signal free
-
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్‌లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్‌లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్‌లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
బాటసారి.. వేసారి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫ్లై ఓవర్లు, ఇతర పనులకు రూ.25 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నడిచేవారి కోసం కనీసం వందల కోట్లు ఖర్చయ్యే ఫుట్‌పాత్‌లు నిర్మించలేకపోతోంది. వాహనాలకు ఎక్కడా చిక్కులు ఉండరాదని సిగ్నల్‌ఫ్రీగా సాగేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్లుగానే పాదచారులు సాఫీగా నడక సాగించేందుకు ఫుట్‌పాత్‌లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో 6 వేల కి.మీ మేర రహదారులుండగా, ప్రస్తుతం అవి 9100 కి.మీలకు పెరిగాయి. వీటిలో బీటీ, సీసీ, తదితరాలు ఉన్నాయి. రోడ్లు వాహనదారులకు సదుపాయం కాగా, నడిచేవారి కోసం రహదారి పక్కన ఫుట్‌పాత్‌లు లేవు. దీంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కారణాలు అనేకం.. నగరంలో కాలిబాటలు అందుబాటులో లేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వాటి నిర్మాణాన్నే మరిచారు. ప్రధాన రహదారుల వెంబడి కొన్ని ప్రాంతాల్లో పేరుకు అవి కాలిబాటలైనా నడిచేవారికి ఉపయోగపడటం లేదు. వాటిపై వెలసిన దుకాణాలు, ట్రాన్స్ఫార్మర్లు, పబ్లిక్‌టాయ్‌లెట్లు.. వాటర్ ఏటీఎంలు, చెట్లు, అన్నపూర్ణ భోజన కేంద్రాలు తదితరాలతో 50 మీటర్లు కూడా సవ్యంగా నడిచే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మారుస్తామని ఏళ్ల తరబడి ప్రకటనలు చేస్తున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం పనులు మాత్రం చేయలేకపోతోంది. దీంతో పాదచారుల కష్టాలు తీరడం లేదు. గత రెండేళ్లలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొత్తగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టడంతో పాటు అవి పాదచారులకు ఉపయోగపడేలా బొలార్డ్స్, రెయిలింగ్స్ వంటివి ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికీ (2014–15) నగరంలో 452 కి.మీ ఫుట్‌పాత్‌లున్నాయి. గత సంవత్సరం (2021) వరకు 817 కి.మీ.లకు పెరిగాయి. అంటే 365 కి.మీ నిర్మించారు. జోన్‌కు కనీసం 10కి.మీ ఫుట్‌పాత్‌లు నిర్మించాలని రెండేళ్లక్రితం (2020) మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో 75 కి.మీ మేర పనులు చేపట్టి వాటిల్లో 60 కి.మీ మేర పూర్తిచేశారు. మిగతా 15 కి.మీ పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం(సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్ల బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీలు 60 కి.మీ.ల మేర ఫుట్‌ఫాత్‌లు నిర్మించాయి. వీటితో కలిపి గడచిన ఏడేళ్లలో మొత్తం 365 కి.మీ.ల ఫుట్‌పాత్‌లు నిర్మించారు. రోడ్ల వెంబడి తగిన స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌ఫాత్‌లు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: క్యాబ్.. ఓన్లీ క్యాష్!) -
ఫ్లైఓవర్లు రాకముందు.. వచ్చాకా..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద వేల కోట్ల పనులు చేసి పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు. ఇంతకీ వీటివల్ల ప్రజలకు కలిగిన సదుపాయాలేమిటి? మారిన పరిస్థితులేమిటి? ఒనగూరిన ఆర్థిక ప్రయోజనాలేమిటి? వంటి వాటితోపాటు ఇతరత్రా అంశాల అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. సిగ్నల్‌ఫ్రీ ప్రయాణం వల్ల కేవలం ట్రాఫిక్ చిక్కులు తప్పడమే కాదని పర్యావరణ పరంగా వాయు కాలుష్యం, ఇంధన కాలుష్యం తగ్గుతుందని, వాహనాల నిర్వహణ ఖర్చులతోపాటు కాలుష్యం తగ్గడం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు కూడా తగ్గుతాయని, తద్వారా జీవనప్రమాణాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను కేవలం ప్రయాణ మార్గాలుగా మాత్రమే చూడరాదని, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వాటన్నింటినీ సర్వేద్వారా శాస్త్రీయంగా వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాకముందు.. వచ్చాకా.. ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి ఎన్నో పనులు చేపట్టారు. వాటిని పూర్తిచేసేందుకు మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో, శ్మశానవాటికల వద్ద సైతం పనులు చేయాల్సి వచ్చింది. మరోవైపు భూసేకరణ సమస్యలు సరేసరి. యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి కష్టాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తూ పూర్తిచేస్తున్న పనుల వల్ల ఇతరత్రా విధానాలుగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటి గురించి అందరికీ తెలియాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకుగాను ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా పరిగణిస్తూ సదరు జోన్లలో ఫ్లై ఓవర్లు రాకముందు.. వచ్చాక స్థానికుల పరిస్థితులు, ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి కలిగిన సదుపాయాలు, పెరిగిన దుకాణాలు, వ్యాపారాలు, తొలగిన ట్రాఫిక్ చిక్కులు, సాధ్యమైన సాఫీ ప్రయాణం ఇలా వివిధ అంశాలతో జాతీయస్థాయి కన్సల్టెన్సీ సంస్థతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. దాదాపు 9 మాసాల్లో ఈ సర్వే పూర్తి చేసి నివేదికను వెలువరించనున్నట్లు జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాల్లో పెరిగిన మొబిలిటీ, తగ్గిన ప్రయాణ సమయం, రహదారి భద్రత తదితర అంశాలు కూడా అధ్యయనంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులతోపాటు విద్య, వైద్యం, బ్యాంకింగ్,మార్కెటింగ్, తదితర రంగాల్లోని వారి అనుభవాలు సైతం పరిగణనలోకి తీసుకొని వారికి కలిగిన ప్రయోజనాలు సైతం నివేదికలో పొందుపరచనున్నారు. ఈ ప్రాంతాల్లో అధ్యయనం.. నగరంలో ఇప్పటికే పూర్తయిన బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మైండ్‌స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్‌పాస్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ అండర్‌పాస్, కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్ ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 ఫ్లైఓవర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, షేక్‌పేట ఓయూకాలనీ ఫ్లైఓవర్, చింతల్‌కుంట అండర్‌పాస్, కామినేని దగ్గరి రెండు ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్ రెండు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్, బైరామల్‌గూడ రెండు ఫ్లైఓవర్లు, బహదూర్‌పురా ఫ్లైఓవర్, ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్లు, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జిలు ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో పూర్తికానున్న నాగోల్ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ ఫ్లైఓవర్లు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ తదితర ఫ్లైఓవర్లు ఆర్ఓబీలు, ఆర్యూబీల వల్ల ప్రయోజనాల్ని సైతం నివేదికలో పొందుపరచనున్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ ఎస్సార్డీపీలో భాగంగా దానివల్ల కలిగిన ప్రయోజనాలనూ పొందుపరచనున్నారు. (చదవండి: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు) -
Hyderabad: సిగ్నల్ ఫ్రీ చౌరస్తాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ చౌరస్తా అభివృద్ధీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఏవీ. రంగనాథ్ గురువారం చౌరస్తాలో పర్యటించారు. ఆయనతో పాటు ఇంజనీరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ విజయ్‌కుమార్, ఏఈ వెంకటేష్, సీఆర్ఎంపీ మేనేజర్ శ్రీరాంమూర్తి తదితరులు ఇక్కడ ఆయనతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాను ‘సిగ్నల్ ఫ్రీ’ కూడలిగా తీర్చిదిద్దే క్రమంలో ఏమేం చేయాలో చర్చించారు. ఇక నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో నాలుగు వైపులా సిగ్నల్‌తో ప్రమేయం లేకుండానే వాహనాలు తేలికగా ఫ్లో అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా రోడ్డును, ఫుట్‌పాత్‌లను విస్తరించే ప్రణాళికలను రూపొందించనున్నారు. ముఖ్యంగా చౌరస్తాకు నాలుగువైపులా ‘యూ’ టర్న్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని జింఖానా క్లబ్ వద్ద ‘యూ’ టర్న్ కొత్తగా ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1 టీవీ 5 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, ఫిలింనగర్ వైపు వెళ్ళే వాహనాలకు అవకాశం కల్పిస్తారు. చదవండి: (తెలుగు రాష్ట్రాల మధ్య మరో వారధి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..) చౌరస్తాలో ‘ఫ్రీ’ లెఫ్ట్‌లు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 కళాంజలి వద్ద వాహనాలు వన్‌వేలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు వైపు వెళ్తున్నాయి. ఇక్కడ రూట్ చేంజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చౌరస్తాను ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు. -
‘సిగ్నల్ ఫ్రీ’.. రాకపోకలు సాఫీ
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: లక్డీకాపూల్‌లో గురువారం నుంచి అమల్లోకి వచ్చిన సిగ్నల్ ఫ్రీ విధానం ఫలితాలనిచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు మెహిదీపట్నం వైపు, డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్ వైపు వెళ్లాలంటే లక్డీకాపూల్ జంక్షన్లో ఉన్న సిగ్నల్ వద్ద ఆగాల్సి వచ్చేది. దీనివల్ల ఇటు బస్టాప్‌తో పాటు అటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు సైతం ట్రాఫిక్ జామ్ అయ్యేది. తాజాగా ‘సిగ్నల్ ఫ్రీ’ విధానం అమలుతో రాకపోకలు కొంతమేర సాఫీగా సాగాయి. వాహనచోదకులు తడబడకుండా నగర ట్రాఫిక్ పోలీసులు లక్డీకాపూల్ జంక్షన్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంచి అవగాహన కలిగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త వంతెన వైపు వెళ్లే సమయంలో ఇబ్బంది ఏర్పడకుండా జంక్షన్ వద్ద బారికేడ్లు ఉంచారు. అయితే, వీటి కారణంగా డీజీపీ కార్యాలయం నుంచి వచ్చి నిరంకారి వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. మరోపక్క రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చిన వారు సైతం కొత్త వంతెన పైకి వెళ్లే యత్నంలో జంక్షన్ వద్ద ఆగిపోతున్నారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు మైకు ద్వారా సూచనలిస్తూ మార్గనిర్ధేశం చేశారు. అయోధ్య చౌరస్తా వద్ద సిమెంట్ దిమ్మెలు తొలగించి ఏర్పాటు చేసిన మార్గం వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులు.. మెహిదీపట్నం వైపు వెళ్లాల్సిన వారు నేరుగా వెళ్లొచ్చని సూచనలు చేశారు. కొత్త విధానం అమలుతో రెండు వంతెనలపై రద్దీ దాదాపు సమానమైంది. మరో మూడ్రోజుల్లో ఇది అందరికీ అర్థమయ్యేలా చేస్తామని సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా ఇన్స్పెక్టర్ మదన్మోహన్ తెలిపారు. ఇదొక్కటే ప్రస్తుత ఇబ్బంది.. లక్డీకాపూల్ పాత వంతెన నుంచి వచ్చిన వాహనాలు అయోధ్య వద్ద ఏర్పాటు చేసిన కొత్త దారి నుంచి వెళ్తూ ఎడమ వైపునకు తిరిగి బజార్‌ఘాట్‌కు వెళ్లాలని ప్రయత్నించడం ఇబ్బందులు సృష్టిస్తోంది. వీరి వల్ల కొత్త వంతెన మీదుగా వచ్చే వాహనాలన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి పరిష్కారంగా కొత్తగా ఇచ్చిన దారికి ఎడమ వైపు ఉన్న కొలాప్సబుల్ డివైడర్లను మరింత ముందుకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఇక, బజార్‌ఘాట్, ఫ్యాప్సీల వైపు వెళ్లే వారు కచ్చితంగా కొత్త వంతెన మీదుగానే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవే మార్గాల నుంచి వచ్చి నిరంకారి భవన్ వైపు వెళ్లే ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలు అయోధ్య జంక్షన్ నుంచి మాసబ్‌ట్యాంక్ మార్గంలో ప్రయాణించి పీటీఐ బిల్డింగ్ వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని గమ్యాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.