చేయని తప్పుకు శిక్షా?
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించవలసిన సర్కారు..ముందుచూపు కొరవడి వారిని అగమ్యగోచరంలో పడేసింది. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పు కారణంగా ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికి రెండో కౌన్సెలింగ్ విద్యార్థులు దూరమయ్యారు. ఆ యువలోకం, వారి తల్లిదండ్రుల ఆవేదనకు అద్దంపట్టే ప్రయత్నంలో భాగంగా ‘తప్పెవరిది-శిక్షెవరికి’ అనే అంశంపై మంగళవారం సాక్షి నిర్వహించిన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. వైశాఖీ జల ఉద్యానవనంలో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు, విద్యావేత్తలు సైతం తమ వాణిని కుండబద్దలుకొట్టినట్టు ప్రకటించారు. ఇంజినీరింగ్ రెండో కౌన్సెలింగ్ లేకపోవడంతో దిక్కుతోచని విద్యార్థులకు బాసటగా నిలిచిన సాక్షికి అభినందనలు వెల్లువెత్తాయి.
‘ముందు చూపులేని ప్రభుత్వ విధానాలు, అధికారుల్లో ప్రణాళిక లేమి,సమన్వయలోపం వల్లే రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ గందరగోళంలో పడింది. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు సైతం సీట్లు దక్కించుకోని దుస్థితి ఏర్పడింది. విద్యార్థుల చదువును ప్రభుత్వం కేవలం ఆర్థికభారంగా చూస్తున్నందునే ప్రస్తుతం కౌన్సెలింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎంసెట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఇంజినీరింగ్ సీట్లు ఉన్న నేపథ్యంలో ఎంసెట్‌ను రద్దు చేస్తేనే మేలు. ఇకనైనా ప్రస్తుత అనుభవాలతో ప్రభుత్వ యూనివర్సిటీలకు స్వేచ్చ ఇవ్వాలి’ అని విద్యావేత్తలు, న్యాయనిపుణులు సూచించారు.
సాక్షి చేపట్టిన అక్షర యజ్ఞంతో కచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే బాసటగా నిలబడతామని ముందుకువచ్చారు. ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మంగళవారం నగరంలోని వైశాఖి జల ఉద్యానవనం ఫంక్షన్ హాల్లో ‘తప్పెవరిది? శిక్షెవరికి?’ పేరుతో సాక్షి చర్చావేదిక నిర్వహించింది. దీనికి వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు, సీటు దక్కని బాధితులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమసందేహాలను నిపుణులతో పంచుకున్నారు. తమ కష్టాలను బయటి ప్రపంచానికి తెలియజెప్పి అండగా నిలబడే ప్రయత్నం చేసిన సాక్షిని మనసారా అభినందించారు.
ర్యాంకు వచ్చినా ఫలితం శూన్యం
ప్రొఫెసర్ జేమ్స్ స్టిఫన్, విస్టమ్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్
రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని అంశాలపైనా మాట్లాడుకున్న అధికారులు లక్షలమంది విద్యార్థులకు సంబంధించిన ఎంసెట్ గురించి కనీసం ముందుచూపుతో ఆలోచించలేదు. ప్రణాళిక లేకుండా ఉన్నత విద్యా మండలి పనిచేసింది. విద్యార్థుల బాధలు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు సెకండ్ కౌన్సెలింగ్ లేక నిస్సహాయులుగా మారారు. ఇప్పటికే రాష్ట్రంలో సరైన సమయంలో కౌన్సెలింగ్ జరగక ఎందరో పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లి పోయారు. విద్యార్థులే కాక కాలేజీ యాజమాన్యాలు, అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు సైతం నష్టపోతున్నారు. సెకండ్ కౌన్సెలింగ్ ద్వారా మరింత మంచి అవకాశాన్ని పొందే అవకాశం విద్యార్థికి ఉంటుంది. ఈ చాన్స్ లేకపోవడంతో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా నష్టపోతున్నారు.
ఒకే ఒక్క కౌన్సెలింగ్‌తో అంధకారంలోకి నెట్టేశారు
ఎంసెట్‌లో విజయం సాధించేందుకు పదో తరగతి నుంచే విద్యార్థులు కలలు కంటారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులూ కోరుకుంటారు. కానీ ఒకే ఒక కౌన్సెలింగ్‌తో విద్యార్థులను రోడ్డున పడేశారు. ప్రభుత్వం వచ్చి మూడు నెలలవుతోంది. సరైన ప్రణాళికతో పనిచేసి ఉంటే మూడు దఫాల కౌన్సెలింగ్ పూర్తి చేయవచ్చు. సర్కార్ నిర్లక్ష్యం సామాన్య విద్యార్థులకు శాపంగా మారింది. అసలు ఎంసెట్ కౌన్సెలింగ్ వృథా. లక్షల్లో సీట్లు అందుబాటులో ఉండగా అదే సంఖ్యలో విద్యార్థులున్నారు. అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎంసెట్ ఎందుకు? ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్ ద్వారా న్యాయం చేయవచ్చు. ప్రభుత్వం కూడా ఇకపై యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుంబంధ కాలేజీలకు స్వేచ్చ ఇవ్వాలి. సెకండ్ కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వకపోతే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదముంది.
తల్లిదండ్రులపై భారం లేకుండా చూడాలి
ప్రొఫెసర్ బి.రాజశరత్ కుమార్, లెనోరా ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్
ప్రస్తుత కౌన్సెలింగ్ సంక్షోభం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయలోపం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 30 వేల మంది విద్యార్థులు సెకండ్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాథమిక విద్యకు ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించడాన్ని భారంగా చూస్తోంది. దీని వలనే సమస్యంతా. ప్రభుత్వం ఈ ఫీజుల పథకాన్ని కొనసాగించలేక ఈ ఎత్తులు వేస్తోంది. ఏటా రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రెండు రాష్ట్రాలు భారంగా భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల పెత్తనం పెరుగుతోంది. పేద విద్యార్థులే కౌన్సెలింగ్‌లో మిగిలిపోతున్నారు. నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.