ఖైరతాబాద్, న్యూస్‌లైన్:
లక్డీకాపూల్‌లో గురువారం నుంచి అమల్లోకి వచ్చిన సిగ్నల్ ఫ్రీ విధానం ఫలితాలనిచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు మెహిదీపట్నం వైపు, డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్ వైపు వెళ్లాలంటే లక్డీకాపూల్ జంక్షన్‌లో ఉన్న సిగ్నల్ వద్ద ఆగాల్సి వచ్చేది. దీనివల్ల ఇటు బస్టాప్‌తో పాటు అటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు సైతం ట్రాఫిక్ జామ్ అయ్యేది. తాజాగా ‘సిగ్నల్ ఫ్రీ’ విధానం అమలుతో రాకపోకలు కొంతమేర సాఫీగా సాగాయి. వాహనచోదకులు తడబడకుండా నగర ట్రాఫిక్ పోలీసులు లక్డీకాపూల్ జంక్షన్‌లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంచి అవగాహన కలిగించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త వంతెన వైపు వెళ్లే సమయంలో ఇబ్బంది ఏర్పడకుండా జంక్షన్ వద్ద బారికేడ్లు ఉంచారు. అయితే, వీటి కారణంగా డీజీపీ కార్యాలయం నుంచి వచ్చి నిరంకారి వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. మరోపక్క రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చిన వారు సైతం కొత్త వంతెన పైకి వెళ్లే యత్నంలో జంక్షన్ వద్ద ఆగిపోతున్నారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు మైకు ద్వారా సూచనలిస్తూ మార్గనిర్ధేశం చేశారు. అయోధ్య చౌరస్తా వద్ద సిమెంట్ దిమ్మెలు తొలగించి ఏర్పాటు చేసిన మార్గం వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులు.. మెహిదీపట్నం వైపు వెళ్లాల్సిన వారు నేరుగా వెళ్లొచ్చని సూచనలు చేశారు. కొత్త విధానం అమలుతో రెండు వంతెనలపై రద్దీ దాదాపు సమానమైంది. మరో మూడ్రోజుల్లో ఇది అందరికీ అర్థమయ్యేలా చేస్తామని సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా ఇన్‌స్పెక్టర్ మదన్‌మోహన్ తెలిపారు.
ఇదొక్కటే ప్రస్తుత ఇబ్బంది..
లక్డీకాపూల్ పాత వంతెన నుంచి వచ్చిన వాహనాలు అయోధ్య వద్ద ఏర్పాటు చేసిన కొత్త దారి నుంచి వెళ్తూ ఎడమ వైపునకు తిరిగి బజార్‌ఘాట్‌కు వెళ్లాలని ప్రయత్నించడం ఇబ్బందులు సృష్టిస్తోంది. వీరి వల్ల కొత్త వంతెన మీదుగా వచ్చే వాహనాలన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి పరిష్కారంగా కొత్తగా ఇచ్చిన దారికి ఎడమ వైపు ఉన్న కొలాప్సబుల్ డివైడర్లను మరింత ముందుకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఇక, బజార్‌ఘాట్, ఫ్యాప్సీల వైపు వెళ్లే వారు కచ్చితంగా కొత్త వంతెన మీదుగానే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవే మార్గాల నుంచి వచ్చి నిరంకారి భవన్ వైపు వెళ్లే ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలు అయోధ్య జంక్షన్ నుంచి మాసబ్‌ట్యాంక్ మార్గంలో ప్రయాణించి పీటీఐ బిల్డింగ్ వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని గమ్యాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.
‘సిగ్నల్ ఫ్రీ’.. రాకపోకలు సాఫీ
Published Fri, Nov 15 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement