set top box
-
సెట్‌టాప్ బాక్స్‌ల్లేకుండానే టీవీ కార్యక్రమాలు
ముంబై: టీవీల్లో తయారీ సమయంలోనే శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. టీవీల్లో శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉచిత టీవీ చానళ్లను చూడడానికి వీలవుతుంది. రేడియో చానళ్ల ప్రసారాలను కూడా వినొచ్చు. విండో వద్ద లేదంటే మేడ పైన చిన్న యాంటెన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌కు గత డిసెంబర్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ లేఖ కూడా రాయడం గమనార్హం. -
అధిక డేటా.. మరింత వేగం
సాక్షి, అమరావతి: మరింత వేగంగా అధిక డేటాను అందించే విధంగా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) బేసిక్ ప్లాన్‌లో మార్పులను చేసింది. ఇప్పటివరకు ప్రతి నెలా 100 జీబీగా ఉన్న డేటా వినియోగ సామర్థ్యాన్ని 150 జీబీకి పెంచడంతో పాటు ఇంటర్నెట్ వేగాన్ని 15 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడలో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటితో పాటు సోనీ గ్రూపునకు చెందిన స్పోర్ట్స్ చానల్స్, సీఎన్‌బీసీ, జీ గ్రూపునకు చెందిన మొత్తం 10 చానల్స్‌ను అదనంగా అందిస్తున్నట్లు తెలిపారు. కేబుల్ టీవీతో పాటు ఉచితంగా టెలీఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న బేసిక్ ప్లాన్ చార్జీని రూ.300 నుంచి రూ.350కి సవరించినట్లు తెలిపారు. రూ.449, రూ.599 ప్లాన్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీఎస్ఎఫ్ఎల్ 9.2 లక్షల కనెక్షన్లను కలిగి ఉందని, వీటికి అదనంగా మరో 10 లక్షల కనెక్షన్లు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలలో సెట్‌టాప్ బాక్స్‌ల మరమ్మతుల కోసం సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాల కారణంగా నష్టాల్లోకి జారుకున్న సంస్థను తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ పేరుతో జరిపిన కుంభకోణంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. -
సెట్ టాప్ బాక్స్ రీఛార్జ్ అంటూ వచ్చి దారుణం
సాక్షి, లక్నో: నేరగాళ్లు ఏ వైపునుంచి చొరబడి ఎలా ప్రాణాలకు ముప్పు తెస్తారో తెలియని పరిస్థితి. సెట్ టాప్ బాక్స్‌ను రీఛార్జ్ చేయాలంటూ నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఒక మహిళా వైద్యురాల్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆందోళన రేపింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ నిషా సింఘాల్ (38) ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దంతవైద్యురాలుగా పని చేస్తున్నారు. ఈమె భర్త అజయ్ సింఘాల్ సర్జన్‌గా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సెట్ టాప్ బాక్స్ రిపేర్ అంటూ ఇంట్లోకి వచ్చాడు దుండగుడు. అకస్మాత్తుగా నిషాపై కత్తితో దాడిచేసి గొంతుపై దారుణంగా పొడిచాడు. ఆ తరువాత వేరేగదిలో ఉన్న పిల్లలపైనా ఎటాక్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి విధుల్లో ఉన్న నిషా భర్త అజయ్ హుటాహుటిన ఇంటికి చేరి భార్యాపిల్లలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిషా కన్నుమూయగా, చిన్నారులిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కేబుల్ టీవీ టెక్నీషియన్ శుభం పాథక్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం అతడిని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చోరీకి ప్రయత్నించి హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నా మన్నారు. -
సీసీటీవీ అనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు..
న్యూఢిల్లీ: దొంగల ముందుజాగ్రత్త మొదటికే మోసం తెచ్చింది. సీసీటీవీ అనుకుని దొంగలు సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలోని బేగంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పక్కా ప్లాన్‌తో నలుగురు దొంగలు శనివారం మిట్టమధ్యాహ్నం ఓ నగల దుకాణంలో చొరబడ్డారు. ముందుగా ఇద్దరు దొంగలు కస్టమర్లలా షాపులో అడుగుపెట్టారు. ఆ తర్వాత షాపులోకి ప్రవేశించిన మరో ఇద్దరు చేతిలో పిస్టోలు పట్టుకుని అక్కడి జనాలను బెదిరించారు. షాపు మొత్తం కలియతిరిగి నగలు, నగదు ఉన్నదంతా ఊడ్చుకుపోదామని చూశారు. అయితే షాపు యజమాని నగదు ఇవ్వడానికి ససేమీరా ఒప్పుకోలేదు. దీంతో ఓ దొంగ పిస్టోలుతో అతడ్ని బాది డబ్బు లాక్కునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ.1 లక్ష చేజిక్కించుకున్నారు. అయితే ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డవుతుందని భావించిన దొంగల ముఠాలోని ఓ వ్యక్తి సీసీ కెమెరా (డీవీఆర్)ను కూడా ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు. దుకాణమంతా తిరిగి అతనికి కనిపించిన ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు. అయితే అతను ఊహించినట్టుగా అది సీసీ కెమెరా రికార్డు చేసేది కాదు, సెటప్ బాక్స్. వచ్చిన పని ముగించుకుని హాయిగా దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు హుటాహుటిన దుకాణానికి చేరుకున్నారు. అయితే సీసీ టీవీకి బదులుగా సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులకు పెద్దగా శ్రమ కల్పించలేదు. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఎస్డీ మిశ్రా మాట్లాడుతూ.. సీసీటీవీ పుటేజీలో దొరికిన ఆధారాలతో అనుమానితులను గుర్తిస్తామన్నారు. చాలావరకు నగలు భద్రంగానే ఉన్నాయని, వాటిని తెరవడం దొంగలకు సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు. -
జియో ఫైబర్, మరో బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫైబర్‌బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్‌ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్‌ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్‌కు ఉచిత సెట్ టాప్ బాక్స్‌ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో రేపు(సెప్టెంబర్, 5)న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా జియో ఫైబర్ కస్టమర్లు అందరికీ కాంప్లిమెంటరీ ఆఫర్‌గా సెట్ టాప్ బాక్స్ లభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే ఫుల్ హెచ్డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా అందిస్తామని గత నెలలో జరిగిన ఏజీఎంలో ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి : జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ లాంచింగ్ రేపే: రిజిస్ట్రేషన్ ఎలా? -
హాత్వే ఓటీటీ సెట్ టాప్ బాక్స్
ముంబై: కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ఉన్న హాత్వే తాజాగా ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ఓవర్ ద టాప్ సెట్ టాప్ బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఓవర్ ద టాప్ విభాగంలో టీవీ వీక్షణం సులభతరం చేసే లక్ష్యంగా కంపెనీ దీనిని రూపొందించింది. రిమోట్ కంట్రోల్‌కు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే కోసం ప్రత్యేక బటన్లు ఏర్పాటు చేశామని హాత్వే ఎండీ రాజన్ గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతర్జాతీయ, దేశీయ టీవీ సిసీస్, మూవీస్ వంటి కంటెంట్‌ను నేరుగా పొందేందుకు ఈ బాక్స్ తోడ్పడుతుంది. ఫోన్లో ఉన్న కంటెంట్‌ను టీవీలో వీక్షించొచ్చు. గూగుల్ ప్లే కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అల్ట్రా స్మార్ట్ హబ్ పేరుతో కేబుల్ హైబ్రిడ్ బాక్స్‌ను సైతం హాత్వే ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో సినీ నటి రాధిక ఆప్టే, ఆండ్రాయిడ్ టీవీ అపాక్ హెడ్ మార్క్ సీడెన్ఫెడ్ పాల్గొన్నారు. -
జనం నెత్తిన సెట్‘టాప్’ భారం
సాక్షి, అమరావతి: ఇంటింటికీ సెట్‌టాప్ బాక్సుల పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా టీడీపీ సర్కారు మరోసారి అప్పుల భారం మోపింది. పది లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రెండు విడతలుగా రూ.711 కోట్ల అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. తాజాగా 68 లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు కోసం ఏకంగా రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ ఈనెల 10వ తేదీన జీవో 27 జారీ చేసింది. సీఎం సన్నిహితుడికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం ఇళ్లలో టీవీలకు ఇప్పటికే సెట్‌టాప్ బాక్సులున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో ప్రతి ఇంటికి కొత్తగా సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్కెట్లో నాణ్యమైన సెట్‌టాప్ బాక్సు ధర రూ.1,200 నుంచి రూ.1,500 మాత్రమే సర్కారు మాత్రం వీటి ధరను ఒక్కొక్కటి ఏకంగా రూ. 4 వేలుగా నిర్దేశించింది. ఇంకా దీనికి వడ్డీ భారం అదనం. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. వద్దంటూ కేబుల్ ఆపరేటర్లపై జనం ఒత్తిడి ఫైబర్ గ్రిడ్ పేరుతో విద్యుత్ స్తంభాల వెంట ఆప్టికల్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ సెట్‌టాప్ బాక్సుల ద్వారా ప్రసారాలు అందించాలని నిర్ణయించారు. సెట్‌టాప్ బాక్సులను అమర్చుకోవడం ద్వారా కేవలం రూ.149కే టీవీ ప్రసారాలతోపాటు వైఫై, ఫోన్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే వీటిని తీసుకున్న వారు ప్రసారాలు రాకపోవడం, అన్ని చానల్స్ రాకపోవడం, ఆన్ చేసిన ఐదు నిముషాలకుగానీ టీవీ రాకపోవడం తదితర కారణాలతో సెట్‌టాప్ బాక్సులను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. సెట్‌టాప్ బాక్సులు తీసుకున్న చాలా మంది చేతి చమురు వదిలించుకున్నారు. జనం నెత్తిన రూ.4,800 భారం: సెట్‌టాప్ బాక్సులను సర్కారు ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు. కనెక్షన్ కింద నెలకు 149 రూపాయలతో పాటు సెట్‌టాప్ బాక్సుకు నెలకు రూ.100 చొప్పున నాలుగేళ్లు చెల్లించాలి. సెట్‌టాప్ బాక్సు 4,000 రూపాయలైతే అసలు, వడ్డీతో కలిపి నాలుగేళ్లలో మొత్తం 4,800 చెల్లించాల్సి వస్తోంది. నాణ్యత లేని సెట్‌టాప్ బాక్సులను చైనా నుంచి కొనుగోలు చేస్తుండటంతో వీటిని తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని, మరోవైపు తమపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని కేబుల్ ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగవేత...: ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా చైనా నుంచి దిగుమతి చేసుకున్న సెట్‌టాప్ బాక్సులను చైన్నె పోర్టులో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ బాక్సుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం లేవని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతాపరంగా ఈ బాక్స్‌లు ప్రమాదకరమనే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తమైంది. పెద్దలకు కమీషన్లు.. ప్రజలకు అప్పులు! సెట్‌టాప్ బాక్సులు ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ప్రజలకే వదిలేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి మరీ ప్రతి ఇంటికీ అంటగట్టాల్సిన అవసరం ఏమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇళ్లకు మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల నిర్మాణం లాంటి మౌలిక అవసరాల కోసం సర్కారు అప్పులు చేస్తే ఏమైనా అర్థం ఉంటుందని, అప్పులు చేసి మరీ సెట్‌టాప్ బాక్సులను పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనుక భారీ మతలబున్నట్లు బోధపడుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.3,994 కోట్ల అప్పు చేసింది. వీటికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వడంతో వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుందని, ఇది ప్రజలపై భారం మోపడమేనని స్పష్టం చేశారు. పాలకులు అప్పులు చేసి కమీషన్లు తీసుకుని వెళ్లిపోతే ప్రజలకు అప్పులు మాత్రం మిగులుతాయని వ్యాఖ్యానించారు. -
ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు ఊహించని షాక్!
-
సెట్‌టాప్ బాక్సుల తప్పనిసరిపై వివరణ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలోని వీక్షకులు ఈ నెల 31 కల్లా సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాల్సిందేనంటూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
'కొత్త సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలి'
విజయవాడ : జూలై నాటికి ఫైబర్ ఆప్టికల్ గ్రిడ్ పనులు పూర్తవుతాయని.. అయితే వాటికి ప్రస్తుతం ఉన్న సెట్ టాప్ బాక్సులు పనిచేయవు కాబట్టి కేబుల్, ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కోసం కొత్త సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కొత్త సెట్ టాప్ బాక్సుల కోసం చైనా పరిశ్రమను సంప్రదిస్తున్నామని అన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ చేస్తామని, జూన్ 30 నాటికి ఎయిర్ పోర్టు భూములు సేకరిస్తామని అజయ్ జైన్ చెప్పారు. -
సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంపు
హైదరాబాద్ : ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యతతో కూడిన టీవీ ప్రసారాలు పొందేందుకు నిర్దేశించిన డిజిటలైజేషన్ ప్రక్రియ(సెట్ టాప్ బాక్సులు) మూడో దశ గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేబుల్ నెట్వర్క్ డిజిటలైజేషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కేబుల్ టీవీ ద్వారా ప్రసారాలు పొందుతూ ఇప్పటికీ సెట్ టాప్ బాక్సులు తీసుకోనివారికి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. డిజిటలైజేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. -
మరింత చవగ్గా సెట్ టాప్ బాక్సులు
మరో రెండు నెలల్లో తప్పనిసరిగా కేబుల్ వినియోగదారులందరూ సెట్‌టాప్ బాక్సులు పెట్టుకోవాల్సిందే. లేకపోతే ఇక కేబుల్ ప్రసారాలు రావని చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వినియోగదారులకు ఓ శుభవార్త. సెట్‌టాప్ బాక్సులు త్వరలో మరింత చవగ్గా లభించబోతున్నాయి. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) లైసెన్సు ఫీజు బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఒక్కో లైసెన్సుకు రూ. 120- 180 వరకు ఈ ఫీజు ఉండగా, త్వరలోనే ఇది రూ. 32 కాబోతోంది. ప్రస్తుతం సెట్‌టాప్ బాక్సులు రూ. 800-1200 మధ్య లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన బైడిజైన్ అనే సంస్థతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ సి-డాక్ దేశీయంగానే సీఏఎస్ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో ఇది సాధ్యమైంది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 30 కోట్ల వరకు ఉండగా, అందులో దాదాపు రూ. 20 కోట్ల మొత్తాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఇస్తోంది. మిగిలిన 10 కోట్లను బై డిజైన్ సంస్థ భరిస్తుంది.