ఈ శ్రావణ మాసం ఇల్లుని ఇలా తీర్చిదిద్దుకుందామా!
సంప్రదాయ వేడుకలకు వేదిక శ్రావణం. కళ కళలాడే వెలుగులను మోసుకువచ్చే మాసం. తీరైన శోభను తీర్చడానికి శ్రమతోపాటు డబ్బునూ ఖర్చు పెడతారు. ఎక్కువ కష్టపడకుండా పర్యావరణ స్నేహితంగా శ్రావణ మాస వ్రతాలకు, పూజలకు ఎకోఫ్రెండ్లీ థీమ్‌తో ఇంటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో హైదరాబాద్ వాసి డెకార్ నిపుణులు కల్పనా రాజేష్ ఇస్తున్న సూచనలు ఇవి..
ఆకులు అల్లుకున్న గోడ
ఎక్కడైతే వ్రతం పీట పెడతారో ఆ చోట గోడకు తమలపాకులు, విస్తరాకులు, మర్రి ఆకులను ఒకదానికి ఒకటి కుట్టి, సెట్ చేయవచ్చు. మధ్య మధ్యలో బంతిపూలు లేదా గులాబీలు అమర్చవచ్చు. లేదంటే, ఇరువైపులా దండ కట్టి వేలాడదీయవచ్చు. ఏది సహజంగా ఉంటుందో దానిని ఎంపిక చేసుకోవాలి. బ్యాక్‌డ్రాప్‌లో వెదురు బుట్టలను ఉపయోగించవచ్చు.
ఈ బుట్టలకు పూల అలంకారం చేస్తే కళగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలావరకు బ్యాక్ డ్రాప్లో వాడే కర్టెన్స్ ప్రింటెడ్‌వి వచ్చినవి వాడుతుంటారు. వాటిని ఎంపిక చేసుకుంటే మనం అనుకున్న థీమ్ రాదు. ఇక వీటిలో పాలియస్టర్వి వాడకపోవడం మంచిది. ఎకో థీమ్‌లో ఎంత పర్యావరణ హితంగా ఆలోచనను అమలు చేస్తే అంత కళ ఉట్టిపడుతుంది. రంగు రంగుల హ్యాండ్లూమ్ శారీస్‌ను కూడా బ్యాక్ డ్రాప్‌కి వాడచ్చు. వట్టివేళ్లతో తయారుచేసే తెరలు కూడా వాడచ్చు.
అందమైన తోరణం...
మామిడి ఆకులు చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఎలాగూ మామిడి ఆకులు తోరణం కడతారు. అలాగే, ఇప్పుడు వరికంకులతో తోరణాన్ని కట్టచ్చు. వీటిని వేడుక పూర్తయ్యాక మరుసటి రోజు బయట గుమ్మానికి అలంకారంగా వాడచ్చు. ఆ తర్వాత మట్టిలో వేస్తే ఎరువుగా మారిపోతుంది. అమ్మవారికి కట్టే చీర కూడా నారాయణ్‌పేట, ఇక్కత్ వంటి హ్యాండ్లూమ్ పట్టు చీర ఎంపిక చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఫ్రేమ్ చేసుకోవాలంటే మూడు వెదురు కర్రలు తీసుకొని, క్లాత్, అరటి ఆకులతో సెట్ చేయవచ్చు.
ఇత్తడి బిందెలు .. గంటలు
ఇంట్లో బిందెలు ఉంటాయి కదా... వాటిలో మట్టిని నింపి, అరటి చెట్లను సెట్ చేసుకోవచ్చు. స్టీల్ బిందె అయితే నచ్చిన క్లాత్ చుట్టి, మట్టి నింపితే చాలు. కుందులు జత అడుగు పొడవు ఉన్నవి ఎంచుకొని, రెండు వైపులా అమర్చుకోవచ్చు. ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం నింపి, మధ్యలో కొబ్బరిపువ్వు సెట్ చేసి పెడితే ఎంతో అందంగా వచ్చేస్తుంది. అమ్మవారికి మల్లెపూల దండ, కలువపువ్వు మంచి కాంబినేషన్. లేదంటే గులాబీలు పెట్టుకోవచ్చు. గుమ్మం దగ్గర రెండువైపులా పాత కాలం నాటి ఇత్తడి పాత్రలు ఉంటే వాటిలో మొక్కలు పెట్టవచ్చు. ఇత్తడి గంటలు ఉంటే వాటిని డెకార్ ప్లేస్‌లో అలంకారంగా వేలాడదీయవచ్చు. అరటిగెల పెట్టచ్చు.
ప్లాస్టిక్‌కు నో ఛాన్స్
ప్లాస్టిక్ పువ్వులతో వచ్చే అనర్థాలు ఎన్నో. వీటి బదులుగా బంతి, చామంతి, గులాబీ, కొబ్బరి ఆకుతో చేసిన దండలను, కాటన్ దారాలు ఉపయోగించవచ్చు. రంగవల్లికల కోసం రసాయన రంగులు వాడకుండా పువ్వులతో ముగ్గులు వేయచ్చు. ఆర్గానిక్ కలర్స్ వాడుకోవచ్చు. కింద కూర్చోవడానికి కోరాగ్రాస్ చాపలు, కలంకారీ, షోలాపూర్ బెడ్‌షీట్స్ వాడచ్చు.
బొమ్మలతో భలే..
తెలుగు రాష్ట్రాల్లో మనవైన బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి, నిర్మల్, చేర్యాల మాస్క్స్... ఆ బొమ్మలు పెట్టి కూడా అలంకారం చేసుకోవచ్చు. బ్రాస్ ఖరీదు ఎక్కువ అనుకుంటే టెర్రకోట ప్లాంటర్స్, గుర్రపు బొమ్మలు, మట్టి ప్రమిదలు, రంగురంగు గాజులు... వాడవచ్చు.
అతిథులకు ఎకో కానుక
మార్కెట్లో వెదురు బుట్టలు దొరుకుతున్నాయి. పండ్లు, పూలు వంటివి ఈ బుట్టల్లో సెట్ చేయవచ్చు. అతిథులకు అందజేయడానికి ఇవి బాగుంటాయి. రసాయనాలు కలపని ఆర్గానిక్ పసుపు, కుంకుమ ఎంచుకోవాలి. చేనేత బ్లౌజ్ పీస్ పెడితే గిఫ్ట్ ప్యాక్ రెడీ అవుతుంది.
మన దగ్గర ఉన్న పర్యావరణ వస్తువులను సరిచూసుకొని, వాటితో ఎలా అలంకరణను పెంచుకోవచ్చనేది ముందుగా ఆలోచించి, ఆ విధంగా సిద్ధంగా చేసుకుంటే సంతృప్తికరమైన డిజైన్ వస్తుంది. పువ్వులు ఎక్కువ సేపు తాజాగా ఉండటానికి కెమికల్ స్ప్రే చేస్తుంటారు. థర్మోకోల్ మీద ఆకులు పెట్టి చాలా మంది ఎకో ఫ్రెండ్లీ అంటుంటారు. కానీ, మనం ఎంచుకునే థీమ్ మొత్తం తిరిగి మట్టిలో కలిసిపోయే విధంగా ఉంటేనే అది పర్యావరణ హితం అవుతుంది.
– కల్పనా రాజేశ్, డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు