఇవన్నీ కాస్త నవ్వులు పంచుతాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. గంగ(మధులత)-శివ(మహదేవ్)ల మధ్య వచ్చే సన్నివేశాలు..పాట ఆకట్టుకుంటుంది. అలాగే శివ పాత్ర ముగింపు, హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా గుండెల్ని పిండేస్తుంది. అయితే కథనం చాలా సహజంగా, చాలా ఎమోషనల్‌గా సాగినా..ప్రేక్షకులను ఫీల్ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్సించడం కోసం హీరో చేసే ప్రయత్నాల్ని తెరపై బలంగా చూపించలేకపోయాడు.కొన్ని చోట్ల కథనం స్లోగా సాగుతూ ఆర్ట్ ఫిల్మ్స్‌ని గుర్తు చేస్తుంది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్య చిత్రాలను ఇష్టపడేవారికి, నైంటీస్ జనరేషన్ వాళ్లకి సర్కారు నౌకరి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సింగర్ సునీత కొడుకు ఆకాశ్ తొలి సినిమా ఇది. అయినా చాలా చక్కగా నటించాడు.తన పాత్రకు తగ్గట్టుగా హవభావాలను పలికించాడు. ఎమోషనల్ సన్నివేశాలల్లో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అనుభవలేమి కనిపించినా..మున్ముందు మంచి నటుడిగా రాణించే అవకాశం ఉంది. గోపాల్ భార్య సత్యగా భావన తనదైన నటనతో ఆకట్టుకుంది. గోపాల్ స్నేహితుడు శివగా మహదేవ్, అతని మరదలు గంగగా మధు లత తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక కొల్లాపూర్ సర్పంచ్‌గా తనికెళ్ల భరణి తన మార్క్ హాస్యంతో కొన్ని చోట్ల నవ్వించాడు. బలగం సుధాకర్ రెడ్డి, సాహితి దాసరి, సమ్మెట గాంధీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. శాండిల్య పాటలు ఆకట్టుకుంటాయి.శేకర్ గంగనమోని కెమెరా వర్క్ బాగుంది. అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
వాస్తవ ఘటనలతో సర్కారు నౌకరి
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భావన హీరోయిన్గా నటించారు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో గంగనమోని శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ‘సర్కారు నౌకరి’ రూపొందింది. ఇందులోని సందేశం, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘సర్కారు నౌకరి’లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ఆకాష్. ‘‘ఈ మూవీతో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు భావన. -
‘సర్కారు నౌకరి’అందరికి నచ్చుతుంది: మూవీ టీమ్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన "సర్కారు నౌకరి" సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక షో వేశారు మేకర్స్. ప్రదర్శన అనంతరం మూవీ టీమ్ మీడియాతో మాట్లాడారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" కంటెంట్ ఓరియెంటెడ్ గా సాగే సినిమా. యదార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాను. సందేశం, వినోదం రెండు కలిసి సినిమా "సర్కారు నౌకరి". అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా కథనాలు ఉంటాయి. రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు హీరోయిన్ భావన మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" లాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కావడం హ్యాపీగా ఉంది. పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా నా క్యారెక్టర్ ఉంటుంది. "సర్కారు నౌకరి" సినిమా ప్రతి ఆడియెన్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మనసును తాకే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కథలో ఉన్నాయి. ఇలాంటి మంచి మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అని చెప్పింది. హీరో ఆకాష్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" మూవీ మా కెరీర్ కు ఫస్ట్ స్టెప్. కొత్త ఏడాదిలో మొదటి రోజు మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగులోనే ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. "సర్కారు నౌకరి"లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో మీకు కనిపిస్తాను. సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా క్యారెక్టర్ కు అన్ని ఎమోషన్స్ తీసుకొస్తాయి. "సర్కారు నౌకరి" సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం.అన్నారు. -
సర్కారు నౌకరి మూవీ టీమ్ తో బిత్తిరి సత్తి స్పెషల్ చిట్ చాట్
-
ఆసక్తికరంగా సర్కారు నౌకరి ట్రైలర్
-
కండోమ్ తెచ్చిన కష్టాలు.. ఆసక్తికరంగా సర్కారు నౌకరి ట్రైలర్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచమవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్ గా నటిస్తోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి, సునీతతో పాటు చిత్రం బృందం పాల్గొంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోపాల్(ఆకాష్)కి ఆరోగ్య శాఖలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లైన భార్య (భావన)తో కలిసి తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు. గ్రామాల్లో నిరోధ్ వాడకం గురించి అవగాహన కల్పించడం అతని పని. కానీ గోపాల్‌కు ఆ ఊరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నిరోధ్ వాడకం గురించి తెలియక వాటిని పిల్లలు ఆడుకునే బుగ్గలుగా చూస్తారు. అంతేకాదు గోపాల్ని బుగ్గలోడు అని హేళన చేస్తారు. గోపాల్ చేసే పని కాపురంలో కూడా చిచ్చు పెడుతుంది. ఆ ఉద్యోగం భార్యకు నచ్చదు. దీంతో ఉద్యోగమో నేనో తేల్చుకోమని భార్య అంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? ఉద్యోగాన్ని ప్రాణంగా భావించే గోపాల్ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేదే మిగతా కథ. ట్రైలర్ కామెడీగా అనిపించినా.. చాలా ఇదొక ఎమోషనల్ స్టోరీలా ఉంది. -
కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వండి
‘‘ఈ వేదికపై ఉన్న చాలా మంది నిర్మాతలు నా సినిమాలతో స్ఫూర్తి పొందామని చెబుతుండటం సంతోషం. మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్తవాళ్లకి చాన్స్ ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు అన్నారు. ఆకాష్ , భావనా వళపండల్ జంటగా గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. కె.రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు. ఆర్కే టెలీఫిలింస్ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘సర్కారు నౌకరి’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేశ్ బాబు, నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు నౌకరి టీజర్.. ఎమోషనలైన సింగర్ సునీత
గాన మాధుర్యంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించే గాయని సునీత. తెలుగులో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న ఈమె తనయుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సర్కారు నౌకరి పేరుతో తీస్తున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. 1996లో కొల్లాపూర్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినయ్.. సర్కారు నౌకరున్నోడు నీ మొగుడు కాబోతుండు అన్న డైలాగ్‌తో హీరో ప్రభుత్వ ఉద్యోగి అని అర్థమవుతోంది. టీజర్ అయితే ఆసక్తికరంగా సాగింది. సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు అన్నారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్‌కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుందని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయనకు నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని చెప్పారు. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతున్నా' అన్నారు. సింగర్ సునీత మాట్లాడుతూ.. 'రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. ఈ సంస్థలో డబ్బింగ్ చెప్పాం, పాటలు పాడాను, ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటిది. నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నా ఇంత ఎమోషనల్ కాలేదు. ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడటం ఉద్వేగంగా ఉంది. రాఘవేంద్రరావు గారు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు సంస్కారం,మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్ లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావొచ్చు. ఈ సినిమాలో నేనొక ప్రమోషనల్ సాంగ్ పాడాను. సర్కారు నౌకరి సినిమా బాగా వచ్చింది' అని చెప్పింది. చదవండి: 8 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. హీరోయిన్గా మారిన డ్యాన్సర్